*అచ్చెన్నాయుడి కుటుంబానికి లోకేశ్‌ భరోసా* శ్రీకాకుళం: ఈఎస్‌ఐ ఆసుపత్రుల మందుల కొనుగోళ్ల వ్యవహారంలో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి కుటుంబ సభ్యులను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పరామర్శించారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ విచ్చేసిన లోకేశ్‌కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. తొలుత ఎర్రన్నాయుడి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అచ్చెన్న నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పి, భరోసా కల్పించారు. ఏపీ తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు పలువురు తెదేపా నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈఎస్‌ఐ కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న విషయం తెలిసిందే. కేసుకు సంబంధించి రెండు రోజులుగా ఏసీబీ అధికారులు అచ్చెన్నను ప్రశ్నిస్తున్నారు.


Comments