*బీడు భూములు ఇక సస్యశ్యామలం* *జలకళతో మెట్టభూములు కళకళ* *పేద రైతుల కన్నీళ్లు తుడిన ముఖ్యమంత్రి* *ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి* కురుపాం (ప్రజా అమరావతి), నవంబర్ 15: రాష్ట్రంలో మెట్ట భూములకు కూడా సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ‘వైయస్సార్ జలకళ’ పథకంతో బీడు భూములు కూడా సస్యశ్యామలమవుతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు. ఈ పథకంతో సిఎం మెట్టభూముల రైతుల కన్నీళ్లు తుడిచారని కితాబిచ్చారు. కురుపాం పంచాయతీ పరిధిలోని కస్పాగదబవలస గిరిజన గ్రామంలో ఆదివారం వైయస్సార్ జలకళ పథకాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను తన పాదయాత్రలో స్వయంగా చూసిన జగన్మోహన్ రెడ్డి వారికి అండగా నిలుస్తానని, మెట్ట భూముల్లో ఉచితంగా బోర్లు వేయిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారని, నవరత్నాల్లో భాగమైన ఆ హామీని జలకళ పథకం ద్వారా నెరవేర్చారని చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లు ద్వారా వారి మెట్ట భూములకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాలకు లోపు భూమి కలిగిన రైతులందరూ కూడా ఈ పథకంలో లబ్ది పొందడానికి అర్హులేనని వివరించారు. బోరు వేయడంతో పాటుగా దానికి అవసరమైన మోటారును, విద్యుత్ సరఫరాను కూడా ప్రభుత్వమే ఉచితంగా సమకూరుస్తుందని చెప్పారు. రెండున్నర ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన రైతులు ఇతర రైతులతో కలిసి ఉమ్మడిగా బోర్లు వేయించుకోవచ్చునన్నారు. ఒకసారి బోరు విఫలమైతే మరోసారి కూడా బోరు వేయించుకొనే అవకాశం ఉంటుందని గుర్తు చేసారు. జలకళ పథకంలో బోర్లు వేయడానికి ముందు శాస్త్రీయ పరిశీలనలు చేసిన తర్వాతనే బోర్ పాయింట్ ను గుర్తించడం జరుగుతుందని, ఈ కారణంగా బోర్లు విఫలమైయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీని కోసం ప్రభుత్వం జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 9 రిగ్ లను కూడా సమకూర్చిందని పుష్ప శ్రీవాణి వెల్లడించారు. గతంలో మెట్ట రైతులు తమకు ఆర్థిక స్థోమత లేకపోయినా అప్పులు చేసి బోర్లు వేయించుకొనే వారని, ఆ బోర్లు విఫలమైతే అప్పుల ఊబిలో కూరుకుపోయేవారని చెప్పారు. ఈ కష్టాలను కడతేర్చడానికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని తీసుకొచ్చారని వివరించారు. వైయస్సార్ జలకల పథకం ద్వారా ప్రభుత్వం చితంగా వేయించే బోర్లతో ఇప్పటి దాకా బీడువారిన లక్షలాది ఎకరాల భూములు సస్యశ్యామలమవుతాయని, మెట్టభూముల రైతుల కళ్లల్లోనూ ఆనందకాంతులు నిండుతాయని అభిప్రాయపడ్డారు. ఈ పథకాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బోర్లు వేయించుకోవడానికి, మోటార్లు, విద్యుత్ కనెక్షన్లు తీసుకోవడానికి ఎవరికీ పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి తన పదిహేడు నెలల పాలనలోనే తాను రైతు పక్షపాతి అని నిరూపించుకున్నారని, రాష్ట్రంలో ఉన్నది రైతు రాజ్యమని అందరికీ అర్థమైయ్యేలా చేసారని, రైతుల కన్నీళ్లు తుడిచారని పుష్ప శ్రీవాణి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎన్నికల కన్వీనర్ బొంగు సురేష్, మాజీ జడ్పీటీ పద్మా వతి,మాజీ ఎంపీటీసీ గొర్లి సుజాత, కురుపాం, జియ్యమ్మవలస వైసీపీ పార్టీ కన్వీనర్ లు ఎం. గౌరిసంకరరావు ,ఐ. గౌరిసంకరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరావు, వైస్సార్సీపీ మైనార్టీ నాయకులు షేక్ నూరుల్లా, కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కె.సురేష్, రజక కార్పొరేషన్ డైరెక్టర్ గోరిశెట్టి గిరిబాబు, ఐరుక కార్పొరేషన్ డైరెక్టర్ గవర విజయ్ చంద్ర శేఖర్, ఎంపీడీఓ మురళీకృష్ణ, ఉపాధి హామీ ఏపిడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.