*ముఖ్యమంత్రి ఉదారగుణానికి నిదర్శనమిదే : ఐ.టీ, పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి* *రెండో విడత 'వైఎస్ఆర్ నేతన్న నేస్తం' ద్వారా రూ.21.37 కోట్లు నేతన్నల ఖాతాలకు* *గతంలో ఏ ప్రభుత్వం చేయనంత, ఎన్నడూ లేనంతగా చేనేతలకోసం ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు, లబ్ధిదారులు, నిధుల మంజూరు* *దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులైన మరో 8,903 మందికి చేనేతలకు లబ్ది* *అర్హత ఒక్కటి తప్ప మిగతావేవీ చూడని ప్రభుత్వం మాది* *కష్టం తెలిసిన సీఎం కనుకనే ఏ కష్టం రాకుండా పరిపాలన* అమరావతి (prajaamaravati), నవంబర్, 11; అర్హత కలిగిన వారెవరూ అవకాశాన్ని కోల్పోకుండా చూడాలని చెప్పే ముఖ్యమంత్రి ఉదారగుణానికి 'వైఎస్ఆర్ నేతన్న నేస్తం' నిదర్శనమని చేనేత, జౌళి శాఖ మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు ఏ ఇబ్బంది ఉందో, ఎలా ఆ సమస్యను పరిష్కరించాలో పూర్తిగా తెలిసిన మనిషని స్పష్టం చేశారు. రెండో విడత 'వైఎస్ఆర్ నేతన్న నేస్తం' అర్హత కలిగిన తాజా జాబితాలో 8,903 మంది నేతన్నలకు నేరుగా వారి ఖాతాలకు ఆన్ లైన్ ద్వారా రూ.21.37 కోట్లను జమ చేసినట్లు పేర్కొన్నారు. సొంత మగ్గం కలిగి దారిద్ర్య రేఖకు దిగువనున్న ప్రతి చేనేత కుటుంబానికి ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ద్వారా ఏటా రూ.24 వేలను అందించడం మునుపెన్నడూ జరగలేదని మంత్రి తెలిపారు. నేతన్నల కష్టం తెలిసి సాయం చేసే సీఎం జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం హయాంలో మగ్గాలను ఆధునీకరించుకుని మరింత నైపుణ్యవంతమైన మెళకువలు ప్రదర్శించి మంచి పేరు తెచ్చుకోవాలని చేనేత కుటుంబాలకు మంత్రి మేకపాటి పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న నిస్వార్థ, నిష్పక్షపాత వైఖరిని అందిపుచ్చుకుని అధికార యంత్రాంగం ప్రభుత్వ కృషిని మరింత ప్రజలకు చేరువ చేయాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. చేనేతల జీవనోపాధి ప్రత్యేకమైనదని, అందరికీ సాధ్యం కాదని, విలువైన ఆ కళకు సరైన విలువను తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా సహా పలు జిల్లాల నేతలు, నేతమ్మలతో మంత్రి మేకపాటి మాట్లాడారు. ఇప్పటికే గతేడాది డిసెంబర్ 21వ తేదీన అనంతపురంలోని ధర్మవరంలో 'వైఎస్ఆర్ నేతన్న నేస్తం' తొలి విడతలో భాగంగా 81,783 చేనేత కుటుంబాలకు రూ.196.28 కోట్లు పంపిణీ చేసిన విషయాన్ని మంత్రి మేకపాటి ప్రస్తావించారు. ఆ తర్వాత కరోనా కష్టకాలంలో ఆరు నెలలు ముందుగానే గత జూన్ నెల 20వ తేదీన కూడా 81,024 మంది అర్హులైన నేతన్నలకు ముఖ్యమంత్రి రెండవ విడతగా రూ.194.46 కోట్లు అందించారన్నారు. అయితే వివిధ కారణాల వల్ల దరఖాస్తు చేసుకోని వారికి మరో నెల గడువు సీఎం ప్రకటించి అవకాశం కల్పించిన నేపథ్యంలో ఇవాళ ఆ మిగతా నేతన్నలకు కూడా ముందుగానే దీపావళి వెలుగులు వచ్చేలా సీఎం చేశారని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. దీంతో దాదాపు 90వేల చేనేతల కుటుంబాలకు 'వైఎస్ఆర్ నేతన్న నేస్తం' అందిందని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. చేనేతల కళలకు తగ్గ విలువ, బ్రాండ్ తీసుకువచ్చేలా ఈ - మార్కెటింగ్ ను తర్వలో తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లతో ఒప్పందం చేసుకొని ఆన్లైన్ లో ఆప్కో వస్త్రాలు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. చేనేత పరిశ్రమకు భరోసా ఇవ్వడమే కాకుండా , ఆర్థికంగా నేతన్న లాభపడే విధంగా ఉత్పత్తులకు ప్రభుత్వమే సర్టిఫికేషన్, మార్కెటింగ్, బ్రాండింగ్ కు కూడా కృషి చేస్తామన్నారు, ధర్మవరం, ఉప్పాడ, వెంకటగిరి చీరలు, డ్రస్ మెటిరియల్స్, చొక్కాలు, ధోవతులు సహా మొత్తం 104 ఉత్పత్తులు ఆన్ లైన్ లో కి తెచ్చామని వాటిని నేటి యువత బాధ్యత తీసుకోవాలన్నారు. అధునాతన ఫ్యాషన్లు, ఆకర్షణీయమైన వస్త్రధారణ పట్ల మక్కువ చూపే యువతే చేనేత వస్త్రాలు ధరించి, వినియోగించి, కొనుగోలు చేసి నేతన్నల బంగారు భవిష్యత్ లో భాగం కావాలని మంత్రి మేకపాటి పిలుపునిచ్చారు.


Comments