పాఠశాలలు పరిశుభ్రంగా ఉండాలి పిల్లలకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించాలి శిక్షణా కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి నాగమణి
విజయనగరం, ఏప్రెల్ 16 (prajaamaravathi) ః పాఠశాలల్లో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపైనా ఉందని జిల్లా విద్యాశాఖాధికారి జి.నాగమణి అన్నారు. దీనికి ఎంఇఓలు, ఉపాధ్యాయులతోపాటు, సిఆర్‌పిలు, ఆయాలు కృషి చేయాలని కోరారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఎంఇఓలు, హెడ్‌మాష్టర్లు, సిఆర్‌పిలు, ఉపాధ్యాయులు, ఆయాలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్నిశుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఇఓ నాగమణి మాట్లాడుతూ, పాఠశాలల్లో మరుగుదొడ్లు సౌకర్యం, మెరుగైన పారిశుధ్యం కల్పించడం ద్వారా పిల్లల హాజరు శాతాన్ని పెంచవచ్చని స్పష్టం చేశారు. ముఖ్యంగా పాఠశాలల్లో బాలికల శాతం తగ్గిపోవడానికి మరుగుదొడ్ల కొరతే కారణమని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరిగిన ఒక సర్వేలో తేటతెల్లం అయ్యిందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని సర్వశిక్షా అభియాన్, సమగ్ర శిక్ష కార్యక్రమాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందని చెప్పారు. నాడూ-నేడు మొదటిదశ క్రింద సుమారు రూ.246 కోట్ల రూపాయల వ్యయంతో, 1040 పాఠశాలల్లో మరుగుదొడ్లు, ఇతర అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందని చెప్పారు. నాడూ-నేడు రెండో విడత పనులు మే నుంచి ప్రారంభం అవుతాయని అన్నారు. కార్పొరేట్ పాఠశాలల కంటే మిన్నగా ప్రభుత్వ పాఠశాలలు రూపొందడం వల్ల, ఈ ఏడాది కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో 10,874 మంది విద్యార్థులు చేరారని చెప్పారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. అత్యున్నత విద్యార్హతలు, నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులతోపాటు, మెరుగైన సౌకర్యాలు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కొత్తగా చేరిన విద్యార్థులకోసం అదనంగా పాఠ్య పుస్తకాలను తెప్పించి, మండలాలకు పంపించడం జరిగిందని, అవి సక్రమంగా పంపిణీ జరిగేలా ఎంఇఓలు చూడాలని కోరారు. ప్రతీ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణా నిధిని ఏర్పాటు చేశారని, దీనిలో భాగంగా విద్యార్థుల సంఖ్యను బట్టి ఆయాలను నియమించడం జరిగిందని చెప్పారు. ఆయాలు ప్రతిరోజూ 3 సార్లు తప్పనిసరిగా మరుగుదొడ్లను శుభ్రపరచాలని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో ఇటీవల రాష్ట్రప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులను ప్రవేశపెట్టిందని చెప్పారు. ప్రభుత్వం నిర్ధేశించిన మెనూ ప్రకారం, విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు. ఎండిఎం యాప్‌పై ప్రతీఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు భోజనం పెట్టేచోట పారిశుధ్యం బాగుండేలా చూడాలని, సమయ పాలన పాటించాలని, పిల్లలకు సంతృప్తిగా ఆహారాన్ని అందించాలని కోరారు. ఇటీవల కాలంలో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందని, అందువల్ల తగిన జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు. భౌతిక దూరాన్ని పాటించేలా చూడటంతోపాటు, తప్పనిసరిగా మాస్కులను ధరింపజేయాలని, తరచూ చేతులను శుభ్రపరుచుకొనేలా చూడాలని డిఇఓ సూచించారు. ఈ అవగాహన మరియు శిక్షణా కార్యక్రమంలో డిప్యుటీ ఇఓ బ్రహ్మాజీ, ఎడి అరుణజ్యోతి, టిఓటిలుగా శిక్షణ పొందిన ఎంఇఓలు ఏ.కృష్ణారావు, శ్రీనివాసరావు, జ్యోతిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment