ట్రైకార్ నిధులు దుర్వినియోగం కాకుండా చూడండి • మరింత మంది యువతకు ఉపాధి కల్పించండి • అల్లూరి, లంబసింగి మ్యూజియంల నిర్మాణం వేగవంతం చేయండి అమరావతి (prajaamaravati), నవంబర్ 11: ట్రైకార్ ద్వారా గిరిజన సంక్షేమానికి వినియోగించే నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని, పథకాల అమలులో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయాన్ని తగ్గించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి కోరారు. గిరిజన యువతకు మరింతగా ఉపాధి కల్పించే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో గిరిజన నిరుద్యోగుల పేరిట ఇచ్చిన ఇన్నోవా వాహనాల విషయంగా సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు. విశాఖలో నిర్మించే అల్లూరి, లంబసింగిలో నిర్మించనున్న గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియంల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కూడా ఆదేశాలను జారీ చేసారు. ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పుష్ప శ్రీవాణి బుధవారం గిరిజన సంక్షేమశాఖకు చెందిన ట్రైకార్, ట్రైబల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (టీఆర్ఎం) విభాగాల సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగానే గిరిజన మ్యూజియంల నిర్మాణంతో పాటుగా కాఫీ తోటల పెంపకం, పెరటికోళ్ల పెంపకం, పాడిపరిశ్రమ, స్కిల్ డెవలప్ మెంట్ తదితర అంశాలపై కూడా చర్చించి దిశానిర్దేశం చేసారు. ఈ సందర్భంగానే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, ట్రైకార్ ద్వారా చేపట్టే కార్యక్రమాల ద్వారా గిరిజన యువతకు మరింత ఎక్కువగా ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరారు. టైకార్ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని, పథకాల అమలులో ప్రైవేటు వ్యక్తులు, ఎన్జీవోల ప్రమేయాన్ని తగ్గించాలని సూచించారు. కోట్లాది రుపాయల వ్యయంతో చేపట్టే పథకాలను ఎన్జీవోల ప్రమేయం లేకుండా అమలు చేయలేరా? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రస్తుతం ట్రైకార్ ద్వారా రూ.27 కోట్లతో అమలు చేస్తున్న పెరటి కోళ్ల పెంపకం, రూ.60 కోట్లతో అమలు చేయనున్న పాడిపశువుల పెంపకం పథకాల అమలుతీరును పునస్సమీక్షించి అవసరమైన మార్పులు చేయాలని కోరారు. సరైన ఫలితాలివ్వని పథకాల వల్ల ప్రయోజనం ఉండదన్నారు. రైతుల నుంచి కాఫీ గింజలను జీసీసీ సేకరించే ప్రక్రియలో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం కారణంగా జీసీసీ, గిరిజన రైతులు నష్టపోతున్నారని, ఈ వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తుల ప్రాబల్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా గిరిజన యువతకు ఉపాధి కల్పించడానికి చేపడుతున్న శిక్షణా కార్యక్రమాలు, తద్వారా ఉపాధి పొందిన గిరిజన యువత సంఖ్య పట్ల అసంతృప్తి వ్యక్తం చేసారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు గిరిజన యువతకు ట్రైకార్ ద్వారా ఇచ్చిన ఇన్నోవా వాహనాల పంపిణీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై సమగ్ర నివేదికను తనకు అందించాలని పుష్ప శ్రీవాణి ఆదేశించారు. మ్యూజియంల నిర్మాణాన్ని వేగవంతం చేయండి: కాగా విశాఖపట్నంలోని కాపులుప్పాడ ప్రాంతంలో అట్లూరి సీతారామరాజు మ్యూజియం, లంబసింగిలో గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం నిర్మాణాలను వేగవంతం చేయాలని టీఆర్ఎం అధికారులను కోరారు. అల్లూరి మ్యూజియం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే మంజూరు చేసిన నిధులతో నిర్మాణపనులను వీలైనంత త్వరగా చేపట్టాలని సూచించారు. అలాగే లంబసింగిలో నిర్మించనున్న గిరిజన సమరయోధుల మ్యూజియం నిర్మాణానికి నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ మ్యూజియం నిర్మాణానికి లంబసింగిలో రాష్ట్రప్రభుత్వం 21 ఎకరాల భూమిని కూడా కేటాయించిందని వెల్లడించారు. లంబసింగి మ్యూజియం శంకుస్థాపనకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తామని పుష్ప శ్రీవాణి తెలిపారు. టీఆర్ఎం పనితీరు మరింతగా మెరుగుపడేలా చూడాలన్నారు. దీనికోసం అవసరమైన సిబ్బందిని నియమించడానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ ఎండి ఈసా రవీంద్రబాబు, ఇ.ఎన్.సి. ప్రసాద్ తో పాటుగా పలువురు అధికారులు హాజరయ్యారు.


Comments