ఏలూరు (prajaamaravati), 13. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో గ్రామసచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలపై మూడవ రోజైన శుక్రవారం జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, తణుకు, తాడేపల్లిగూడెం, గోపాలపురం, నరసాపురం నియోజకవర్గ పరిధిలోని సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యు ఎస్ ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భవనాల నిర్మాణం జనవరి 26 కల్లా పూర్తి చేయాలని, ఎర్త్ లెవెల్, బేస్మెంట్ స్థాయిలో ఉన్నవాటిని వేగవంతం చేయాలన్నారు. జరుగుతున్న భవన నిర్మాణ పనులు దశలవారీ నివేదిక ఇవ్వాలన్నారు. భవనాల నిర్మాణం పూర్తిబాధ్యత ఇంజనీరింగ్ అసిస్టెంట్లదే అని అన్నారు. సెలవులో ఉన్న, కోవిడ్ వైరస్ బారిన పడిన ఇంజినీరింగ్ అసిస్టెంట్ ల స్థానంలో ఇంఛార్జి లను నియమించాలని అన్నారు. గ్రామ సచివాలయం లో బాధ్యతలు నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఇప్పటివరకూ చేసిన పనులను ఆరాతీశారు. గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు నిర్మాణ పనులలో ఇబ్బందులు ఎదురైతే పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ల దృష్టికి తీసుకువచ్చి సమన్వయం చేసుకోవాలన్నారు. భవన నిర్మాణాలకు ఎంపిక చేసే ఏజన్సీ ఒకటి కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోవాలన్నారు. రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణం కొన్ని మండలాల్లోని గ్రామాల్లో ప్రారంభించకపోవ టాన్ని గుర్తించటం జరిగిందని అక్కడ తక్షణమే పనులు జరగాలన్నారు. ఆరునెలలు అయినప్పటికీ నేటికీ ప్రగతి చూపకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని తెలుపు తుందన్నారు. కనీసం మండల కేంద్రాల్లోని భవన నిర్మాణాలు అయినా పూర్తి చేయాలన్నారు. కేటాయించిన స్థలానికి దారిని ఉపాధి హామీలో చేప ట్టాలన్నారు. కొన్ని మండలాల్లోని గ్రామాల్లో భవనాల నిర్మాణం ఏస్థాయిలో ను ప్రారంభించకపోవటం పట్ల జాయింట్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు భవనాల నిర్మాణం ఒకేసారి జరగాలన్నారు. నిర్మాణ పనులపై ప్రతివారం సమీక్ష ఉంటుందని ప్రగతి చూపని వారిని ఉపేక్షించేది లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ హెచ్చరించారు. సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్ ఎస్ ఇ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఇ జె వి రాఘవులు ఉన్నారు.


Comments