ఏప్రిల్ 13న టిటిడి ఆలయాల్లో ఉగాది వేడుకలు

 తిరుపతి,  ఏప్రిల్ 12 (prajaamaravathi);ఏప్రిల్ 13న టిటిడి ఆలయాల్లో ఉగాది వేడుకలు తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని టీటీడీ ఆలయాల్లో మంగ‌ళ‌వారం శ్రీ ఫ్ల‌వ‌నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించనున్నారు. తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీకోదండరామాలయం, శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం, అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యాల్లో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా మధ్యాహ్నం 3.00 నుంచి 4.00 గంటల వరకు స్నపనతిరుమంజనం వైభవంగా జరుగనుంది. అనంతరం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో : తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 6.00 నుంచి రాత్రి 7.00 గంటల వరకు ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు. శ్రీ కోదండరామాలయంలో : తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో సాయంత్రం 4.00 నుండి 5.00 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జీయర్‌ స్వామివారు మూలవర్లకు, ఉత్సవర్లకు వస్త్రసమర్పణ చేయనున్నారు. శ్రీనివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం : శ్రీనివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ఉద‌యం 9 నుండి 11 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న‌వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో : అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న‌వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉద‌యం 8.30 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు ఆలయంలో ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. 

Comments