ఉత్తమ సేవకులకు ఉగాది పురస్కారాలు వలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న, సేవామిత్ర అవార్డులతో సత్కారం
అవార్డుతో పాటు నగదు పురస్కారాలు నియోజకవర్గాల వారీగా పురస్కారాల ప్రదానం విజయనగరంలో నేడు ఆరంభం పాల్గొంటున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ వెల్లడి విజయనగరం, ఏప్రిల్ 11 (prajaamaravathi); ప్రంజలకు సకాలంలో అవసరమైన సేవలు, ప్రభుత్వ పథకాలు అందించి ఆయా కుటుంబాల్లో మార్పునకు నాంది పలికిన గ్రామ, వార్డు వలంటీర్లను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉగాది సందర్భంగా సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్ర పురస్కారాలతో సత్కరించనున్నట్టు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ వెల్లడించారు. ఈ మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏప్రిల్ 12 నుండి 21 వరకు కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆయా నియోజకవర్గాల్లోని ఉత్తమ సేవలు అందించిన వలంటీర్లను సత్కరిస్తామన్నారు. 12న జిల్లా కేంద్రమైన విజయనగరంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ అవార్డుల పురస్కార ప్రదాన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని, ప్రోగ్రాం ఇన్‌చార్జిని నియమించడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. వారు ఈ కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని తెలిపారు. 45 మందికి సేవా వజ్ర అవార్డులు అత్యుత్తమ సేవలు అందించే వలంటీర్లకు సేవావజ్ర పురస్కారంతో సత్కరిస్తామని, ఈ అవార్డు కింద రూ.30 వేల నగదు పారితోషికంతోపాటు, పతకం, ప్రశంసాపత్రం, బ్యాడ్జి, శాలువతో సత్కరిస్తామని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదుగురిని ఈ అవార్డుకు ఎంపికచేసి సత్కరిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో 45 మంది వలంటీర్లను సేవావజ్ర అవార్డులతో సత్కరించనున్నట్టు తెలిపారు. 387 మందికి సేవారత్న పురస్కారాలు సేవారత్న అవార్డు కింద మండలానికి ఐదుగురు వంతున ఎంపిక చేసి సత్కరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ అవార్డు కింద రూ.20 వేల నగదు పారితోషికంతోపాటు పతకం, ప్రశంసాపత్రం, బ్యాడ్జి, శాలువాతో సత్కరిస్తారని పేర్కొన్నారు. జిల్లా 387 మంది వలంటీర్లను సేవారత్న అవార్డుతో సత్కరించడం జరుగుతుందన్నారు. 21423 మందికి సేవామిత్ర పురస్కారాలు సేవామిత్ర అవార్డు కింద ఎంపికైన వలంటీర్లకు రూ.10 వేల నగదు బహుమతితోపాటు ప్రశంసాపత్రం, బ్యాడ్జి, శాలువాతో సత్కరిస్తారని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో 21,423 మంది వలంటీర్లకు సేవామిత్ర పురస్కారానికి ఎంపిక చేయడం జరిగిందని పేర్కొన్నారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 1289 మంది వలంటీర్లకు సేవామిత్ర పురస్కారంతో, 20 మందికి సేవారత్న పురస్కారంతో, ఐదుగురికి సేవావజ్ర పురస్కారంతో సత్కరించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. 12న స్థానిక ఆనందగజపతి ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపి బెల్లాన చంద్రశేఖర్ తదితరులు అతిథులుగా పాల్గొని ఉత్తమ వలంటీర్లను సత్కరిస్తారని కలెక్టర్ వెల్లడించారు. ఆనందగజపతి ఆడిటోరియంలో వలంటీర్లకు ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు ఆదివారం ఆడిటోరియంను కమిషనర్ ఎస్.ఎస్.వర్మతో కలసి సందర్శించి పర్యవేక్షించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలో ఈనెల 14న కురుపాంలో, 15న బొబ్బిలిలో, 16న ఎస్.కోటలో, 17న నెల్లిమర్లలో, 18న సాలూరులో, 19న పార్వతీపురంలో, 20న గజపతినగరంలో, 21న చీపురుపల్లిలో వలంటీర్ల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఆయా నియోజకవర్గ శాసనసభ్యుల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాల్లో జిల్లా మంత్రులు పాల్గొంటారని వెల్లడించారు.
addComments
Post a Comment