ఏప్రిల్ 19న శ్రీ కోదండరామాలయంలో ఏకాంతంగా పుష్పయాగం

 తిరుపతి,  ఏప్రిల్ 16 (prajaamaravathi);                                       ఏప్రిల్ 19న శ్రీ కోదండరామాలయంలో ఏకాంతంగా పుష్పయాగం తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 19వ తేదీన కోవిడ్ - 19 నిబంధ‌న‌ల మేర‌కు ఏకాంతంగా పుష్పయాగం నిర్వ‌హించ‌నున్నారు. ఏప్రిల్ 18వ తేదీన సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు పుష్పయాగానికి అంకురార్పణ జ‌రుగ‌నుంది. ఏప్రిల్ 19న ఉదయం 10 నుండి 11 గంటల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు స్నపనతిరుమంజనం నిర్వ‌హిస్తారు. అనంత‌రం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీతా ల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ కోదండ‌రామ‌స్వామివారికి పలు రకాల పుష్పాలతో అభిషేకం చేస్తారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారిని ఆలయంలోనే ఊరేగిస్తారు. శ్రీకోదండరామాలయంలో మార్చి ‌13 నుండి 21వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు.