భీమవరం.(prajaamaravati), 16. పాదయాత్రలో కోట్లాది మంది కష్టాలను స్వయంగా చూసి తెలిసికొన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ వాటి పరిష్కారమే మానిఫెస్టోగా రూపొందించి, అమలుచేస్తూ అందరి మన్నలను పొందుతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) అన్నారు. ప్రజలలో నాడు... ప్రజల కోసం నేడు జననేత పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పదిరోజుల ప్రజాసంకల్పయాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా సోమవారం భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), మహిళాభివృద్ధి, శ్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు తానేటి వనిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ మూడు సంవత్సరాల క్రితం జననేత నిర్వహించిన పాదయాత్ర భీమవరం మీదుగా జరగటాన్ని గుర్తుచేస్తూ, దేశంలో ఎవరూ చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కోట్లాది ప్రజల కష్టాలను, సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారమే మేనిఫెస్టోగా రూపొందించుకొని అందరి మన్ననలను పొందుతున్నారని మంత్రి అన్నారు. సంవత్సర కాలంలో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని, హామీని నెరవేరుస్తూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమపాలన అందిస్తున్నారని మంత్రి అన్నారు. నాడు చంద్రబాబు పాదయాత్ర చేసి అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారని,నేటి వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు నూరు శాతం అమలు చేసి అందరి ప్రజలతో జేజేలు అందుకుంటున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు మధ్య తేడాలను గమనించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రతి పేదవాడికి అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తూ జనరంజక పాలన అందిస్తున్నారని మంత్రి అన్నారు. గత ప్రభుత్వ కాలంలో భీమవరం నియోజవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని, నేడు స్థానిక శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి ఇందుకు తార్కాణం అన్నారు.12 కోట్ల రూపాయలకు పైగా విలువైన నాలుగు ఎకరాల స్థలాన్ని ఆసుపత్రి నిర్మాణానికి ఉచితంగా ఇచ్చి ప్రాణదానం చేస్తున్న శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్ అనిమంత్రి అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయనీ, ఇదే క్రమంలో నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న 100పడకల ఆసుపత్రి,25ఎకరాలలో డంపింగ్ యార్డ్ వంటి ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు. శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్ సేకరించి ఇచ్చిన ఎనభై రెండు ఎకరాలలో టిడ్కో గృహాలు నిర్మించి గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. టిడ్కో గృహాల విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించే విధంగా నాయకులు వాస్తవాలను తెలపాలన్నారు. కుల, మత రాజకీయాలకు అతీతంగా టిడ్కో గృహాల విషయంలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.నియోజకవర్గంలో ప్రతి సమస్యను పరిష్కరించేందుకు తనవంతు సహకారం ఉంటుందని మంత్రి ఆళ్ల నాని హామీ ఇచ్చారు. రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. విద్య, వైద్య ,ఆరోగ్య ,వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఆయా రంగాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి పని చేస్తున్నారన్నారు. మహిళల రక్షణకు దిశ చట్టం అమలు చేస్తూ, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. మద్యపాన నిషేధం అమలు చేస్తూ అధికారంలోకి రాగానే 40 వేల బెల్ట్ షాపులు రద్దు చేశామన్నారు. చిన్న, సూక్ష్మ రైతులను దృష్టిలో పెట్టుకొని వారికి అండగా జలకళ కార్యక్రమం ద్వారా బోర్లను ఉచితంగా వేయించి ఆదుకుంటున్నామన్నారు. భవిష్యత్ తరాలకు కూడా ముఖ్యమంత్రిగా జగన్ ఉండాలని ఆశీర్వదించాలని మంత్రి తానేటి వనిత కోరారు. శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి అమలు చేస్తున్న నవరత్నాల కార్యక్రమం ద్వారా అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయన్నారు. వంద పడకల ఆసుపత్రి కి శంకుస్థాపన నిర్వహించడం పట్ల మంత్రులకు శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. ఆసుపత్రి నిర్మాణానికి తొలివిడతగా రూ.10 కోట్ల 15లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని, మరో 23 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపించామని శాసనసభ్యులు వివరించారు. టిడ్కో హౌసింగ్ విషయంలో ఉన్న అపోహలను తొలగించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్ అన్నారు. మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు.. భీమవరం రూరల్ గొల్లవానితిప్పవద్ద వంద పడకల ఆసుపత్రి భవన శంకుస్థాపన కార్యక్రమానంతరం మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(ఆళ్ల నాని), తానేటి వనిత శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో మంత్రులకు కు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు మంత్రులకు పూర్ణకుంభంతో, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వచనం పలికి అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను మంత్రులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు శ్రీ గ్రంథి.శ్రీనివాస్,శ్రీ ముదునూరి. ప్రసాద రాజు,డి.సి.సి.బి. చైర్మన్ శ్రీ కవురు.శ్రీనివాస్,డి.సి.యం.యస్.చైర్మన్ శ్రీ యడ్ల.తాతాజీ,యం.బి.సి.కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పేండ్ర.వీరన్న,మాజీ శాసన సభ్యులు శ్రీ పాతపాటి. సర్రాజు, ఉండి నియోజక వర్గం కన్వీనర్ శ్రీ పి.వి. యల్.నరసింహ రాజు, ఏ.యం.సి.చైర్మన్ శ్రీ తిరుమాని.ఏడుకొండలు , రాష్ట్ర నాయకులు శ్రీ కోయ్యే. మోషేన్ రాజు, నాయకులు శ్రీ పేరిచర్ల.విజయ నరసింహ రాజు,శ్రీ కలిదింది.చిన్న బంగార్రాజు,శ్రీ కలిదిండి.ఫణీంద్ర రాజు,వివిధ శాఖలు అధికారులు , నాయకులు,అభిమానులు పాల్గొన్నారు.


Comments