కళ్యాణమస్తుకు మూడు ముహూర్తాలు ఖరారు.


కళ్యాణమస్తుకు మూడు ముహూర్తాలు ఖరారు.ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డికి లగ్న పత్రిక అందించిన పండిత మండలి.


శ్రీవారి పాదాల చెంత లగ్న పత్రిక ఉంచి ప్రత్యేక పూజలు.

       

 తిరుమల‌ (ప్రజా అమరావతి): తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా పునఃప్రారభించనున్న కళ్యాణమస్తు 

( సామూహిక వివాహాలు) కోసం పండిత మండలి బుధవారం మూడు ముహూర్తాలను ఖరారు చేసింది. టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డికి లగ్న పత్రికను అందించింది.


 తిరుమల నాద నీరాజనం వేదిక మీద బుధవారం ఉదయం శ్రీ గోపావజ్జల బాల సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని, శ్రీ అర్చకం వేణుగోపాల దీక్షితులు, శ్రీ వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్యులతో కూడిన పండిత మండలి సమావేశమైంది.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కళ్యాణమస్తు నిర్వహణకు దివ్యమైన ముహూర్తాలను పరిశీలించింది.


 శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వివాహం చేసుకునే జంటలు ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యాలతో జీవించగలిగే శుభ లగ్నాలను పరిశీలించింది.


 శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మూడు దివ్యమైన లగ్నాలు ఖరారు చేసింది. ఇందులో వైశాఖ బహుళ విదియ శుక్రవారం మూల నక్షత్రం సింహ లగ్నం తేదీ

 28 – 5- 2021 మధ్యాహ్నం 12-34 నుంచి 12 – 40 నిముషముల మధ్య ఒక ముహూర్తం నిర్ణయించారు. ఆశ్వయుజ బహుళ పక్ష తత్యాల దశమి శనివారం మఖ నక్షత్రం ధనుర్లగ్నం తేదీ 

30 – 10 – 2021 ఉదయం 11-04 నుంచి 11-08 గంటల మధ్య రెండవ ముహూర్తం పండితులు నిర్ణయించారు. అలాగే కార్తీక మాసం శుక్లపక్ష తత్యాల చతుర్దశి బుధవారం అశ్విని నక్షత్రం ధనర్లగ్నం తేదీ 17- 11- 2021 ఉదయం

9 -56 నుంచి 10 -02 గంటల మధ్య మరో ముహూర్తం నిర్ణయించారు.


 ఈ మూడు ముహూర్తాలతో లగ్న పత్రికను రాసి టీటీడీ ఈవో డాక్టర్ జవహర్ రెడ్డికి అందించారు. అదనపు ఈవో శ్రీ ఎ. వి. ధర్మారెడ్డి, హిందూధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్ర నాథ్, విజిఓ శ్రీ బాలిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


 అనంతరం లగ్న పత్రికను శ్రీ వేంకటేశ్వర స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.