తాడిపత్రి వద్ద తాత్కాలిక ఆసుపత్రి నిర్మాణం వల్ల మూడు జిల్లాల వారికి వైద్యసేవలు.

 తాడిపత్రి వద్ద తాత్కాలిక ఆసుపత్రి నిర్మాణం వల్ల మూడు జిల్లాల వారికి వైద్యసేవలు.  *మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ* 


అనంతపురము, మే 13 (ప్రజా అమరావతి);


తాడిపత్రి వద్దనున్న అర్జా స్టీల్స్ సమీపంలో 500 ఆక్సిజన్ పడకలతో నిర్మించ తలపెట్టిన తాత్కాలిక ఆసుపత్రి పనులు త్వరితగతిన పూర్తి అయితే మూడు జిల్లాల వారికి వైద్యసేవలు అందుతాయని

  డీఆర్సీ సమావేశంలో  రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ తెలిపారు.


హిందూపూర్, కదిరి, పెనుగొండ ప్రాంతాలలో కర్ణాటక నుంచి తిరిగి వచ్చిన వలస కూలీలు పెద్ద సంఖ్యలో ఉన్నందున ఫీవర్ సర్వే చేపట్టి కరోనా అనుమానితులను గుర్తించి కోవిడ్ కేర్ సెంటర్లకు లేదా ఆసుపత్రులకు తరలించగలిగితే కోవిడ్ ప్రబల కుండా నిలువరించొచ్చన్నారు. 


జిల్లాకు కర్ణాటక రాష్ట్రం నుంచి ఆక్సిజన్ తెచ్చేందుకు కృషి చేస్తున్న ఇంచార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో కోవిడ్ కట్టడి చేసేందుకు మంత్రి సహకారం మరువలేనిదన్నారు. జిల్లా యంత్రాంగం కూడా మంత్రి పర్యవేక్షణలో చక్కగా పనిచేస్తోందన్నారు.


ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ రాయదుర్గం నియోజక వర్గంలో ఆక్సిజన్ పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు కరోనా వస్తే ఆక్సిజన్ బెడ్ల కోసమే ఎదురుచూస్తున్నారన్నారు. జిల్లాలో గ్యాసియస్ ఆక్సిజన్ నిల్వలు ఎక్కువగా ఉన్నాయని, ఆ నిల్వలను సిలిండర్లలో నింపి నియోజక వర్గం పరిధిలో కోవిడ్ కేర్ సెంటర్లు నిర్మించి సిలిండర్లు అందించగలిగితే జిల్లా కేంద్రంపై ఒత్తిడి తగ్గుతుందన్నారు.