*కన్నతల్లికి భోజనం పెట్టలేనివాడు, పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానని చెప్పినట్లుగా ఉన్నాయి విజయసాయిరెడ్డి మాటలు* *మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు* విజయసాయిరెడ్డి నిన్న విశాఖలో నిర్వహించిన పాదయాత్రలో ఆయన మాట్లాడిన మాటలు వింటే అందరికీ నవ్వోస్తోందని, విశాఖనగరం అందమైన ప్రదేశమని, దాన్ని అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందని ఆయన చెప్పడం చూస్తుంటే, ఇదివరకు ఒక సినిమాలోని నెల్లూరు పెద్దారెడ్డి మేనల్లుడి పాత్రలో బ్రహ్మనందం పలికే డైలాగులు గుర్తుకొస్తున్నాయని, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాకు వెల్లడించాలనుకున్న తన సందేశాన్ని వీడియో రూపంలో విడుదల చేశారు. విశాఖనగరాన్ని నెల్లూరు నుంచి వచ్చిన విజయసాయిరెడ్డి అభివృద్ధి చేస్తానంటే అక్కడి ప్రజలు ఎవరూ నమ్మరని, ఈ ప్రభుత్వం వచ్చాక విశాఖలో జరిగిన అభివృద్ధేమిటో చెప్పాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. విశాఖలో విధ్వంసం తప్ప మరోటి చేయలేదని, వాల్తేర్ క్లబ్, గ్రామ సమాజం, బేపార్క్ వంటి వాటితో మొదలుపెట్టి విలువైన భూమలున్నింటినీ కబ్జా చేసింది వాస్తవం కాదా అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. దివంగత సినీ నిర్మాత రామానాయుడు విశాఖలో స్టూడియో ఏర్పాటు చేయాలనుకున్న భూమిని కూడా కొట్టేయడానికి ఏ2 సిద్ధమవ్వడమే కాకుండా, సింహాద్రి అప్పన్నస్వామి భూములను కూడా మింగేయాలని చూస్తున్నాడన్నారు. విశాఖ బీచ్ రోడ్డులో చంద్రబాబునాయుడు చేసిన పనులు తప్ప మీరు చేసిందేమీ లేదన్నారు. మాన్సాస్ ట్రస్ట్ భూములు, గ్రావెల్ క్వారీలు సహా దేన్ని వదలని వారు విశాఖను అభివృద్ది చేస్తున్నామని చెప్పడం దారుణమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన గీతం కాలేజీ గోడలు పగులగొట్టి, మీయొక్క విద్వంసాన్ని కొనసాగించలేదా అని అయ్యన్న మండిపడ్డారు. ఇంతచేసి కూడా ప్రజలను మభ్యపెట్టేలా మాయమాటలు చెప్పడం విజయసాయికే చెల్లిందన్నారు. వైసీపీ ప్రభుత్వం దెబ్బకు విశాఖకు వచ్చిన కంపెనీలన్నీ భయపడి వేరే ప్రాంతాలకు తరలిపోయాయన్నారు. ఇక రాష్ట్రంలో అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులను ఈ ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేసింది వాస్తవం కాదా అన్నారు. ఉత్తరాంధ్రకు ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ లో మీ ప్రభుత్వం వచ్చిన ఈ 18 నెలలలో తట్టెడు మట్టి వేసిన దాఖలాలు లేవన్నారు. పనులు చేయకపోగా ప్రాజెక్ట్ ఎత్తుని తగ్గిచడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. విశాఖకు రైల్వేజోన్ తెస్తామని చెప్పినవారు, ప్రధాని మెడలు వంచుతామని బీరాలు పలికిన వారు, ఇప్పుడు ఢిల్లీలో ఏం గడ్డి పీకుతున్నారో విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ అక్కడి వారికి దండాలు పెట్టిరావడం తప్ప చేసింది శూన్యమన్నారు. ఒంట్లో సిగ్గు, లజ్జ ఉన్నవారెవరూ ఈ విధంగా విశాఖను అభివృద్ధి చేస్తున్నామని మాట్లాడరని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. వెనకటికి ఎవరో అన్నట్లు కన్నతల్లికి భోజనం పెట్టలేనివాడు, పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానని చెప్పినట్లుగా విజయసాయిరెడ్డి మాటలున్నాయన్నారు. విశాఖ నగరవాసులు ఎప్పటికీ కూడా విజయసాయి రెడ్డి లాంటి దోపిడీ దారులను, దొంగలను ప్రోత్సహించరనే నిజాన్ని ఆయన తెలుసుకుంటే మంచిదన్నారు. పంది ఎంత బలిసినా నంది కాదనే కఠిన నిజాన్ని కూడా ఆయన గ్రహిస్తే మంచిదన్నారు. క్రిమినల్, ఏ2 అయిన విజయసాయిరెడ్డి ఇక నుంచైనా వళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడితే మంచిదని అయ్యన్నపాత్రుడు హితవు పలికారు.


Comments