వైయస్సార్‌ మత్స్యకార భరోసా వరసగా మూడో ఏడాది అమలు:


అమరావతి (ప్రజా అమరావతి);



వైయస్సార్‌ మత్స్యకార భరోసా వరసగా మూడో ఏడాది అమలు:


*క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి పథకంలో భాగంగా మత్స్యకారులకు నగదు బదిలీ చేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌:* 


*ఆక్వా రైతులతో పాటు, ఏ ఒక్క మత్స్యకారుడు నష్టపోకూడదు*

*అందుకే రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా ఆక్వా హబ్‌ల నిర్మాణం*

*ఒక్కో హబ్‌ కింద 120 రీటెయిల్‌ షాప్‌లు, ఆ విధంగా 12 వేల షాప్‌లు*

*ఈ ఏడాది, వచ్చే ఏడాది.. ఈ రెండేళ్లలో ఆ మేరకు కార్యాచరణ అమలు*

*దీంతో ఆక్వా ఉత్పత్తులు, మత్స్యకారుల చేపలకు గిట్టుబాటు ధర*

*ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ ప్రకటన*

*ఆక్వా రైతుల కోసం 35 చోట్ల ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబ్‌ల ఏర్పాటు*

*ఆర్బీకేలతో ఆక్వా ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌ల అనుసంధానం*

*ఆక్వా సాగుదారులకు, రైతులకు నాణ్యతతో కూడిన ఇన్‌పుట్స్‌*

*వాటి ద్వారా నాణ్యమైన సీడ్‌ మొదలు ఫీడ్, మందులు సరఫరా*

*మత్స్యకారులకు అండగా ఉండేందుకు 8 ఫిషింగ్‌ హార్బర్లకు శ్రీకారం*

*ప.గోదావరి జిల్లాలో ఏపీ ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం*

*ఈ ఏడాదిలోనే పనులు మొదలు పెట్టబోతున్నాం*

*ఈ వర్సిటీ ద్వారా మత్స్యకారులకు సాంకేతికపరమైన శిక్షణ*

*తద్వారా వారికి మంచి ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యం*

*మత్స్యకార భరోసా చెల్లింపుల సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌*


*అమరావతి:*


చేపల వేటపై నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు వైయస్సార్‌ మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం, వరసగా మూడో ఏడాది పథకం లబ్ధిదారులకు ఆర్థికంగా ప్రయోజనం కల్పించింది. క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, 1,19,875 మంది మత్స్యకారుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున మొత్తం రూ.119.88 కోట్లు జమ చేశారు.


*వైయస్సార్‌ మత్స్యకార భరోసా పథకం అమలు సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రసంగం:*

 

*పేదల కష్టాలు ఎక్కువని భావించే..:*

‘దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రెండేళ్ల పాలన కూడా పూర్తి కాకముందే మూడో ఏడాది ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు అండగా, తోడుగా ఉంటామన్న మాట నిలబెట్టుకుంటూ,  కోవిడ్‌ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ప్రభుత్వ కష్టాలకన్నా, పేదలు, సామాన్యుల కష్టాలు ఇంకా ఎక్కువని భావించి ఇవాళ అక్షరాలా 1,19,875 మత్స్యకార కుటుంబాలకు బటన్‌ నొక్కగానే వారి ఖాతాల్లో దాదాపు రూ.120 కోట్లు జమ అవుతున్నాయి. ఇందుకు ఎంతో సంతోషపడుతున్నాను’.


*మంచి కార్యక్రమం:*

‘ఇది మంచి కార్యక్రమం ఎందుకంటే ఒక వైపు కోవిడ్‌. మరోవైపు ఏప్రిల్‌ 15 నుంచి రెండు నెలల పాటు చేపలవేటపై నిషేధం. ఇటువంటి పరిస్థితుల్లో దాదాపు 1.20 లక్షల కుటుంబాలకు రూ.10 వేల సహాయం ఎంతో సహాయంగా నిలుస్తుంది’.


*మాట నిలబెట్టుకున్నాను:*

ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే, ప్రతి కుటుంబంలో ఒక అన్నగా, తమ్ముడిగా, అన్ని రకాలుగా తోడుగా ఉంటానని చెప్పి, మత్స్యకార భరోసా పథకం అమలు చేస్తున్నాము. తొలి ఏడాది లక్ష మందితో మొదలు పెట్టగా ఇప్పుడు దాదాపు 1,20 లక్షల లబ్ధిదారులు. ఇప్పటి వరకు దాదాపు రూ.332 కోట్లు నేరుగా బటన్‌ నొక్కి ప్రతి మత్స్యకార కుటుంబానికి చేరవేశానని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను’.


*అక్క చెల్లెమ్మలు. నిరుపేదలు:*

‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలల కాలంలో ప్రతి పథకం, ప్రతి అడుగులో అక్క చెల్లెమ్మల కోసం, ప్రతి అడుగు, ప్రతి కార్యక్రమంలో పేదలకు మంచి జరగాలన్న తపన, తాపత్రయంతో అడుగులు వేశాము’.

‘అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యా కానుక, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, వైయస్సార్‌ రైతు భరోసా, ఆసరా, వైయస్సార్‌ చేయూత, పెన్షన్‌ కానుక, వైయస్సార్‌ ఇళ్ల పట్టాల పంపిణీ కానివ్వండి.. ఇలా ఏ పథకం చూసినా ఎక్కడా వివక్షకు తావు లేకుండా, ఎక్కడా అవినీతికి తావు లేకుండా, గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి, ప్రతి ఒక్క పథకంలో  ప్రతి పేదకు అండగా ఉండేలా మీ బిడ్డగా అండగా ఉన్నానని సంతోషంగా చెబుతున్నాను’.


*గతంలో ఏం జరిగింది?:*

‘చేపల వేట నిషేధ సమయంలో గతంలో రూ.4 వేలు ఇస్తామని చెప్పినా, ఏనాడూ సక్రమంగా అమలు చేయలేదు. ఏనాడూ సకాలంలో ఇవ్వలేదు. ఇచ్చినా అరకొరగానే ఇచ్చారు. చేపలవేట నిషేధ సమయంలో ఇస్తామని చెప్పినా, అలా ఇచ్చిన దాఖలా లేదు. అదే విధంగా డీజిల్‌పై రూ.6 సబ్సిడీ ఇస్తామన్నా కూడా సక్రమంగా ఏనాడూ ఇవ్వలేదు. పైగా ఆనాడు కేవలం 5 వేల బోట్లకు మాత్రమే ఇచ్చారు’.


*మరి ఇప్పుడు?:*

‘కానీ ఇవాళ 26,823 బోట్లకు లీటరు డీజిల్‌కు రూ.9 సబ్సిడీ ఇస్తున్నాము. అంటే బోట్ల సంఖ్య పెరిగింది. సబ్సిడీ కూడా పెరిగింది. 100 పెట్రోల్‌ బంకులను అందుకోసం కేటాయించాము. డీజిల్‌ కొనుగోలు చేసిన వెంటనే స్మార్ట్‌కార్డుల ద్వారా ఆ రాయితీని బంకు యజమానులకు చెల్లించేలా ఏర్పాటు చేశాం. దీనికి మరో రూ.48 కోట్లు ఖర్చు చేశామని మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తున్నాను’.


*రూ.6.7 కోట్లు సహాయం:*

‘గతంలో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు దురదృష్టశాత్తూ చనిపోతే, పట్టించుకున్న వారు లేరు. కానీ మన ప్రభుత్వం వచ్చాక ఎవరు ఎక్కడ ప్రమాదవశాత్తూ చనిపోయినా వెంటనే గుర్తించి, అక్షరాలా 67 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.6.7 కోట్లు ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగిందని తెలియజేస్తున్నాను’.


*ఆక్వా రైతులు–ప్రభుత్వం:*

‘ఇలా ప్రతి అడుగులో వేటకు వెళ్లే మత్స్యకారులకు తోడుగా ఉండడంతో పాటు, ఆక్వా సాగుపై ఆధారపడిన రైతులకు కూడా అండగా నిల్చాం. ఇంకా ఆక్వా సాగుకు యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50 కే సరఫరా చేయడం ద్వారా 53,550 మంది ఆక్వా రైతులకు ప్రయోజనం కలుగుతోంది. దీని వల్ల ఏటా దాదాపు రూ.780 కోట్ల భారం పడుతున్నా, ఈ రెండేళ్లలో దాదాపు రూ.1560 కోట్ల భారం పడుతున్నా ఆక్వా రైతుల కోసం ప్రభుత్వం ఈ రాయితీని సంతోషంగా భరిస్తుందని మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను’.

‘ఆక్వా సాగులో ఏ రైతుకు కూడా నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో, నాణ్యత లేకుండా రైతులు నష్టపోకూడదన్న లక్ష్యంతో 35 చోట్ల రూ. 50.30 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. ఏయే నియోజకవర్గాలలో ఆక్వా సాగు చేస్తున్నారో, వాటిలో ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి, సీడ్‌ మొదలు ఫీడ్‌ వరకు అందించడం జరుగుతోంది’.

‘ఇంకా ఆర్బీకేలతో వాటిని ఇంటిగ్రేట్‌ చేసి ప్రతి రైతుకు నాణ్యతతో కూడిన సీడ్, ఇన్‌పుట్స్, ఫీడ్‌ కానీ మందులు కానీ సరఫరా చేయడం జరుగుతోందని సగర్వంగా తెలియజేస్తున్నాను’.


*ఫిషింగ్‌ హార్బర్లు:*

‘మన మత్స్యకారులు ఉపాధి కోసం ఎందుకు సుదూర ప్రాంతాలకు వలస పోయి, తెలిసీ తెలియక విదేశీ సముద్ర జలాల్లోకి ప్రవేశించి, జైళ్ల పాలవుతున్నారని గతంలో ఎవరూ ఆలోచించలేదు. ఆ పరిస్థితి రాకూడదని చెప్పి, 8 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం’.

‘గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం ఫిషింగ్‌ హార్బర్ల ఆధునీకరణతో పాటు, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద కొత్తగా రెండు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇప్పటికే వీటి పనులు మొదలయ్యాయి’.

‘ఈ నాలుగింటి ప్రాజెక్టు వ్యయం రూ.1509.80 కోట్లు కాగా, రెండో దశలో భాగంగా రూ.1365.35 కోట్ల అంచనాతో శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో నాలుగు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు ఖరారు చేసి, ఈ ఏడాదిలోనే పనులు మొదలు పెడతాం’.


*80 వేల మందికి..:*

‘రూ.2775 కోట్లు. 8 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం. వాటి వల్ల దాదాపు 80 వేల మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని, వేగంగా అడుగులు వేస్తున్నాము’.


*ఆక్వా హబ్‌లు:*

‘ఆక్వా రైతులతో పాటు, ఏ ఒక్క మత్స్యకారుడు కూడా నష్టపోకూడదన్నది ప్రభుత్వ లక్ష్యం. వారికి సరైన గిట్టుబాటు ధరలు రావాలన్న ఉద్దేశంతో దాదాపు 100కు పైగా ఆక్వా హబ్‌ల నిర్మాణానికి కార్యాచరణ. ఒక్కొక్క హబ్‌ కింద దాదాపు 120 రీటెయిల్‌ షాప్‌లు. అంటే 100కు పైగా ఆక్వా హబ్‌లు. మరో 12 వేల రీటెయిల్‌ షాప్‌లు వస్తాయి. వీటి వల్ల ఆక్వా ఉత్పత్తులు కానీ, సముద్రంలో వేటకు వెళ్లి మత్స్యకారులు తీసుకు వచ్చిన మత్స్య సంపదకు కానీ మంచి ధరలు వస్తాయి. ఈ ఏడాది, వచ్చే ఏడాది.. రెండేళ్లలో దీంట్లో పురోగతి కనిపిస్తుందని ప్రతి అక్క చెల్లెమ్మలకు తెలియజేస్తున్నాను’.


*ఫిషరీస్‌ వర్సిటీ:*

‘పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం. ఈ ఏడాదిలోనే పనులు మొదలు పెట్టబోతున్నాం. దీని ద్వారా మత్స్యకారులకు సాంకేతికపరమైన శిక్షణ ఇచ్చి, వారికి మంచి ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యం. దేవుడి దయ వల్ల మత్స్యకారులకు మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం’.


*ఓఎన్జీసీ ఇవ్వకపోయినా..!:*

‘2012లో జీఎస్‌పీసీ, ఓఎన్జీసీ తవ్వకాల వల్ల ముమ్మిడివరం నియోజకవర్గంలో దాదాపు 14,927 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయింది. ఒక్కో కుటుంబానికి రూ.47,250 పరిహారం ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. అయినా వారి గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఆ కుటుంబాలను ఆదుకుంటానని నా పాదయాత్రలో వారికి హామీ ఇచ్చాను. ఆ తర్వాత అధికారంలోకి రాగానే ముమ్మిడివరంలోనే సమావేశం పెట్టి, రూ.75 కోట్లు ప్రభుత్వమే భరించి ఇచ్చింది. ఆ విధంగా 14,927 కుటుంబాలను ఆదుకుంది. ఓఎన్జీసీ నుంచి ఇంకా ఆ డబ్బులు పూర్తిగా రాలేదు’.


*ప్రతి అడుగులో..:*

‘ఈ విధంగా ఎక్కడా పేదలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ప్రతి అడుగు ముందుకు వేశామని సగర్వంగా చెబుతూ, ఈ కార్యక్రమం ద్వారా ప్రతి మత్స్యకార కుటుంబానికి మంచి జరగాలని, దేవుడి దయతో మీ అందరికీ ఇంకా మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంటూ.. సెలవు తీసుకుంటున్నాను’.. అంటూ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రసంగం ముగించారు. 


*మత్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు: సీదిరి అప్పలరాజు, పశు సంవర్థక శాఖ మంత్రి*:

– ‘ఇవాళ మూడో విడత మత్స్యకార భరోసా. ఇందులో భాగస్వామ్యం అవుతున్నందుకు సీఎం గారికి కృతజ్ఞతలు. కోవిడ్‌ సంక్షోభంలో కూడా ఏ ఒక్క కార్యక్రమాన్ని, పథకాన్ని ఆపకుండా దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారు. విదేశాల్లో చిక్కుకున్న మత్స్యకారులను సురక్షితంగా తీసుకు వచ్చారు. అదే విధంగా కోవిడ్‌ సమయంలో వివిధ తీర ప్రాంతాలు, పోర్టుల్లో చిక్కుకుపోయిన మత్య్సకారులను స్వస్థలాలకు తరలించారు. తీర ప్రాంతం ఉన్న ప్రతి జిల్లాకు హార్బర్‌ కట్టించాలన్న మీ ఆలోచన. దాని ద్వారా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని మీరు చేస్తున్న కృషికి ప్రతి ఒక్క మత్స్యకారుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు’.


పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, మత్స్యశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయం) అంబటి కృష్ణారెడ్డితో పాటు, మత్స్య శాఖకు చెందిన పలువురు సీనియర్‌ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, వివిధ జిల్లాల నుంచి అధికారులు, పథకం లబ్ధిదారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు.

Comments