నూతన టూరిజం పాలసీతో పర్యాటక శోభ

 నూతన టూరిజం పాలసీతో పర్యాటక శోభ


- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ( అవంతి శ్రీనివాస్)

రాష్ట్ర క్రీడల్లో  కబడ్డీ ని ప్రోత్సహించాలని ఆదేశం

పర్యాటక రంగంలో నూతన సంస్కరణలకు చర్యలు 

గండికోట అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

అమరావతి, మార్చి30 (ప్రజా అమరావతి) : నూతన పర్యాటక పాలసీ 2020-25 తో రాష్ట్రంలో అన్ని పర్యాటక ప్రాంతాలకు సరికొత్త శోభ సంతరించుకోనుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన, క్రీడల శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్) అన్నారు. సచివాలయంలోని  మూడో బ్లాక్ లో సోమవారం తన ఛాంబర్ లో పర్యాటక, సాంస్కృతిక, క్రీడా, పురావస్తు శాఖల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.  రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రధానంగా క్రీడా ప్రాంగణాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ నిధులు రాబట్టుకోవడంపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రంలో త్వరలో ప్రారంభించనున్న క్రీడా ప్రాంగణాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. శాప్, ఎన్‌సిసి, యువజన సేవల విభాగాలు ఈ సంవత్సరంలో నిర్వహించబోయే కార్యక్రమాలు, నిధుల వినియోగంపై త్వరితగతిన ప్రణాళికలను తయారు చేయాలన్నారు. క్రీడలకు కేంద్ర సహాయ ప్రాజెక్టుల ద్వారా విడుదలయ్యే నిధుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా పనుల్లో రాజీ లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్రీడా కార్యకలాపాలపై  ప్రసుత్తం కొనసాగుతున్న పరిస్థితిపై మంత్రి చర్చించారు. క్రీడాకారులకు ఇచ్చే పతకాలు, అవార్డుల నగదు విషయంలో ప్రత్యేక చొరవ చూపాలన్నారు. రాష్ట్ర క్రీడ కబడ్డీని మరింత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం క్రీడాకారులను ప్రోత్సా హించాలన్నారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చే ఏ అవకాశాన్నీ విడవకుండా అందిపుచ్చుకోవాలని మంత్రి అవంతి శ్రీనివాస్ అధికారులకు సూచించారు. అధికారులు అభివృద్ధి పనులను పరిశీలిచడంతో పాటు పర్యాటక రంగానికి ఆదాయం వచ్చే మార్గాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో పర్యాటకాభివృద్ధి కోసం చేపడుతున్న ప్రాజెక్టులను పరిశీలించాలని, వాటికన్న మిన్నగా రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

గండికోట అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు... 

పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం గండికోట ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు మంత్రికి అధికారులు వెల్లడించారు. పెట్టుబడి దారుల సహకారంపై సంబంధిత అధికారులు ఇప్పటికే చర్చలు జరిపిట్లు వివరించారు. గండికోట పర్యాటక ప్రాంతంలో అధిక సంఖ్యలో పర్యాటక భూములు ఉన్నాయని,వాటిని అభివృద్ధి చేసేందుకు పలువురు పెట్టుబడి దారులు ఆసక్తి చూపుతున్నారని అధికారులు మంత్రికి వివరించారు. అక్కడ అధునాతన సౌకర్యాలతో  రిక్రియేషన్ హోటళ్లు, ఎమ్యూజ్ మెంట్ పార్క్, గోల్ఫ్ కోర్టులు, వంతెనల నిర్మాణానికి రూపొందించిన నివేదికను మంత్రికి అందజేశారు.

ఈ సమీక్ష సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక మరియు పురావస్తు శాఖ ల ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, క్రీడలు & యువజన సర్వీసుల సంక్షేమ శాఖల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్, పురావస్తు శాఖ కమీషనర్ వాణి మోహన్ , క్రీడలశాఖ  ఎం.డి, & వైస్ ఛైర్మన్ రామారావు, కల్చరల్ శాఖ సిఈవొ మల్లికార్జునరావు, శిల్పారామం సిఈవొ జయరాజు, యూత్ సర్వీసెస్ జె .డి,ఎన్ సి సి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments