తొలి డొస్‌ కోవిడ్‌ టీకా వేయించుకున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌.



తొలి డొస్‌ కోవిడ్‌ టీకా వేయించుకున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌.



*పట్టణ సచివాలయాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం* 


*గుంటూరు, భారత్‌పేట 6వ లైన్, 140 వార్డు సచివాలయంలో స్వయంగా కోవిడ్‌ వాక్సిన్‌ వేయించుకున్న ముఖ్యమంత్రి*


*రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు, ఇతర దీర్ఘకాలిక ఏ జబ్బులూ లేని 45 ఏళ్ళు దాటిన పౌరులందరికీ (కోమార్బిడిటీ) వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన సీఎం:*


*రాష్ట్రమంతా ఒక యజ్ఞంలా కోవిడ్‌ వాక్సినేషన్‌*


*వలంటీర్లు, ఆశా వర్కర్ల ద్వారా సమాచారం సేకరణ*


*45 ఏళ్లు దాటిన వారందరి అన్ని వివరాలు నమోదు*


*ఆ తర్వాత పక్కాగా ఆరోగ్య వివరాలతో జాబితాలు*


*అనంతరం వాక్సీన్‌ వేసే రోజుపై ముందుగానే సమాచారం*


*ఆ రోజున వైద్యుల బృందం గ్రామ సందర్శన. వ్యాక్సినేషన్‌*


*ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడి*


*ఎక్కడైనా, ఎవరైనా మిగిలిపోతే వారిళ్లకు వెళ్లి వివరాలు ఆరా*


*45 ఏళ్లు దాటిన వారికి తప్పనిసరిగా కోవిడ్‌ వ్యాక్సిన్‌*


*కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వ్యాక్సినేషన్‌*

 

*మండల, జడ్పీటీసీ ఎన్నికలు ముగియగానే ప్రక్రియ*


*పట్టణాల్లో వ్యాక్సినేషన్‌ ప్రారంభం సందర్భంగా సతీమణితో కలిసి స్వయంగా టీకా వేయించుకున్న సీఎం*



గుంటూరు (ప్రజా అమరావతి):


తాడేపల్లి నుంచి నేరుగా గుంటూరులోని భారత్‌పేట 6వ లైన్, 140 వార్డు సచివాలయానికి చేరుకున్న సీఎం శ్రీ వైయస్‌ జగన్, తొలుత కోవిడ్‌ వ్యాక్సినేషన్‌కు సంబంధించి వైద్య, ఆరోగ్యశాఖ రూపొందించిన ప్రత్యేక యాప్‌ను ఆవిష్కరించారు. దీని ద్వారా రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతుంది. సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల సహకారంతో కచ్చితమైన సమాచారం పొందుతూ, రాష్ట్ర స్ధాయిలో వ్యాక్సినేషన్‌ పురోగతిని పర్యవేక్షించేలా ఈ యాప్‌ను రూపొందించారు.

కోవిడ్‌ నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఏర్పాటు చేసిన పోస్టర్లను అంతకు ముందు తిలకించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, ఆ తర్వాత సతీమణి శ్రీమతి వైయస్‌ భారతితో సహా, వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఆ తర్వాత స్వయంగా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. కాసేపు వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉన్న ఆయన, ఆ తర్వాత సచివాలయం, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. 


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ..:*


*యజ్ఞంలా వ్యాక్సినేషన్‌:*


‘ఈ రోజు మనం వార్డు సచివాలయాలను ఒక యూనిట్‌గా తీసుకుంటున్నాం. గ్రామ సచివాలయాలను కూడా ఒక యూనిట్‌గా తీసుకుని వ్యాక్సినేషన్‌ కార్యక్రమం అన్నది రాబోయే రోజుల్లో ఒక యజ్ఞంలా చేయాల్సిన అవసరం ఉంది. ఆ యజ్ఞాన్ని చేయడం కొరకు ఇక్కడ శ్రీకారం చుడుతున్నాం’. 


*విస్తృతంగా ప్రచారం:*


‘వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో, వార్డులో జరుగుతుందని ముందుగానే ఆ గ్రామంలో కానీ, వార్డు పరిధిలో ఉన్న వలంటీర్లు, ఆశా వర్కర్లు డోర్‌ టూ డోర్‌ సమాచారం ఇస్తారు. ప్రతి ఇంట్లో కూడా 45 సంవత్సరాల వయసు పైబడి ఉన్న వారి వివరాలను సేకరించి, వారికి ధీర్ఘకాల వ్యాధులు ఏమైనా ఉన్నాయా? ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? అన్నవి కూడా తెలుసుకుని అన్నీ నమోదు చేసుకుంటారు, అప్పుడే మీ గ్రామంలో, వార్డులో ఫలానా తేదీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతుందని ముందుగానే చెబుతారు’.


*పక్కాగా వ్యాక్సినేషన్‌:*


‘ఆ తేదీ నాటికి ఆ వార్డు, లేదా గ్రామంలో మొత్తం డాక్టర్ల బృందం.. (ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతీ పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు, దీనికి తోడు 104 వెహికల్‌లో ఒక డాక్టర్, 108 కూడా ఎమర్జెన్సీ సర్వీసుల కోసం అందుబాటులో ఉంటుంది) వచ్చి గ్రామ సచివాలయంలోని నర్సులు, పీహెచ్‌సీలలో ఉన్న నర్సులు అందరూ కలిసి చెప్పిన రోజున లిస్ట్‌ ప్రకారం వ్యాక్సినేషన్‌ చేస్తారు, ఎవరైనా మిగిలిపోతే వారి ఇళ్లకు వెళ్ళి వ్యాక్సినేషన్‌ ఉపయోగాలు తెలియజేసి వారికి కూడా వ్యాక్సిన్‌ వేస్తారు. దీంతో మొత్తం గ్రామం, వార్డులో ఉన్న వారందరికీ కూడా వ్యాక్సినేషన్‌ పూర్తవుతుంది. ఇది ఒక యజ్ఞంలా ఇంటింటికీ వెళ్ళి వలంటీర్లు, ఆశా వర్కర్లు వెళ్ళి చెప్పడం, పేర్లు నమోదు చేసుకోవడం, వ్యాక్సినేషన్‌ రోజు మళ్ళీ టిక్‌ పెట్టుకోవడం ఇవన్నీ చేస్తే రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ పొందని వ్యక్తులు అనేది ఉండరు’.


*కేంద్ర మార్గదర్శకాల మేరకు:*


‘ప్రస్తుతానికి కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 45 ఏళ్ళ వయసు పైబడి ఉన్న ప్రతీ ఒక్కరికీ వ్యాక్సినేషన్‌ చేయాల్సి ఉంది. రాబోయే రోజుల్లో 45 ఏళ్ళ వయసు కంటే తక్కువ వయసు ఉన్న వారికి కూడా చేయాలని చెప్పినప్పుడు వారిని కూడా యాడ్‌ చేసి వ్యాక్సినేషన్‌ చేయడం జరుగుతుంది. ఇలా చేయడం అనేది ప్రస్తుతానికైతే నాలుగు నుంచి ఆరు వారాల్లో పూర్తి చేస్తామని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. కాకపోయినా కొద్దిగా ఎక్కువ టైం పట్టినా నాకు తెలిసినంత వరకూ మూడు నెలలలోపు పూర్తిగా (90 రోజుల్లో ) అందరికీ చేయగలుగుతామన్న సంపూర్ణ నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నాయి’.


*స్ధానిక ఎన్నికలు పూర్తవగానే:*


‘గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇదే మాదిరిగా డ్రైవ్‌ చేయాలంటే కొద్దిగా సమస్య వస్తుంది. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కేవలం ఆరు రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. ఏ రోజైతే ఎన్నికల కమిషన్‌ ఎన్నికలు పెట్టాలి అని నిర్ణయం తీసుకంటే కేవలం ఆరు రోజులలో ప్రాసెస్‌ మొత్తం పూర్తవుతుంది. దాని తర్వాత ఎలాంటి వ్యాక్సినేషన్‌ చేయాలనుకున్నా ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఎన్నికలు అనగానే ఉద్యోగులు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు అందరూ ఇన్‌వాల్వ్‌ కావాల్సి వస్తుంది. రెండూ చేయడం కాస్త కష్టమవుతుంది. కాబట్టి నాకు తెలిసినంతవరకూ ఈరోజు కొత్త ఎస్‌ఈసీ భాద్యతలు తీసుకుంటున్నారు కాబట్టి ఆరోగ్యశాఖ కార్యదర్శి, చీఫ్‌ సెక్రటరీ, డీజీపీ వీరంతా కూడా వెళ్ళి రాష్ట్రంలో ఉన్న పరిస్ధితులు చెప్పి, కొత్త ఎస్‌ఈసీ గారికి కూడా పరిస్ధితులు తెలుసుకాబట్టి త్వరితగతిన ఈ ఆరురోజుల ప్రక్రియ అనేది పూర్తిచేస్తారని నాకు నమ్మకముంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే గ్రామీణ ప్రాంతాల్లో కూడా యుద్దప్రాతిపదికన ఇదే మాదిరిగానే మొత్తం రాష్ట్రమంతా కూడా 90 రోజుల్లో పూర్తి చేయగలుగుతామని సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉన్నాయి’.


*ఇది ఒక అస్త్రం:*


‘దేవుని దయ వల్ల ఇదొక్కటే మన ముందున్న దారి, కోవిడ్‌ అనేది మనం ఆపలేం, ఎలాగూ వస్తుంది, వచ్చిపోతుంది, ఇది ఎవరూ ఆపగలిగే పరిస్ధితి లేదు, దీనితో సహజీవనం చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో మన దగ్గర ఉన్న ఏకైక అస్త్రం ఏంటంటే వ్యాక్సినేషన్, అగ్రెసివ్‌గా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ వ్యాక్సినేషన్‌ చేయించగలిగితే సహజంగానే ఆరోగ్య భద్రత అనేది ఇంకా మెరుగ్గా ఇవ్వగలుగుతాం. ఈ కార్యక్రమంలో భాగంగా, దేశంలో ఎక్కడా ఇంత ఇనిషియేటివ్‌ జరగలేదు. దేవుని దయ వల్ల మనకు గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్ధ ఉన్నాయి, ఈ వ్యవస్ధ ఏదైతే ఉందో దీని ద్వారా దేశానికి ఆదర్శంగా నిలుస్తూ, వ్యాక్సినేషన్‌ ఇలా కూడా చేయచ్చు అని దేశానికి చెప్పే పరిస్ధితి కూడా ఈ కొద్ది రోజుల్లో జరుగుతుంది’.


*చివరగా..*


అందరికీ మంచి జరగాలని మనసారా ఆశిస్తూ, దేవుని దయ ప్రజలందరిపై ఉండాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అంటూ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ తన క్లుప్త ప్రసంగం ముగించారు.


ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), హోం మంత్రి మేకతోటి సుచరిత, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గ్రామ, వార్డు సచివాలయాల స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేనని భాస్కర్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమానికి హాజరు.

Comments