అపారిశుధ్యంపై కలెక్టర్ ఆగ్రహం
కొండవెలగాడ, చంద్రంపేటలో పర్యటన
సచివాలయాల తనిఖీ
నాడూ నేడు పనులు పరిశీలన
సీతమ్మ చెరువు సుందరీకరణకు ఆదేశం
నెల్లిమర్ల (విజయనగరం), మార్చి 27 (ప్రజా అమరావతి);
గ్రామంలో పేరుకుపోయిన అపారిశుధ్యం, కాలువల ఆక్రమణ, సిబ్బంది నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ తీవ్రంగా మండిపడ్డారు. ఆక్రమణదారులపై కేసులు నమోదు చేసి, జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. నెల్లమర్ల మండలం కొండవెలగాడ, చంద్రంపేట గ్రామాల్లో శనివారం కలెక్టర్ పర్యటించి, గ్రామ సచివాలయాలను, నాడూనేడు పనులను తనిఖీ చేశారు.
పారిశుధ్య నిర్వహణపై అసంతృప్తి
కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ కొండవెలగాడ, చంద్రంపేట గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించి, సిబ్బందిని హడలెత్తించారు. ఆయన ముందుగా కొండవెలగాడ ప్రాధమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో జరిగిన నాడూ నేడు పనులను పరిశీలించారు. పనుల వివరాలను జెడ్‌పి స్కూలు హెచ్ఎం పి.విక్టోరియా రాణి, కలెక్టర్‌కు వివరించారు. ప్రతీతరగతి గదినీ సందర్శించారు. పిల్లలకోసం సిద్దం చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కోడిగుడ్ల పరిమాణాన్ని, బియ్యం నాణ్యతను తనిఖీ చేశారు. మరుగుదొడ్లను సైతం తనిఖీ చేశారు. పరీక్షా శాలల్లో సరుకులను ఉంచడం పట్ల, పాఠశాల ఆవరణలో మొక్కలు లేకపోవడం పట్లా అసంతృప్తిని వ్యక్తం చేశారు.
గ్రామ సచివాలయం చుట్టుప్రక్కల ప్రాంతాన్ని, గ్రామంలోని ప్రధాన రహదారిని కలెక్టర్ పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణపట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాలువపై బడ్డీకొట్లు, షాపులు పెట్టి, మురికినీరు పోకుండా అడ్డుకోవడం పట్ల మండిపడ్డారు. ఇంతమంది ఉద్యోగులు, ఇంతపెద్ద వ్యవస్థ ఉండీ ఏమిచేస్తున్నారని, సచివాలయ సిబ్బందిని, గ్రామ కార్యదర్శిని నిలదీశారు. పిల్లల ఆరోగ్యాలతో చెలగాటం ఆడవద్దని హెచ్చరించారు. తాశీల్దార్ గొట్టాపు రాము, ఎంపిడిఓ రాజ్‌కుమార్‌ను ప్రశ్నించారు. తక్షణమే కాలువలపై ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీడనిచ్చేందుకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటాలని సూచించారు.
సచివాలయాల తనిఖీ
ముందుగా కొండవెలగాడ సచివాలయాన్ని తనిఖీ చేశారు. ఇ-రిక్వెస్టులు, ఇతర పెండింగ్ సమస్యలపై ఆరా తీశారు. అనంతరంచంద్రంపేట గ్రామ సచివాలయాన్నికూడా కలెక్టర్ తనిఖీ చేశారు. చంద్రంపేట సచివాలయంలో విధులకు గైర్హాజరైన గ్రామ కార్యదర్శి, ఇతర ఉద్యోగులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వారికి ఆబ్‌సెంట్‌ను వేసి, నోటీసు ఇవ్వాలని ఆదేశించారు. ఇ-రిక్వెస్టుల పెండింగ్‌పై ఆరా తీశారు. వివిధ సంక్షేమ పథకాలకు పెండింగ్ దరఖాస్తులను పరిశీలించారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, జగనన్న విద్యాదీవెన స్థితిగతులపై ప్రశ్నించారు. సిబ్బంది బయటకు వెళ్లేటప్పుడు మూవ్‌మెంట్ రిజిష్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేసిన తరువాతే వెళ్లాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
సీతమ్మచెరువు అభివృద్దికి చర్యలు
కొండవెలగాడ గ్రామానికి ఆనుకొని ఉన్న సీతమ్మ చెరువును కలెక్టర్ సందర్శించారు. డ్వామా నిధులతో చెరువు అభివృద్దికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముందుగా చెరువులో పూడికను తొలగించాలని, అనంతరం చెరువుగట్టకు ఇరువైపులా మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
addComments
Post a Comment