ఎన్నికల ఏర్పాట్లపై కాంతిలాల్ దండే సమీక్ష.
హాజరైన కలెక్టర్, ఎస్పీ, సంయుక్త కలెక్టర్లు
విజయనగరం, ఏప్రిల్ 05 (ప్రజా అమరావతి) ః జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ, ఇప్పటి వరకు జరిగిన ఏర్పాట్లపై ఎన్నికల సాధారణ పరిశీలకులు కాంతిలాల్ దండే సమీక్ష నిర్వహించారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్‌లో కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్, ఎస్పీ బి. రాజకుమారి, సంయుక్త కలెక్టర్లు కిశోర్ కుమార్, మహేష్ కుమార్, వెంకటరావు, జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు, డీపీవో సునీల్ రాజ్ కుమార్ ఇతర ప్రత్యేక అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ప్రశాంత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు అందరూ సంసిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. ముందుగా జిల్లా కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ ఇప్పటి వరకు జరిగిన ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది, రూట్లు, ఓటర్లు తదితర అంశాలపై వివరించారు. అన్ని మండలాల్లో 34 జడ్పీటీసీలకు గాను మూడు ఏకగ్రీవమయ్యాయని మిగిలిన 31 చోట్లా ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. 549 ఎంపీటీసీ స్థానాలకు గాను ఏకగ్రీవాలు, చనిపోయిన వారిని తీసివేయగా చివరికి 482 స్థానాల్లో ఎన్నిక జరుగుతుందని చెప్పారు. మొత్తం 1879 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక జరగనుందని వివరించారు. జిల్లాలోని 34 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పక్కగా చేశామని, ప్రశాంత ఎన్నికలకు తగిన చర్యలు తీసుకున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.
అనంతరం పరిశీలకులు కాంతిలాల్ దండే మాట్లాడుతూ సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ పోలిస్ బందోబస్తు పెంచాలని, మైక్రో అబ్జర్వర్ మరియు కెమెరా మెన్‌ను ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలన్నారు. అభ్యర్థుల ప్రచారాలపై నిఘా ఉంచాలని చెప్పారు. ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని, అందరూ పాటించాలని పేర్కొన్నారు. గత వారం రోజుల మద్యం నిల్వలకు సంబంధించి వివరాలు కలెక్టర్‌కు అందజేయాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. గతంలో సిబ్బందికి భోజనాల విషయంలో ఇబ్బందులు తలెత్తాయని.. ఇప్పుడు అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భోజనాల బాధ్యత జేసీ కిశోర్ కుమార్ చూసుకోవాలని సూచించారు. అలాగే పోలింగ్‌కి ముందు, పోలింగ్ రోజు ఎలక్షన్ అథారిటీ, డిప్యూటీ ఎలక్షన్ అథారిటీ అధికారులు కేంద్రాలను సందర్శించాలని చెప్పారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఎన్నికలను సజావుగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు సందీప్ కృపాకర్ మాట్లాడుతూ అభ్యర్థుల ఖర్చు వివరాలపై నిఘా ఉంచాలని, ఎన్నికల అనంతరం సరైన వివరాలతో కూడిన నివేదికలు అందజేయాలని సూచించారు.
కార్యక్రమంలో డీఆర్‌వో ఎం. గణపతిరావు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి శ్రీధర్ రాజులు, అడిషనల్ ఎస్పీ శ్రీదేవి, డీడీవో రామచంద్రరావు, డ్వామా పీడీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment