ఇంటింటికి అనగా గడపగడపకు రేషన్ పంపిణీ


 ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (APRSA).

 

  

ఇంటింటికి అనగా గడపగడపకు రేషన్ పంపిణీ కార్యక్రమము రూపొందించి తద్వారా పేదలకు రేషన్ పంపిణీ లో పారదర్శకతను పెంచి రాష్ట్ర ప్రజలకు సాంత్వన కలిగించే ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ వారికి ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తరఫున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాము.


 ప్రజా పంపిణీ క్షేత్రస్థాయిలో రెవెన్యూ ఉద్యోగులు అనగా VRO నుండి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు పథకం విజయవంతంగా అమలు పరచుటకు సరళీకృతం మరియు సులభతరం చేయుటకు అవలంబించవలసిన విధివిధానాల రూపకల్పన చేయుట గురించి ఒకసారి సమీక్ష చేయవలసిందిగా నేడు రాష్ట్ర కమీషనర్ ఆఫ్ సివిల్ సప్లిఎస్ వారిని ఆంద్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ (APRSA) అసోసియేషన్ పక్షాన కలిసి స్వయంగా ఈ క్రింది తెలిపిన సమస్యలు/ఇబ్బందులు *వినతిపత్రం ద్వారా* వారి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. 


 అందులో ప్రధానంగా...


 *1)* పౌరసరఫరాల శాఖ నిబంధనల ప్రకారం ప్రతి రోజు ఉదయం ఐదున్నర గంటలకు మొదలవ్వాలి అంటే ఐదు గంటలకు ఈ పాస్ వెబ్సైట్ లో లాగిన్ అవ్వాలి అంటే పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ ఉద్యోగులు తదితర సిబ్బంది వారి ఇంటి నుండి తెల్లవారుజామున నాలుగు గంటలకు బయలుదేరి MDUs (Mobile Dispensary Units - మినీ క్యాబ్)ను సిద్ధం చేసుకుని వేళకాని  వేళల్లో విధులకు ప్రతి రోజూ హాజరు అవ్వాలి అంటే చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నారని మరీ ముఖ్యంగా మహిళా అధికారులు/ఉద్యోగినులు ఎదుర్కొంటున్న  సమస్యలు వర్ణనాతీతం అని కేవలం నెలలో 20 రోజులపాటు ఇదే కార్యక్రమంలో ఉన్నందున, రెవెన్యూ ఉద్యోగుల రోజు వారీ విధులకు ప్రత్యేకంగా కాలపరిమితి ( Before SLP) లోపు చేయవలసిన పనులు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాల పనులకు పూర్తిగా ఆటంకం కలిగి ప్రజలు ఇబ్బందులకు గురి అవడం ద్వారా ఉన్నతాధికారులు మాపై అనవసర చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.


 *2)* అలాగే ప్రస్తుతం MDU లు ద్వారా జరుపుతున్న పంపిణీలో కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉన్నవని అందులో ప్రధానంగా... ప్రస్తుతం వాడుతున్నటువంటి పాతకాలపు ఈపాస్ మిషన్ లకు బదులు కొత్తవి తీసుకొని, 2 జి సిమ్ టెక్నాలజీతో బదులు 4G సిమ్ టెక్నాలజీ కలిగిన మెషీన్లు గా అప్డేట్ చేయాలని, అలాగే వేయింగ్ మిషన్లుకు బ్లూటూత్ కు బదులు వైర్  అమర్చినచో వేగంగా కనెక్టివిటీ పెరుగుతుందని, అదేవిధంగా అన్నీ పాత ఆడాప్టెర్లు స్థానంలో మెరుగైన కొత్త ఆడాప్టెర్లు వెంటనే సరఫరా చేయడం ద్వారా  ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇటువంటి ప్రజా పంపిణీ కార్యక్రమం విజయవంతముగా జరుగుతుందని తెలిపారు.

  

 *3)* ఈ పథకము అమలుపై ఫిర్యాదుల కొరకు జిల్లాకు ఒకే ఒక టెక్నికల్ టీం పనిచేస్తున్నందువల్ల సకాలంలో ఫిర్యాదులు పరిష్కారం జరగడం లేదు. కనుక ప్రతి డివిజన్ స్థాయి లో ఒక టెక్నికల్ టీము ఏర్పాటు చేయడం వలన ఫిర్యాదుల పరిష్కారం సత్వరమే జరుగుతుందని తెలిపారు.


 *4)* కొన్ని చోట్ల తప్పనిసరి పరిస్థితుల్లో క్రింద స్థాయి రెవెన్యూ ఉద్యోగులే ప్రత్యక్షంగా unload చేస్తున్నారని, పంపిణీ కార్యక్రమం విజయవంతం చేయాలనే దృక్పథంతో కొంతమంది చిరు ఉద్యోగులు ముందుగా వారి స్వంత డబ్బులు సహితం ఖర్చు పెడుతున్నారని తెలిపారు.


● పై విషయాలను ఎంతో ఓపికతో పరిశీలించిన సివిల్ సప్లయిస్ కమిషనర్ గారు తప్పకుండా అక్కడక్కడా ఉన్న చిన్న చిన్న సాంకేతిక పరమైన అంశాలను తక్షణమే పరిష్కరిస్తామని, అలాగే గౌ11ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేదల ఇంటింటికి నిత్యావసర సరుకుల సరఫరా కార్యక్రమం విజయవంతం చేయడంలో ఇప్పటికే రెవెన్యూ శాఖ ఉద్యోగులు/అధికారులు పూర్తి స్థాయిలో కష్టపడుతున్నారని,  ఉద్యోగులు కేవలం పంపిణీ కార్యక్రమం విజయవంతం చేసివిధంగా MDUs ను motivate చేసి నిర్దేశించిన సమయానికి పంపిణీ చేసే విధంగా పర్యవేక్షణ మాత్రమే చేయాలని, వారి స్వంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.   అందరూ జిల్లా ఉన్నతాధికారులు మరియు రెవెన్యూ అధికారులతో నేడో, రేపో వెంటనే వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించి వారికున్న అపోహలను నివృత్తం చేస్తామని, వారు నిర్వహించాల్సిన ఇతర పనులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


 బొప్పరాజు మరియు చేబ్రోలు కృష్ణ మూర్తి.

Comments