లోక్ సభ స్పీకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో పాల్గొని కీలక సూచనలు చేసిన చంద్రబాబు

 *లోక్ సభ స్పీకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో పాల్గొని కీలక సూచనలు చేసిన చంద్రబాబు


...* 'కోవిడ్ వ్యాప్తి- ప్రజాప్రతినిధుల బాధ్యత' అనే అంశంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సోమవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్థిష్ట ప్రణాళితో ముందుకెళ్లాలని, పటిష్ట వ్యూహం అమలు చేయాలని తెలిపారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజా ప్రతినిధులు ప్రజలకు అండగా నిలబడటమే కాక, వారికి సరైన మార్గదర్శకత్వం అందిస్తూ ముందుండి దిశానిర్దేశం చేయాలి. కరోనా 2వ దశలో ప్రపంచంలోనే అత్యధిక కేసులు భారతదేశంలో నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 38 శాతం కేసులు మన దేశంలోనే నమోదవుతున్నాయి. ఇతర దేశాల్లో పోలిస్తే టీకా ప్రక్రియ భారత్ లో నెమ్మదిగా సాగుతోంది. దేశవ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ సహా ప్రజలందరికీ టీకా అందించాలి. ఓవైపు కరోనా నిబంధనలను కఠినంగా అమలుచేస్తూ, మరోవైపు టీకా ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా వైరస్ కు అడ్డుకట్ట వేయాలి. ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ కేసుల నమోదులో దేశంలోనే ఏపీ 5వ స్థానంలో ఉంది. పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 9.6 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 7,437మంది వైరస్ కు బలయ్యారు. కరోనా నిబంధనలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. టెస్టింగ్, ట్రేసింగ్ , ట్రాకింగ్ విషయంలో కేంద్రం మార్గదర్శకాలను ప్రభుత్వం పాటించకపోవడం వల్ల పరిస్థితి చేయిదాటింది. కరోనా మొదటి దశలో ఏపీ ప్రభుత్వం ఎలాగైతే ఒక వ్యూహమంటూ లేకుండా వ్యహరించిందో సెకండ్ వేవ్ లోనూ అదే రీతిలో వ్యవహరించడం బాధాకరం. దేశంలో అత్యధిక పాజిటివ్ కేసులు ఏపీలోనే నమోదవుతున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 14 నుంచి 20 ఉండటం ఆందోళన కలిగించే అంశం. విపత్కర పరిస్థితుల్లోనే నాయకత్వ సామర్థ్యం బయటపడుతుంది. వైద్య రంగంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు దృష్టి సారించాలి. పారామెడికల్ సిబ్బంది తమ విధులను యుద్ధప్రాతిపదికన నిర్వర్తించేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలాగే రోజువారీ టెస్టుల సంఖ్యను పెంచాలి. టీకా ప్రక్రియను వేగవంతం చేయాలి. ప్రభుత్వం, అధికార యంత్రాంగం మధ్య సమన్వయం, నిర్ధిష్ట ప్రణాళికల రూపకల్పనతో ద్వారా కరోనా వైరస్ కట్టడి సాధ్యమవుతుంది.

Comments