పోలీసు అమరవీరుల సంస్మరణ దినం’లో పాల్గొన్న సీఎం శ్రీ వైయస్ జగన్:* *శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం* *ఇందులో ఎవరికీ మినహాయింపులు లేవు* *మహిళలు, పిల్లలు, వృద్ధుల రక్షణ* *పౌరులందరి భద్రత విషయంలో పోలీసులు రాజీ పడొద్దు* *బడుగు, బలహీన వర్గాలపై కులపరమైన దాడులను ఉపేక్షించొద్దు* *కారకులు ఎవరైనా వదిలి పెట్టవద్దు, చట్టం ముందు నిలబెట్టండి* *ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ వెల్లడి* *మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ బిల్లు, పోలీసు స్టేషన్లు* *దిశ చట్టానికి కేంద్రం నుంచి ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నాం* *నాలుగేళ్లలో, నాలుగు దశల్లో పోలీసు పోస్టుల భర్తీ* *ఏటా 6500 పోస్టుల్లో నియామకాలు. జనవరి నుంచి షెడ్యూల్* *‘పోలీసు అమరవీరుల సంస్మరణ’ కార్యక్రమంలో సీఎం ప్రకటన* *విజయవాడ (ప్రజాఅమరావతి): అక్టోబర్,21; పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియమ్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన ముఖ్యమంత్రి ఆ తర్వాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీసులపై రచించిన ‘అమరులు వారు’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. *ఆ పోలీసులకు సమాజం జేజేలు:* ఈరోజు పోలీసు అమర వీరులను దేశం యావత్తూ స్మరించుకునే రోజు అన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్, పోలీసుల త్యాగాలను 61 ఏళ్లుగా గుర్తు చేసుకుంటున్నామని చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన ప్రతి పోలీసుకు, ఆ కుటుంబానికి మన సమాజం జేజేలు పలుకుతుందని ఆయన పేర్కొన్నారు. పోలీసుల క్యాప్‌పై నాలుగు సింహాలు ఉంటాయని, నాలుగు వైపుల నుంచి ఏ ఆపద వచ్చినా కాపాడతారన్న నమ్మకానికి అవి నిదర్శనమని చెప్పారు. సారనాథ్ స్థూపం నుంచి తీసుకున్న ధర్మచక్రం, దాని కింద ఉన్న సత్యమేవ జయతే అన్న వాక్యం.. అధికారం అనేది ఎంతటి బాధ్యతో చెబుతుందన్నారు. *తక్కువ నేరాలు ఓ ఇండికేటర్:* ఒక దేశం అభివృద్ధికి సూచిక తలసరి ఆదాయం అని చెబుతారన్న సీఎం శ్రీ వైయస్ జగన్, కానీ దానికి మించిన ఇండికేటర్ నేరాల సంఖ్య తక్కువగా ఉండడం అని పేర్కొన్నారు. అందుకే ఫిన్‌ల్యాండ్, నార్వే, స్విట్జర్లాండ్ వంటి దేశాలు గొప్పగా కనిపిస్తాయన్న ఆయన, మానవ అభివృద్ధికి నేరాల రేటు తక్కువగా ఉండడం కూడా ఒక ప్రమాణం అని చెప్పారు. అయితే అభివృద్ధి చెందుతున్న మన దేశంలో అలాంటి పరిస్థితి రాత్రికి రాత్రి వస్తుందని అనుకోవడం లేదంటూ, అయినా క్రైమ్ రేటు తగ్గించడానికి మన పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. *శాంతి భద్రతలు అత్యంత ప్రాధాన్యం:* ‘శాంతి భద్రతలు అనేది మన ప్రభుత్వంలో టాప్‌మోస్ట్ ప్రయారిటీ. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదు. ప్రత్యేకించి మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధుల రక్షణ విషయంలో, మొత్తం మీద పౌరులందరి రక్షణ, భద్రత విషయంలో పోలీసులు ఏ మాత్రం రాజీ పడొద్దు. అలాగే బడుగు, బలహీన వర్గాల వారి మీద కులపరమైన దాడులు, హింస జరుగుతుంటే కారకులను ఏ మాత్రం ఉపేక్షించకుండా చట్టం ముందు నిలబెట్టండి. తీవ్రవాదాన్ని, అసాంఘిక శక్తులను, సంఘ విద్రోహ కార్యకలాపాలను ఏ మాత్రం ఉపేక్షించొద్దు. ఈ విషయంలో పెద్ద, చిన్న అంటూ చూడొద్దని గతంలోనూ చెప్పాను. మరోసారి కూడా స్పష్టం చేస్తున్నాను’ అని సీఎం శ్రీ వైయస్ జగన్ వెల్లడించారు. *‘దిశ’ను ఆమోదిస్తారని ఆశిస్తున్నాను:* దిశ బిల్లు తీసుకు రావడం దగ్గరి నుంచి, రాష్ట్రంలో 18 దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయడం, వాటిలో ఎక్కువగా మహిళలనే నియమించడం, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించడం దగ్గర నుంచి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం కోసం అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. దిశ బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించడం అందరికి తెలిసిన విషయమే అన్న సీఎం, త్వరలోనే దిశ బిల్లుకు ఆమోదం వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. *మహిళల భద్రత:* ‘దేశంలోనే మహిళా భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్రం మనది అని కూడా గట్టిగా చెబుతా ఉన్నాను. ఆ దిశలో సంకేతాలు ఇచ్చేందుకు, గట్టి చర్యలు తీసుకునేందుకు, మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో హోం మంత్రిని, నా సోదరి సుచరితమ్మను హోం మంత్రిగా కూడా చేయడం జరిగింది’ అని ముఖ్యమంత్రి తెలిపారు. *మీ కష్టం నాకు తెలుసు:* ‘ఇక్కడే ఒక విషయం చెప్పదల్చుకున్నాను. పోలీసుల కష్టం నాకు తెలుసు. ఈ కోవిడ్ సమయంలో గ్రామ, వార్డు సచివాలయాలు మొదలు పోలీసులు విధి నిర్వహణలో, రాష్ట్ర డీజీపీ వరకు ఏ స్థాయిలో పని చేశారన్నది మనందరికీ తెలిసిన విషయమే. మనం అందరం కూడా చూశాం. ఇందులో అసువులు బాసిన వారికి ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తా ఉన్నాను. నిరంతరం ప్రజల్లో ఉండే పోలీసు సోదరులకు, అక్క చెల్లెమ్మలకు, ఎండనక వాననక, రాత్రనక, పగలనక ఎంత కష్టపడతారో నాకు తెలుసు’. ‘టెక్నాలజీ విసిరే సవాళ్లు, కోవిడ్ వంటి ప్రపంచ వ్యాప్త హెల్త్ ఎమర్జెన్సీలు, ఇసుక అయినా, మద్యం అయినా దొంగదారి పడుతుంటే చట్టం అమలు చేయడంలో వారు పడుతున్న అదనపు శ్రమ.. ఇవన్నీ కూడా నాకు తెలుసు’ అని స్పష్టం చేసిన సీఎం శ్రీ వైయస్ జగన్, పోలీసు ఉద్యోగాల భర్తీని ప్రస్తావించారు. *పోలీసు ఉద్యోగాల భర్తీ:* శాఖలో ఇప్పటి వరకు ఉన్న ఖాళీలు, వీక్లీ ఆఫ్ దృష్ట్యా, అదనంగా కావాల్సిన సిబ్బందిని కూడా దృష్టిలో ఉంచుకుని పోలీసు ఉద్యోగాల భర్తీకి డిసెంబరులో నోటిఫై చేస్తూ, జనవరి నుంచి షెడ్యూల్ ఇవ్వాల్సిందిగా డీజీపీని కోరడం జరిగిందని సీఎం శ్రీ వైయస్ జగన్ వెల్లడించారు. నాలుగు సంవత్సరాల్లో, నాలుగు దశల్లో ఏటా 6500 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చామని, అదే విధంగా గత మూడు సంవత్సరాలుగా పోలీసు సంక్షేమ నిధికి ఇవ్వాల్సిన నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. *ఉక్కుపాదం మోపండి:* రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే అసాంఘిక శక్తుల మీద, లంచగొండితనం, అవినీతి, రౌడీయిజమ్, నేర ప్రవర్తన వంటి వాటి మీద నిజాయితీగా, నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదం మోపాలని సీఎం శ్రీ వైయస్ జగన్ స్పష్టం చేశారు. *చివరగా..* పోలీసు అమర వీరుల కుటుంబాలకు సంపూర్ణ న్యాయం చేస్తామన్న మాట ఇస్తూ, అమరులైన ప్రతి ఒక్కరి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు మంచి జరగాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ సెలవు తీసుకుంటున్నానంటూ ముఖ్యమంత్రి తన ప్రసంగం ముగించారు. హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో పాటు, పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Popular posts
మెప్మా రిసోర్స్ పర్సన్స్ కు ప్రభుత్వం వరం.
• GUDIBANDI SUDHAKAR REDDY

కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ఈఎల్ఐ పథకం ద్వారా విస్తృత ప్రయోజనాలు: ప్రాంతీయ పి ఎఫ్ కమిషనర్ అబ్దుల్ ఖాదర్
• GUDIBANDI SUDHAKAR REDDY
కష్టంలో అండగా...
• GUDIBANDI SUDHAKAR REDDY

Government to Launch ‘NAVYA’ – A Joint Pilot Initiative for Skilling Adolescent Girls Under Viksit Bharat@2047 Vision tomorrow.
• GUDIBANDI SUDHAKAR REDDY
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం.
• GUDIBANDI SUDHAKAR REDDY

Publisher Information
Contact
prajaamaravathi@gmail.com
9347530295
D.NO. 16-4, A, KOLLIPARA VILLAGE AND MANDAL, DIST. GUNTUR -522304, ANDHRA PRADESH
About
Praja Amaravati is a monthly magazine
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
Post a Comment