ఏలూరు (prajaamaravati), 12. జనవరి 26నాటికి గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో గురువారం గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలపై రెండవ రోజు గురువారం జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, కొవ్వూరు, భీమవరం, చింతలపూడి, భీమడోలు, పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యు ఎస్ ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భవనాల నిర్మాణం జనవరి 26 కల్లా పూర్తి చేసెలా ఇప్పటివరకు ప్రారంభం కాని వాటికి తక్షణమే పనులు ప్రారంభించాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న బిల్డింగ్ పనులపై స్టేజ్ లవారి నివేదిక ఇవ్వాలన్నారు. భవనాల నిర్మాణం పూర్తి చేయాల్సిన బాధ్యత ఇంజనీరింగ్ అసిస్టెంట్లదే అని, ఆలస్యమైతే వారే బాధ్యత వహించాలని అన్నారు. గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. భవన నిర్మాణాల ఆలస్యానికి ఏజెన్సీలను బాధ్యత చేయకూడదని, పూర్తి బాధ్యత ఇంజనీరింగ్ అసిస్టెంట్ లదే అని వివరించారు. రేయింబవళ్ళు పనులు జరగాలని అవసరమైతే ఫ్లడ్ లైట్ వెలుగులో పనులు చేపట్టి పూర్తి చేసేలా అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. భవన నిర్మాణాలకు కేటాయించిన స్థలానికి రహదారి లేకపోతే వాటిని ఉపాధి హామీ లో చేపట్టి పూర్తి చేయాలన్నారు. కేటాయించిన స్థలంలో నీళ్లు నిల్వ ఉన్నాయనే శాకులు చెప్పవద్ధన్నారు. కొన్ని మండలాల్లోని గ్రామాల్లో భవనాల నిర్మాణం నేటికీ బేస్ మెంట్ స్థాయిలోనే ఎందుకు ఉన్నాయని వివరణ కోరారు. మూడు భవనాల నిర్మాణం ఒకేసారి జరగాలన్నారు. నిర్మాణాల్లో దశల వారీగా పూర్తి అయిన వాటికి బిల్లు లను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయటం వల్ల చెల్లింపులు సులభతరం అవుతాయన్నారు. భవన నిర్మాణ పనులపై ప్రతివారం సమీక్ష ఉంటుందని ప్రగతి చూపని వారిపై చర్యలు తప్ప వని జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ హెచ్చరించారు. సమీక్షా సమావేశంలో డిఆర్ డి ఎ పిడి ఉదయ భాస్కర్ రావు, పంచాయతీరాజ్ ఎస్ ఇ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఇ జె వి రాఘవులు ఉన్నారు.