రాష్ట్రంలో కరువు నివారణ, పశుగ్రాసం కొరత తీర్చేందుకు ఫాడర్ సెక్యూరిటీ పాలసీ 2021-26.రాష్ట్రంలో కరువు నివారణ, పశుగ్రాసం కొరత తీర్చేందుకు ఫాడర్ సెక్యూరిటీ పాలసీ 2021-26.


*రాబోయే ఐదేళ్లలో రూ.250 కోట్ల వ్యయం చేయనున్న ప్రభుత్వం*


*వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో రైతుల భూముల్లోనే ధృవీకరించిన విత్తనాలు పండించడంతో పాటు, పశుసంవర్థకశాఖ భూముల్లోనూ ఇలాగే అమలయ్యేలా పశుగ్రాస భద్రతా విధానం*

 

*పేదల కోసం తీసుకొచ్చిన ఆహార భద్రతా చట్టం మాదిరిగానే మూగజీవాల కోసం పశుగ్రాసం భద్రతా పాలసీ*


*పాడి రైతులకు 75% వరకు సబ్సిడీపై పశువుల దాణా, అవసరమైన పనిముట్లు*


*ఆర్‌ఐడిఎఫ్ క్రింద రాయలసీమలోని 4 జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలో ఫాడర్ బ్యాంకుల ఏర్పాటు*


*ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుండి మిగులు గ్రాసాన్ని కొరత ఎదుర్కొంటున్న రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సరఫరా*


*ఐదేళ్ల వ్యవధిలో లక్ష ఎకరాల్లో శాశ్వత పశుగ్రాస పెంపకం*


*:పశు సంవర్థక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి పూనం మాల కొండయ్య*


విజయవాడ, 7 మే (ప్రజా అమరావతి): రాష్ట్రంలో పశుగ్రాసం కొరతను తీర్చి పశు సంపద ఉత్పత్తిని మరింత ప్రోత్సహించేందుకు ఫాడర్ సెక్యూరిటీ పాలసీ 2021-26 ని అమలు చేస్తున్నట్లు పశు సంవర్థక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి పూనం మాల కొండయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యధిక వృద్ధి సామర్థ్యంతో జీఎస్డీపీలో 7 శాతం, దేశీయ వ్యవసాయ ఉత్పత్తిలో 26 శాతం అందిస్తున్న ఈ రంగం రాష్ట్ర సామాజిక,ఆర్థిక అభివృద్ధిలో కీలకంగా మారిందని ఆమె పేర్కొన్నారు.

రాష్ట్రంలో వ్యవసాయ అనుకూల వాతావరణ పరిస్థితులు, సమృద్ధిగా వనరుల లభ్యత ఉన్నప్పటికీ వేసవి, కరవు సమయాల్లో పశుగ్రాసం కొరత ప్రధాన సమస్యగా మారిందని శ్రీమతి పూనం మాలకొండయ్య తెలిపారు. పశు సంపద ఉత్పత్తిలో పశుగ్రాసం కీలకంగా ఉన్నందున పశుగ్రాసం కొరత తీర్చి ఈ రంగంలో మరింత వేగంగా వృద్ధి సాధించడానికి సమగ్ర పశుగ్రాస విధానం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 


రాష్ట్రంలో పశుగ్రాసం పెంచే భూముల పునరుద్ధరణతో పాటు రాష్ట్ర అవసరాలకు సరిపడే గ్రాసం అందించడమే లక్ష్యంగా రూ.250 కోట్ల వ్యయంతో రాబోయే ఐదేళ్లలో ఫాడర్ సెక్యూరిటీ పాలసీ 2021-26 అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు లక్ష్యాలు రూపొందించుకొని తదనుగుణంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. ఇందులో భాగంగా వేసవి, కరవు సమయాల్లో పశుగ్రాసం లభ్యమయ్యేలా చూడటం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పశుగ్రాసం ఉత్పత్తి పెంచడం, వ్యవసాయ అనుకూల వాతావరణ పరిస్థితులను వినియోగించుకొనేందుకు పంట కోత అనంతర చర్యల నిర్వహణ, వినియోగదారుల బృందాలు మరియు ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతో ఫాడర్ బ్యాంకులు/ నిల్వ సౌకర్యాలు ఏర్పాటు చేయడం, అదనపు విలువ చేకూరే చర్యల నిర్వహణ ద్వారా ఉత్పత్తి ఖర్చులను తగ్గించడం, ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించుకునేలా విధానాలు రూపొందించడం, ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించేందుకు వీలుగా తగిన విధానాలు రూపొందించడం వంటి కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు వివరించారు. 


రాష్ట్రంలో కరువు నివారణ, పశుగ్రాసం కొరత తీర్చేందుకు గానూ ఆర్‌బికెల ద్వారా రైతులకు 75% సబ్సిడీతో విత్తనాలను సరఫరా చేయడం ద్వారా  ధృవీకరించబడిన పశుగ్రాస విత్తనాల అభివృద్ధి, శాశ్వత పశుగ్రాస ఉత్పత్తిని ప్రోత్సహించడం, పచ్చిక భూముల అభివృద్ధి, MGNREGS క్రింద వ్యక్తిగత మరియు కమ్యూనిటి భూములలో శాశ్వత పశుగ్రాస పెంపకం చేపట్టడం చేస్తున్నామన్నారు.


కరవు, విపత్తులు సంభవించిన ప్రాంతాల్లో పాడి రైతులకు 75% వరకు సబ్సిడీపై పశువుల దాణా, అవసరమైన పనిముట్లు అందించడంతో పాటు ఆర్‌ఐడిఎఫ్ క్రింద రాయలసీమలోని 4 జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన ఫాడర్ బ్యాంకుల ద్వారా సైలేజ్ బేల్స్ నిల్వచేసి అవసరమైన రైతులకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుండి మిగులు గ్రాసాన్ని, కొరత ఎదుర్కొంటున్న రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా సరఫరా చేస్తామన్నారు. 


కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న MGNREGS మరియు NLM పథకాల క్రింద కూడా పశుగ్రాస అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఇందులో భాగంగా రూ.773.94 కోట్ల వ్యయంతో ఐదేళ్ల వ్యవధిలో లక్ష ఎకరాల్లో శాశ్వత పశుగ్రాస పెంపకం చేపట్టడం జరుగుతుందని తెలిపారు.  లైవ్ స్టాక్  సంబంధిత కార్యక్రమాల ద్వారా MCCల ఆధ్వర్యంలో సంవత్సరానికి రూ.154.78 కోట్ల వ్యయంతో 20వేల ఎకరాల్లో చేపట్టనున్న ఈ కార్యక్రమంలో ఎకరాకు రూ.77,204 ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. 


పాడి పరిశ్రమ ద్వారా మహిళ సాధికారత సాధ్యపడుతుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల వల్ల రాబోయే 5 సంవత్సరాలలో ప్రస్తుతం 152.63 LMT లుగా ఉన్న పాల దిగుబడి,  8.50 LMT మాంసం ఉత్పత్తి రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నామని శ్రీమతి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. 

Comments