రైస్ కార్డుల జారీలో వేగం పెంచండి. *రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు జేసీ కిషోర్ కుమార్ ఆదేశం* *దీపావళి సందర్భంగా భద్రతా చర్యలు చేపట్టాలని సూచన* *విజయనగరం (prajaamaravati), నవంబర్ 12: జిల్లాలో రైస్ కార్డుల జారీలో వేగం పెంచాలని, నిరీక్షణ జాబితా సంఖ్య తగ్గించాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులను జేసీ కిషోర్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైస్ కార్డుల జారీ ప్రక్రియపై సమీక్ష చేశారు. నిరీక్షణ జాబితా ఎక్కువుగా ఉంటుందని, దీన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కరించాలని సూచించారు. సచివాలయంలో నమోదు అయిన వెంటనే పరిశీలించి త్వరితగతిన కార్డు జారీ చేయాలని చెప్పారు.* *ఎప్పటికప్పుడు వీఆర్వోలను ఫీల్డ్ కి పంపిస్తూ సమస్యను సత్వరమే పరిష్కరించాలని తహశీల్దార్లను ఆదేశించారు. దీపావళి సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను అందరూ తప్పకుండా అమలు చేయాలని పేర్కొన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. స్థానిక రెవెన్యూ, పోలీస్ శాఖ సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి దీపావళి పండుగలో ఎటువంటి అపశృతి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్ లో ఆయనతో పాటు, జిల్లా పౌరసరఫరాల అధికారి పాపారావు, పార్వతీపురం సబ్ కలెక్టర్ విదేఖర్, విజయనగరం, పార్వతీపురం మున్సిపల్ కమిషనర్లు, వివిధ మండలాల తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.


Comments