విద్యాదీవెనకు ఏర్పాట్లు పూర్తి జిల్లా కేంద్రంలో పాల్గొననున్నపురపాలక మంత్రి నియోజకవర్గాల్లో పాల్గొననున్న శాసనసభ్యులు విజయనగరం, ఏప్రిల్ 18 (prajaamaravathi);
జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో సోమవారం ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుండి ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభిస్తారని చెప్పారు. విద్యార్ధుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో వెంటనే ఫీజు రీఎంబర్స్‌మెంట్‌కు సంబంధంచిన నిధులు జమ అవుతాయని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలోను ఒక కళాశాల ఆడిటోరియం లేదా ఫంక్షన్ హాళ్లలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆన్ లైన్‌లో జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్న విద్యార్ధులు వారి తల్లిదండ్రులను పరిమిత సంఖ్యలో ఆహ్వానించాలని కలెక్టర్ మునిసిపల్ కమిషనర్‌లు, ఎంపిడిఓలు, మండల ప్రత్యేకాధికారులను ఆదేశించారు. ఈ విషయమై ఆదివారం సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఈ కార్యక్రమ నిర్వహణపై సూచనలు చేశారు. ఆయా నియోజకవర్గాల్లోని శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులను, మునిసిపల్ చైర్‌పర్సన్‌లు, మేయర్‌లు తదితరులను ఆహ్వానించాలని సూచించారు. అన్ని చోట్ల విద్యార్ధులు, వారి తల్లులు ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వీలుగా డిజిటల్ స్క్రీన్‌లు ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా భౌతికదూరం పాటించి, ప్రతిఒక్కరూ మాస్క్ ధరించి కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలన్నారు. ప్రతి వేదిక బయట వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటుచేసి శానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్ చేయాలన్నారు. కొన్ని చోట్ల వేదికల్లో మార్పు జరిగిందని అందుకు అనుగుణంగా ఆయా కొత్త వేదికల్లో ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. కురపాం నియోజకవర్గంకు సంబంధించి కురుపాంలోని ఏ.పి.మోడల్ స్కూల్ లోను, పార్వతీపురంలోని ఎస్.వి.డిగ్రీ కళాశాలలోను, సాలూరులో మెంటాడ వీధిలోని కళ్యాణమండపంలోను, బొబ్బిలిలోని రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న సూర్య రెసిడెన్సీలోను, గజపతినగరంలోని సాయిసిద్ధార్ధ డిగ్రీ కళాశాలలో, చీపురుపల్లికి సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో, నెల్లిమర్లకు సంబంధించి చింతలవలసలోని ఎం.వి.జి.ఆర్. ఇంజనీరింగ్ కళాశాలలో, విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి జె.ఎన్.టి.యు, ఇంజనీరింగ్ కళాశాలలో, ఎస్.కోటకు సంబంధించి వివేకానంద డిగ్రీ కళాశాలలో వేదికలు ఏర్పాటు చేయడం జరిగిందని, కలెక్టర్ కార్యాలయం నుంచి రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణతోపాటు పలువురు విద్యార్ధులు వారి తల్లులు ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడతారని పేర్కొన్నారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద మొదటి విడతగా జిల్లాలోని 57,238 మంది విద్యార్ధులకు రూ.29.22 కోట్లు ఫీజు రీఎంబర్స్‌మెంట్ కోసం సోమవారం విడుదల చేయనున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. కురుపాంలో 5626 మంది విద్యార్ధులకు రూ.2.63 కోట్లు, పార్వతీపురంలో 6161 మందికి రూ.3.31 కోట్లు, సాలూరులో 5202 మందికి రూ.2.57 కోట్లు, బొబ్బిలిలో 7,271 మందికి రూ.3.96 కోట్లు, గజపతినగరంలో 7784 మందికి రూ.3.80 కోట్లు, చీపురుపల్లిలో 6253 మందికి రూ.2.72 కోట్లు, నెల్లిమర్లలో 6464 మందికి రూ.3.00 కోట్లు, విజయనగరంలో 5951 మందికి రూ.3.57 కోట్లు, ఎస్.కోటలో 6526 మందికి రూ.3.66 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఫోటో క్యాప్షన్; సాలూరులో ఏర్పాట్లు పరిశీలిస్తున్న జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. టి.వెంకటేశ్వరరావు
addComments
Post a Comment