అమరావతి (ప్రజా అమరావతి);
కేంద్ర సంస్థ ఎంఎస్‌టిసి ఆధ్వర్యంలో ఇసుక టెండర్ల ప్రక్రియ పూర్తి.
టెండర్లలో జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ ఎంపిక.
ఇకపై మరింత పారదర్శకంగా ఇసుక మైనింగ్, విక్రయాలు*
- వినియోగదారుల సౌలభ్యం కోసం పలు మినహాయింపులు
రీచ్‌ల వద్దే ఇసుక నాణ్యతను నిర్ధారించుకునే అవకాశం.
- సొంతంగా ఏర్పాటు చేసుకున్న వాహనంలో ఇసుక రవాణ*
అన్ని రీచ్ ల్లోనూ ఇసుక ధరలు ఒకేలా వుండేందుకు చర్యలు.
- పట్టాభూముల్లో ఇసుక విక్రయాలకు అనుమతి లేదు.
ఓపెన్‌రీచ్‌ల ద్వారా నాణ్యమైన ఇసుక.
ఫిర్యాదులు వస్తే తక్షణం స్పందించేందుకు వ్యవస్థ.
ప్రస్తుతం అమలులో వున్న నూతన ఇసుక విధానంను మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం మెరుగైన చర్యల కోసం గత ఏడాది నవంబర్ 12వ తేదీన జిఓ నెం.78ని జారీ చేసింది. దానిలో భాగంగా వినియోగదారులకు సులభతరంగా, పారదర్శకంగా ఇసుకను అందించేందుకు కేంద్రప్రభుత్వ సంస్థ అయిన ఎంఎస్‌టిసి లిమిటెడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా కారణంగా జరిగిన దోపిడీని పూర్తిస్థాయిలో నియంత్రిస్తూ, పర్యావరణంకు విఘాతం కలగకుండా కేంద్ర సంస్థ ఎంఎస్‌టిసి లిమిటెడ్ ద్వారా ఇసుక మైనింగ్, నిల్వ, విక్రయాలు జరిపేందుకు అర్హత వున్న సరైన గుత్తేదారును ఎంపిక చేసేందుకు రాష్ట్ర భూగర్భ గనుల శాఖ ఈ ఏడాది జనవరి 4వ తేదీన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు ఎంఎస్‌టిసి ఇసుక తవ్వకాలు, విక్రయాలను నిర్వహించగలిగే సాంకేతిక, ఆర్థిక సామర్థ్యం వున్న సంస్థలను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో మెస్సర్స్ జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ రెండు సంవత్సరాలకు గానూ రాష్ట్రంలోని మూడు ప్యాకేజీల్లో అధిక ధరను కోట్ చేయడంతో సదరు సంస్థను ఎంపిక చేసినట్లు ఎంఎస్‌టిసి ప్రకటించింది. ఈ మూడు ప్యాకేజీల్లో మొదటి దానికి రూ.477.50 కోట్లు, రెండో ప్యాకేజీకి రూ.745.70 కోట్లు, మూడో ప్యాకేజీకి రూ.305.60 కోట్లకు సదరు సంస్థ టెండర్లలో కోట్ చేయడంతో సదర సంస్థను ఎంపిక చేస్తున్నట్లు ఎంఎస్‌టిసి వెల్లడించింది.
దేశంలోనే మౌలిక సదుపాయాలు కలిసి ప్రముఖ కార్పోరేట్ కంపెనీగా వున్న జయ్‌పే (jaypee) సంస్థలో జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ భాగస్వామి. దేశంలోనే ప్రైవేటు సెక్టార్‌లో అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంను నిర్వహిస్తున్న సంస్థగా గుర్తింపు పొందింది.
ప్రస్తుతం అమలులో వున్న ఇసుక విధానం ద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.161.30 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) ఫిబ్రవరి వరకు రూ.380 కోట్లు ఇసుక విక్రయాల వల్ల ప్రభుత్వానికి నికర ఆదాయం లభించింది. తాజాగా ఎంఎస్‌టిసి లిమిటెడ్ ఎంపిక చేసిన గుత్తేదారు ద్వారా ఏడాదికి సుమారు రూ.765 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి లభిస్తుందని డిఎంజి వెంకటరెడ్డి తెలిపారు. ఈమేరకు ఎపిఎండిసి నుంచి ఇసుక తవ్వకాలు, నిల్వ, విక్రయాలపై టెండర్లలో ఎంపికైన ప్రైవేటు సంస్థకు వెంటనే బాధ్యతలను అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
కొత్త సంస్థ ద్వారా వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఇసుకను కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. నిర్ధారించిన రీచ్‌ల వద్దే స్టాక్‌యార్డ్ ఏర్పాటు చేస్తుండటంతో వినియోగదారులు నేరుగా ఇసుక నాణ్యతను పరిశీలించుకుని, నచ్చిన రీచ్ వద్దే డబ్బు చెల్లించి ఇసుకను కొనుగోలు చేయవచ్చు. తాను ఏర్పాటు చేసుకున్న వాహనంలో ఇసుకను తీసుకువెళ్ళే సదుపాయం కూడా వుంటుంది.
- రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రీచ్ వద్ద ఒకే ధర, దూరం ఆధారంగా ప్రాంతాల వారీగా అప్పర్ సీలింగ్ తో ఒక ధర నిర్ణయించారు.
- అధిక ధరలకు విక్రయిస్తున్నారనే అనుమానం కలిగితే వెంటనే ఫోన్ చేసి ఫిర్యాదు చేసేందుకు ఫోన్ నెంబర్ల వివరాలను రీచ్ ల వద్ద ప్రదర్శిస్తారు.
- ఇసుక కోసం ఎటువంటి సిఫార్స్‌లు అవసరం లేని విధానంను అమలులోకి తెస్తారు.
- ఇసుక సరఫరా విషయంలో రవాణా గుత్తేదారులు, లేదా మద్యదళారీల ప్రమేయం ఉండదు.
- సొంతగా వాహనం ఏర్పాటు చేసుకోలేని వారికి రవాణా గుత్తేదారు ద్వారా ఇసుకను తీసుకువెళ్ళే అవకాశం కల్పించారు.
- ఇకపై పట్టాభూముల్లో ఇసుక తవ్వకాలకు ఎటువంటి అనుమతి లేదు.
- ఓపెన్ రీచ్‌లలోనే ఇసుక తవ్వకాలకు అనుమతి వున్నందున నాణ్యమైన ఇసుక వినియోగాదారులకు అందుబాటులో వుంటుంది.
addComments
Post a Comment