వైయస్సార్‌ బీమా పరిహారాన్ని క్యాంప్ కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌లో బటన్‌ నొక్కి విడుదల చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.
వైయస్సార్‌ బీమా పరిహారాన్ని క్యాంప్ కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌లో బటన్‌ నొక్కి విడుదల చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.అమరావతి (ప్రజా అమరావతి);


*వైయస్సార్ బీమా పథకం కింద అర్హులై ఉండి బ్యాంకుల్లో ఎన్‌రోల్ కాకుండా మిగిలిన, దురదృష్టవశాత్తూ మరణించిన 12,039 మందికి బీమా పరిహారం విడుదల*


*ఆన్‌లైన్‌లో బటన్‌ నొక్కి రూ.254 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌*


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:* 


బీమా అన్నది ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో ప్రత్యేకంగా కుటుంబంలో సంపాదించే వ్యక్తికి హఠాత్తుగా ఏదైనా జరిగినప్పుడు, ఆ కుటుంబం తల్లడిల్లిపోయే పరిస్ధితి వచ్చినప్పుడు, ఆ కుటుంబానికి మనిషిని తిరిగి తీసుకురాలేకపోయినప్పటికీ  మానవత్వం ఉన్న ప్రభుత్వంగా కనీసం ఆ కుటుంబ అవసరాలకు, ఆ కుటుంబం ఇబ్బందులు పడకుండా ఉండే ఏ కార్యక్రమం చేయగలిగినా కూడా మంచిదే.

అందులో ప్రధానమైన పాత్ర బీమా పోషిస్తుంది. ఈ బీమా సొమ్ము ఇవ్వాల్సిన పరిస్ధితి ఏదైతే ఉందో అది కొన్ని, కొన్ని విచిత్రమైన, అనుకోని పరిస్ధితులు వల్ల సకాలంలో జరగని పరిస్ధితి ఈ రోజు ఉత్పన్నమవుతా ఉంది. అందులో భాగంగానే ఇవాళ  ఈ12 వేల కుటుంబాలు ఏదైతే మనం తోడుగా నిలబడతా ఉన్నామో ఆ కుటుంబాల గాధలు కూడా అటువంటివే.


*రాష్ట్ర ప్రభుత్వమే క్లెయింలు చెల్లిస్తుంది*

ఇక్కడ విషయమేమిటనంటే  వైయస్సార్‌ బీమా పథకానికి అర్హులై ఉండి కూడా బ్యాంకుల్లో ఎన్‌రోల్‌మెంట్‌ కాకుండా మిగిలిపోయి ఉన్న పరిస్ధితుల మధ్య అంటే అర్హత ఉండి కూడా బ్యాంకులు వాళ్లను ఎన్‌రోల్‌ చేయని కారణంగా.. గవర్నమెంట్‌ బ్యాంకులకు ప్రీమియం డబ్బును కట్టేసిన తర్వాత కూడా ఇది పరిస్ధితి. అటువంటి వారు వైయస్సార్‌ బీమా పథకం కింద అర్హులై ఉండి కూడా బ్యాంకుల్లో ఎన్‌రోల్‌ కాకుండా మిగిలిపోయి ఉన్న నేపధ్యంలో  దురదృష్ణవశాత్తూ మరణించిన ఆ 12,039  మందికి చెందిన కుటుంబాలను ఈ రోజు మానవతాదృక్ఫధంతో ఈ రోజు ఆ  క్లెయింలను మన రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తా ఉంది. 


ఆశ్చర్యమేమిటనంటే మనమేమో ఏటా రూ.500 కోట్ల రూపాయలకు ఖర్చుతో దాదాపుగా రైస్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ అంటే  దాదాపు 1 కోటి 41 లక్షల నిరుపేద కుటుంబాలకు, ఇందులో బహుశా 70 యేళ్లు వయసు దాటిపోయి ఉన్నవాళ్లు, బీమా వర్తించని వాళ్లను పక్కనబెడితే మిగిలిన కుటుంబాలు అందరినీ లెక్కలోకి తీసుకుంటే దాదాపు 1.3 కోట్ల వరకు ఉన్నాయి. వీరందరికీ వైయస్సార్‌ బీమా ద్వారా ఉచిత బీమా రక్షణ కల్పిస్తూ, గత ఏడాది అక్టోబరు 21న వైయస్సార్‌ బీమా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే   అయితే ఆ కుటుంబాలలో ఎవరైతే సంపాదించే వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తికి ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఆ వ్యక్తి కుటుంబానికి మనం తోడుగా నిలబడాలి అనే దృక్పధంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.


ఈ పథకం ప్రారంభించినప్పుడు వేరేరకమైన పరిస్ధితులు ఉన్నాయి. అప్పట్లో ప్రతి పాలసీకి గత 5 యేళ్లతో పోల్చితే ఇప్పుడు మారిన పరిస్ధితులు ఏమిటి అని గమనించినట్లైతే,  అప్పట్లో ప్రతి పాలసీకి ప్రధానమంత్రి జన జీవన బీమా యోజన (పీఎంజేజేబీవై) కానివ్వండి, ప్రధానిమంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్‌బీవై) కింద కానివ్వండి, ఇంతకముందు కేంద్ర ప్రభుత్వం 50 శాతం ప్రీమియం వాటాను ముందుకొచ్చి కట్టేది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం వారు పూర్తిగా చెల్లించడం ఆపేశారు. ఇప్పుడు జరిగిన పరిణామాలు చూసే, ఈ 31 మార్చి 2020 నుంచి మేం కట్టాల్సిన ప్రీమియం మేం కట్టం అని కేంద్ర ప్రభుత్వం విత్‌డ్రా అయిపోయిన పరిస్ధితులు కనిపిస్తాఉన్నాయి. అదే సమయంలో 2020 మార్చి నుంచి ఈ పథకాన్ని నిలిపివేస్తామని రాష్ట్రాలు తాము కావాలనుకుంటే కొనసాగించుకోవచ్చని చెప్పడం జరిగింది. బీమా సొమ్ము చెల్లించే బాధ్యతను పూర్తిగా మనందరి ప్రభుత్వమే మన  భుజస్కంధాలపై  వేసుకోవడం జరిగింది. ఇదొక్కటే కాకుండా ఇంకొక జరిగిన పరిణామమేంటి అంటే... కేంద్ర సహాయం ఒక్క రూపాయి కూడా లేకపోయినా కూడా  మానవతా దృక్పథంతో దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తి బీమా కయ్యే మొత్తం ఖర్చంతా కూడా మనందరి ప్రభుత్వమే భరించడానికి సిద్ధపడి బ్యాంకులకు ప్రీమియం కట్టడం జరిగింది. ఈ బీమా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ గతేడాది అక్టోబరు 21న బ్యాంకులకు ప్రీమియం సొమ్ము దాదాపు రూ.510 కోట్లు పూర్తిగా చెల్లించినప్పటికీ కూడా ఇంకొక మెలిక కూడా కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా పెట్టించింది. అదేమిటంటే ఇంతక ముందు గ్రూప్‌ ఇన్సూరెన్స్‌  ఉండేది. ఈ రోజు ఏం చెబుతున్నారంటే ప్రతి ఒక్కరితోనూ కూడా వాళ్ల సొంత బ్యాంక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయించాలని చెపుతున్నారు. ఆ మొత్తం కోటి 30 లక్షల మందిని ప్రతి ఒక్కరినీ పట్టుకుని మన వలంటీర్లు, మన గ్రామసచివాలయ సిబ్బంది వాళ్లను తీసుకుని పోయి, వాళ్లతో బ్యాంకు అకౌంట్‌ ఓపెన్‌ చేయిస్తే తప్పించి వాళ్లు ఈ ఇన్సూరెన్స్‌కు అర్హత రాని పరిస్ధితి ఈ రోజు ఉత్పన్నమవుతా ఉంది. 


విపరీతంగా కష్టపడితే కూడా దాదాపు 62 లక్షల అకౌంట్లు ఓపెన్‌ చేయించగలిగారు. అంటే ఇంకా దాదాపు మిగిలిన 60 లక్షల అకౌంట్లు ఓపెన్‌ చేయలేని పరిస్ధితి ఉంది. ఎందుకనంటే ప్రతి ఒక్కరినీ బ్యాంకు దగ్గరకి తీసుకెళ్లి , వాళ్ల ముందు సంతకాలు పెట్టించి, అకౌంట్‌ ఓపెన్‌ చేయించాలి.  ఇది రెండో సమస్య కాగా మూడో సమస్య కొత్తగా ఉత్పన్నమైంది ఏమిటంటే.... తీరా అకౌంట్‌ ఓపెన్‌ చేసి మన గవర్నమెంటు ఇచ్చిన ప్రీమియం బ్యాంకులో ఇన్సూరెన్స్‌ కంపెనీకి కట్టిన పిమ్మట 45 రోజుల పాటు కూల్‌ఆఫ్‌ పీరియడ్‌ అని చెప్పి కొత్తగా ఇంకొకటి తీసుకొచ్చారు. అంటే 45 రోజుల లోపు ఎవరైనా చనిపోయే వాళ్లకి ఇవ్వరట. సో ఈ రకరకాల మెలికలు, రకరకాల ఇబ్బందులు ఈ కార్యక్రమానికి క్రియేట్‌ చేయబడ్డ పరిస్ధితుల్లో మనం ఇవాళ ఈ కార్యక్రమం కొనసాగిస్తా ఉన్నాం. 


ఇటువంటి పరిస్ధితుల్లో  దాదాపుగా 12,039 కుటంబాలుకు అర్హత ఉంది, ప్రభుత్వం కూడా బ్యాంకులకు ప్రీమియం కోసం డబ్బు కట్టింది, కానీ బ్యాంకు అకౌంట్‌ ఓపెన్‌ చేయలేని కారణంగానో లేదా వాళ్లకు 45 రోజులు కూల్‌ ఆఫ్‌ పీరియడ్‌ రావడం వల్లనో ఇటువంటి రకరకాల కారణాల వల్ల ఈ 12 వేల మందికి అర్హత ఉండి కూడా బీమా సొమ్ము రాని పరిస్థితి నెలకొన్న నేపధ్యంలో ఇటువంటి వారికి కూడా మానవతా దృక్పధంతో పరిస్థితులేమైనా రాష్ట్ర ప్రభుత్వం వారికి తోడుగా ఉండాలని మంచి ఉద్దేశ్యంతో, ఆ కుటుంబాలకు అండగా నిలబడేందుకు వాళ్లకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ రూ.254 కోట్లు ఇన్సూరెన్స్‌ కంపెనీల నుంచి రాకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తోడుగా నిలబడుతూ ఆ డబ్బులను ఈ 12,039 కుటుంబాలకు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. 


*ప్రాక్టికల్ సొల్యూషన్‌తో రండి*

ఈ రోజు ఇంకా విచిత్రమైన పరిస్ధితి ఉంది. ఇంకా 60 లక్షల దాకా అకౌంట్లు  తెరియాల్సి ఉంది. ఈ రోజు అధికారులకు, కలెక్టర్లకు ఈ సందర్భంగా నేను ఇంకొక విషయం కూడా చెప్పదలచుకున్నాను. దయచేసి  మీరు మీ అధికార్లతో కూర్చుని మాట్లాడండి. ఒక ప్రాక్టికల్‌ సొల్యూషన్‌కు రండి. మనం ఏదైతే పేదవాడికి మంచి చేయాలనుకుంటున్నాం. కానీ ఇటువంటి పరిస్ధితుల్లో ఈ రకమైన ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ, దేశ వ్యాప్తంగా జరగడం, ఇన్సూరెన్స్‌ కంపెనీలు కూడా  ఇండివిడ్యువల్‌ అకౌంట్లు ఓపెన్‌ అయితేనే చేస్తామని చెప్పడం,  45 రోజుల కూల్‌ ఆఫ్‌ పీరియడ్‌ రావడం, అందరితోనూ బ్యాంకు అకౌంట్లు ఓపెన్‌ చేయించలేని పరిస్ధితుల్లో  మన వ్యవస్ధ ఉండటం, బ్యాంకులు అన్ని కూడా గ్రామాల్లో లేని పరిస్ధితి ఉండటం, ఇటువంటి నేపధ్యంలో ఒక ప్రాక్టికల్‌ సొల్యూషన్‌తో రండి. 


దీన్ని మనం సాచ్యురేషన్‌ పద్ధతిలో  ఏ ఒక్కరికైనా అర్హత ఉండి, కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఎవరైతో ఉన్నారో, కుటుంబానికి కనీసం ఒక్కరన్నా కూడా  కచ్చితంగా ఆ ఇన్సూరెన్స్‌ బ్రాకెట్‌లోకి ఏ రకంగా తీసుకురాగలుగుతామో  అన్న విషయంలో దయచేసి అందరూ కూడా దీనిమీద మేధో మధనం చేయండి.  దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోగలుగుతామో అన్న విషయంలో వారం రోజుల్లోగా నాకు సమగ్రమైన నివేదిక ఇవ్వండి. 


ఎందుకనంటే ప్రభుత్వం తరపున నుంచి రూ.510 కోట్లు ప్రీమియం గత సంవత్సరం కట్టాం, ఈ సంవత్సరం కూడా కట్టడానికి సిద్ధంగానే ఉన్నాం, ఇందులో వెనక్కి పోయేది లేదు. రూ.510 కోట్ల ప్రీమియం మీ చేతికిస్తాం. ఏ రకంగా మీరు దాన్ని గరిష్టంగా ఉపయోగిస్తారో దయచేసి ఆలోచన చేయమని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్లకు, అధికార్లకు తెలియజేస్తా ఉన్నాను. 


*బీమా కోసం టోల్‌ ఫ్రీ నెంబర్‌*

దీని వల్ల మంచి జరగాలని మనసారా కోరుకుంటూ...  ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉండి ఉంటే కూడా, అర్హత ఉండి కూడా మిగిలిపోయి ఉంటే కూడా ఒక ట్రోల్‌ ఫ్రీ నెంబర్‌ 155214  నేను చెపుతున్నాను. అటువంటి ఏదైనా కేసులున్నా కూడా మీరు సంకోచం లేకుండా రిజిష్టర్‌ చేసుకొండి. కచ్చితంగా వాళ్లకు కూడా మేలు జరిగేటట్టుగా ప్రభుత్వం ముందుకొచ్చి చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా మరలా తెలియజేస్తూ.. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రారంభిస్తున్నాను. ఆ కుటుంబాలకు మంచి జరగాలని మనిషిని తీసుకురాలేకపోయాం కానీ దేవుడు దయ ఆ కుటుంబాల మీద ఉండాలని, మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు. 


అనంతరం సీఎం కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి  వైయస్సార్‌ బీమాపరిహారాన్ని విడుదల చేశారు. 


ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌జైన్, కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి బి ఉదయ లక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ ఎం గిరిజా శంకర్, ఏపీ డెయిరీ డవలప్‌మెంట్‌ కో ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ ఎండీ బాబు ఎ, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఎండీ నారాయణ భరత్‌ గుప్తా, సెర్ప్‌ సీఈఓ పి రాజాబాబు, మెప్మా ఎండీ వి విజయలక్ష్మి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.