*ఉండవల్లిలో తెదేపా నేతల అరెస్టు..ఉద్రిక్తత* అమరావతి: ఉండవల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైకాపా సర్కారు ప్రజావేదిక కూల్చి ఏడాది కావడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించాలని తెదేపా నేతలు నిర్ణయించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించారు. ప్రజావేదిక వద్దకు వచ్చే నాలుగు రహదారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. తెదేపా నేతల వాహనాలు మినహా మిగతా వాటిని అనుమతించారు. ఉండవల్లి కరకట్ట వద్దకు చేరుకున్న తెదేపా నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, టి.శ్రావణ్‌కుమార్‌, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, రాజేంద్రప్రసాద్‌, బచ్చుల అర్జునుడు తదితరులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, తెదేపా నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ... పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. తెదేపా నేతలను అప్రజాస్వామికంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. అరెస్టు చేసిన తెదేపా నేతలను పోలీసు వాహనంలో మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


Comments