Amravati (prajaamaravati), *సోమశిల ప్రాజెక్టు హైలెవెల్‌ లిఫ్ట్‌ కెనాల్‌ రెండో దశ పనులను క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌:* *నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురంలో పైలాన్‌ ఆవిష్కరణ:* ఈ కాలువ ద్వారా దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి, మర్రిపాడు, అనంతసాగరం, ఆత్మకూరు మండలాల్లోని 46,453 ఎకరాలకు సాగు నీరందనుంది. రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో పనులు అప్పగించడం వల్ల రూ.459 కోట్లకే టెండర్‌ ఖరారైంది. దీని వల్ల ఖజానాపై రూ.68 కోట్ల భారం తగ్గింది. *ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..* – పెన్నా నీటిని సద్వినియోగం చేసుకుంటూ, ఇవాళ నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల మెట్ట ప్రాంతాలకు సాగు, తాగు నీరు అందించే సోమశిల రెండో దశ పనులకు ఇక్కడి నుంచి పునాది వేస్తున్నాను. – నీటి విలువ, వ్యవసాయం విలువ తెలిసిన ప్రభుత్వంగా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలలోనిమెట్ట ప్రాంతాలకు నీరు అందించే సోమశిల రెండో దశ పనులకు ఈరోజు వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తున్నాను. – ఈ పనుల ద్వారా ఆత్మకూరు నియోజకవర్గంలో 10,103 ఎకరాలు, ఉదయగిరి నియోజకవర్గంలో 36,350 ఎకరాలకు.. మొత్తంగా 46,453 ఎకరాలకు కొత్తగా నీటి సదుపాయం కల్పించడం జరుగుతుంది. – ఇందుకోసం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లుగా కంప సముద్రం, గుండె మడకల రిజర్వాయర్ల నిర్మాణం, క్రాస్‌ మిషనరీ (సీఎం), క్రాస్‌ డ్రైనేజీ (సీడీ) పనుల ద్వారా 18.5 కి.మీ గ్రావిటీ కాల్వల నిర్మాణం. పంపింగ్‌ స్టేషన్, రెండు ఎలక్ట్రో ప్రెషర్‌ మెయిన్లు.. వీటన్నింటిని నిర్మించబోతున్నాం. – గతంలో ఇదే ప్రాజెక్టును రూ.527.53 కోట్లతో గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా పనులు మొదలు పెట్టినా ఏదీ జరగలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లడం ద్వారా వ్యయాన్ని రూ.459 కోట్లకు తగ్గించడం జరిగింది. తద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.68 కోట్లు ఆదా అయింది. – ఒకే పనికి గతంలో రూ.527 కోట్లు, ఇప్పుడు అదే పనికి రూ.459 కోట్లు అంటే రివర్స్‌ టెండరింగ్‌ ద్వారాఅవినీతికి చెక్‌ పెట్టడం జరిగింది. ఇలా ఎక్కడా అవినీతికి తావు లేకుండా ప్రతి చోటా చర్యలు చేపడుతున్నాం. – ఈ ప్రాజెక్టులో రూ.68 కోట్లు మిగిలించి ఇవాళ పనులు మొదలు పెడుతున్నాం. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేస్తాం. *మరో విషయం:* – ఇదే నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ పనులు కూడా పూర్తయ్యే దశలో ఉన్నాయి. వచ్చే జనవరిలో వాటిని ప్రజలకు అంకితం చేయబోతున్నాం. – వాటి పనులు నత్తనడకన జరుగుతా ఉంటే, పరిస్థితి మార్చాం. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాం. దేవుడి దయతో పనులు పూర్తవుతున్నాయి. – దీంతోపాటు సోమశిల కండలేరు డబ్లింగ్‌ వర్క్స్‌,12 వేల క్యూసెక్కుల నుంచి 24 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి రూ.918 కోట్ల వ్యయంతో పెంచబోతున్నాం. – అదే విధంగా సోమశిల–రాళ్లపాడు డబ్లింగ్‌ వర్క్స్‌, 720 క్యూసెక్కుల నుంచి 1440 క్యూసెక్కుల సామర్థ్యానికి రూ.632 కోట్ల వ్యయంతో పెంచబోతున్నాం. – సాగునీటి రంగంలో జలయజ్ఞం ద్వారా ప్రాధాన్యత క్రమంలో పనులు కొనసాగిస్తున్నాం. 2022 ఖరీఫ్‌ నాటికి నీరు ఇచ్చే విధంగా, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. *ఈ ఏడాదిలో ఆరు ప్రాధాన్యత ప్రాజెక్టులు*.. వంశధార ఫేజ్‌–2. వంశధార–నాగావళి అనుసంధానం, వెలిగొండ ఫేజ్‌–1, అవుకు టన్నెల్, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాం. *మూడు రాజధానులతో పాటు, మూడు ప్రాంతాలకు సమ న్యాయం చేస్తాం.* రాష్ట్రానికి సంబంధించిన సాగు నీటి పనుల్లో ఎక్కడా రాజీ పడబోము. – మూడు ప్రాంతాలకు సమ న్యాయం చేయాలన్న ఉద్దేశంతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు నీరు, తాగు నీటి అవసరాలు తీర్చే విధంగా రూ.40 వేల కోట్లతో రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు చేపడుతున్నాం. – ఉత్తరాంధ్రకు నీటి పరంగా న్యాయం చేసేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని సాకారం చేసేలా రూ.15 వేల కోట్ల ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో రూ.3500 కోట్ల విలువైన పనులకు త్వరలో టెండర్లు పిలవబోతున్నాం. – పల్నాడులో కరువు నివారణ కోసం వైయస్సార్‌ పల్నాడుకరువు నివారణ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. – కృష్ణా నది దిగువన రెండు బ్యారేజీలు, పైన ఒక బ్యారేజీ నిర్మాణంతో పాటు, చింతలపూడి లిఫ్ట్‌ పనుల వేగాన్ని పెంచుతున్నాం. – నీటి విలువ, రైతు విలువ, నీటి ద్వారా ప్రాంతాలకు జరిగే ఆర్థిక న్యాయం, అవసరం తెలిసిన ప్రభుత్వంగా చిత్తశుద్ధితో ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తాము. – దేవుడి దయ, మీ అందరి ఆశీస్పులతో ఇంకా పనులు, కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అంటూ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రసంగం ముగించారు. ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఆ శాఖ ఈఎన్‌సీ నారాయణరెడ్డి కార్యక్రమంలో పాల్గొనగా, పైలాన్‌ ఆవిష్కరణ వద్ద మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, పలువులు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.


Comments