వైయస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌’ వరసగా మూడో ఏడాది అమలు:


అమరావతి (ప్రజా అమరావతి);


వైయస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌’ వరసగా మూడో ఏడాది అమలు:




*ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. వారి కోసం ఎన్నో కార్యక్రమాలు*

*కోవిడ్‌ సంక్షోభంలో ప్రభుత్వం కంటే రైతులవే ఎక్కువ కష్టాలు*

*వారు సాగులో ఏ ఇబ్బంది పడకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం*

*అందుకే వరసగా మూడో ఏడాది రైతు భరోసా–పిఎం కిసాన్‌ అమలు*

*52.38 లక్షల రైతుల ఖాతాల్లో ఇప్పుడు రూ.3,928 కోట్లు జమ*

*ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ ప్రకటన*

*కోవిడ్‌ సమూల నిర్మూలనకు వ్యాక్సిన్‌ ఒక్కటే పరిష్కారం*

*కానీ దేశంలో వ్యాక్సిన్‌ తగినంత ఉత్పత్తి కావడం లేదు*

*అందువల్ల కోవిడ్‌తో సహజీవనం చేస్తూనే ఎదుర్కోక తప్పదు*

*రైతులు తమ పని చేసుకుంటూ, కోవిడ్‌పై జాగ్రత్తలు తీసుకోవాలి*

*మాస్క్‌లు ధరించడం, చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం*

*ఈ మూడు దైనందిక జీవితంలో ఒక భాగం కావాలి*

*ఈనెల 25న వైయస్సార్‌ ఉచిత పంటల బీమా సొమ్ము*

*దాదాపు 38 లక్షల రైతులకు సుమారు రూ.2 వేల కోట్లు*

*వైయస్సార్‌ రైతు భరోసా చెల్లింపుల సందర్భంగా సీఎం*


వైయస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకంలో భాగంగా మూడో ఏడాది తొలి విడత చెల్లింపుల కింద, క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, 52.38 లక్షల రైతుల ఖాతాల్లో రూ.7500 చొప్పున రూ.3928.88 కోట్లు జమ చేశారు.


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..*:


*రైతులు ఇబ్బంది పడకూడదని..:*

‘ఈరోజు మళ్లీ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం. దాదాపు 52.38 లక్షల రైతులకు రైతు భరోసా మూడో ఏడాదికి సంబంధించి ౖమొదటి విడతగా రైతుల ఖాతాల్లో నేరుగా రూ.3,928 కోట్లు జమ చేస్తున్నాము. ఒక గొప్ప కార్యక్రమాన్ని దేవుడి దయతో మీ బిడ్డగా ఈ కార్యక్రమం చేయగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది’.

‘కోవిడ్‌తో కష్టకాలం ఉన్నా, ఆర్థిక వనరులు తగిన స్థాయిలో లేకపోయినా, రైతుల కష్టాలు ప్రభుత్వ కష్టాల కంటే ఎక్కువని, వారికి ఎలాంటి కష్టం కలగకూడదని అడుగులు ముందుకు వేస్తున్నాము. అందులో భాగంగానే ఇవాళ వైయస్సార్‌ రైతు భరోసా కింద 52.38 లక్షల రైతులకు రూ.3,928 కోట్ల పెట్టుబడి సాయం చేస్తున్నాము’.


*23 నెలలు. రూ.89 వేల కోట్లు*:

‘ఈ 23 నెలల పాలన చూస్తే, దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో దాదాపు రూ.89 వేల కోట్లు.. వినడానికి ఆశ్చర్యం కలిగించే విధంగా మీ బిడ్డ, నేరుగా బటన్‌ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశాము. ఎక్కడా వివక్ష లేకుండా, లంచాలకు తావు లేకుండా, పూర్తి పారదర్శకంగా, పక్కాగా సామాజిక తనిఖీలు చేసి, ఏ ఒక్క అర్హుడు మిస్‌ కాకుండా అందరికీ ప్రయోజనం కల్పించాము. ప్రతి పేదవాడికి సహాయం అందించే విధంగా అడుగులు ముందుకు వేశాము’.


*రైతు భరోసా. రూ.17,029 కోట్లు*:

‘ఒక్క రైతులను గమనిస్తే, ఇవాళ అర కోటికి పైగా రైతులకు రూ.3,928 కోట్లు వారి ఖాతాల్లోకి వరసగా మూడో ఏడాది తొలి విడతగా వేస్తున్నాము. 2019–20 నుంచి ఇప్పటి వరకు ఒక్క రైతు భరోసా కింద రూ.13,101 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని రైతు బిడ్డగా, మీ బిడ్డగా గర్వంగా చెబుతున్నాను. ఇవాళ్టి మొత్తం కూడా కలుపుకుంటే ఒక్క రైతు భరోసా కింద అక్షరాలా రూ,17,029 కోట్లు ఇచ్చామని ఈ సందర్భంగా సగర్వంగా చెబుతున్నాను’.


*రైతన్నలకు మొత్తం రూ.68 వేల కోట్లు*:

‘ఇక ఈ 23 నెలల్లో రైతన్నలకు వివిధ పథకాల కింద నేరుగా అక్షరాలా అందించిన సహాయం రూ.68 వేల కోట్లకు పైగానే ఉందని గర్వంగా చెబుతున్నాను’.


*ఏయే వాటికి ఎంతెంత?*:

‘రైతు భరోసా కింద 52.38 లక్షల రైతులకు మొత్తం రూ.17,029 కోట్లు ఈ 23 నెలల కాలంలో ఇవ్వగలిగాము. వైయస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల కింద, గత ప్రభుత్వం వదిలిపెట్టి పోయిన బకాయిలు కూడా కలుపుకుంటే అక్షరాలా 67.50 లక్షల రైతులకు రూ.1,261 కోట్లు ఈ 23 నెలల్లోనే ఇవ్వగలిగాం. వైయస్సార్‌ ఉచిత పంటల బీమా 15.67 లక్షల రైతులకు ఇప్పటి వరకు రూ.1,968 కోట్లు ఇవ్వగలిగాము’.

‘ప్రకృతి వైపరీత్యాల కింద పంట నష్టపోయిన 13.56 లక్షల రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద ఈ 23 నెలల్లో అక్షరాలా రూ.1038 కోట్లు ఇవ్వగలిగాం. ధాన్యం కొనుగోలకు కోసం అక్షరాలా రూ.18,343 కోట్లు ఖర్చు చేశామని గర్వంగా తెలియజేస్తున్నాను. ఇతర పంటలు కూడా కొనుగోలు చేసి రైతన్నలకు తోడుగా నిలబడేందుకు ఈ 23 నెలల కాలంలో రూ.4,761 కోట్లు ఖర్చు చేయగలిగాం’.

‘ఉచిత వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీ కింద ఈ 23 నెలల కాలంలో అక్షరాలా  రూ.17,430 కోట్లు ఖర్చు చేయగలిగామని గర్వంగా చెబుతున్నాను. పగలే రైతులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం ఫీడర్లపై రూ.1700 కోట్లు ఖర్చు చేశాం’.

‘గత ప్రభుత్వం వదిలి పెట్టిపోయిన ధాన్యం బకాయిలు రూ.960 కోట్లు మీ బిడ్డ తీర్చాడు. విత్తన సేకరణ బకాయిలు కూడా రూ.384 కోట్లు వెచ్చించామని గర్వంగా చెబుతున్నాను’.

‘శనగ రైతులకు బోనస్‌ కింద దాదాపు రూ.300 కోట్లు ఖర్చు చేశాం.

సూక్ష్మ సేద్యం, పండ్ల తోటల అభివృద్ధి కోసం 13.58 లక్షల ఎకరాలలో రూ.1224 కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా చెబుతున్నాను. ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్‌ కేవలం రూ.1.50 కే ఇస్తూ, ఏటా దాదాపు రూ.760 కోట్ల భారం భరిస్తూ, ఈ రెండేళ్లలో దాదాపు రూ.1560 ఖర్చు చేశామని తెలియజేస్తున్నాను’.


*ఇంత కన్నా ఏం రుజువు కావాలి?*:

‘ఆ విధంగా ఈ 23 నెలలో రాష్ట్రంలో రైతన్నల కోసం అక్షరాలా రూ.68 వేల కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా, మీ బిడ్డగా తెలియజేస్తున్నాను. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి?’.


*ప్రతి రైతుకూ పథకంలో మేలు:*

‘దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు, అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులు, ‘అటవీ హక్కు పత్రాలు’ (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) పొంది సాగు చేసుకుంటున్న గిరిజన రైతులు, దేవాలయాల భూములు సాగు చేస్తున్న రైతులకు కూడా వైయస్సార్‌ రైతు భరోసా పథకం వర్తింప చేస్తున్నాం’.

‘రాష్ట్రంలో దాదాపు 50 శాతం రైతులకు అర హెక్టారు (1.25 ఎకరాలు) భూమి మాత్రమే ఉంది. అదే ఒక హెక్టారు (2.5 ఎకరాల) వరకు భూమి ఉన్న రైతులు దాదాపు 70 శాతం ఉన్నారు. వైయస్సార్‌ రైతు భరోసా కింద ప్రభుత్వం చేస్తున్న రూ.13,500 సాయం, ఆ రైతులందరికీ దాదాపు 80 శాతం సరిపోతుందని సగర్వంగా తెలియజేస్తున్నాను’.


*చెప్పిన దాని కంటే ఎక్కువ:*

‘మేనిఫెస్టోలో ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లు ఇస్తామని చెప్పినా,  అధికారంలోకి రాగానే రైతన్నల కష్టాలు చూసి, చెప్పిన దాని కన్నా ఒక ఏడాది ముందుగానే, ఇస్తామన్న దాని కన్నా మరో వెయ్యి రూపాయలు ఎక్కువగా రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా 13 వేల 500 చొప్పున, అయిదేళ్లలో మొత్తం 67 వేల 500 రూపాయల చొప్పున సహాయం చేస్తున్నాము. ఆ విధంగా రైతన్నలకు రూ.17,500 అదనంగా ఇవ్వగలుగుతున్నామని మీ బిడ్డగా గర్వంగా చెబుతున్నాను’.


*ఈ నెలలోనే మరో రూ.2 వేల కోట్లు*:

‘ఖరీఫ్‌ సాగు ఇప్పుడు మొదలవుతోంది. పెట్టుబడి కోసం ఏ రైతు ఇబ్బంది పడకూడదని ఇవాళ మొదటి విడత పెట్టుబడి సాయం చేస్తున్నాం.

అదే విధంగా వైయస్సార్‌ ఉచిత పంటల బీమా కింద ఈనెల 25న దాదాపు 38 లక్షల రైతులకు దాదాపు రూ.2 వేల కోట్లు అందించబోతున్నామని చిరునవ్వుతో చెబుతున్నాను’.


*వారిని ఆదుకోవడమే లక్ష్యంగా*..:

‘దాదాపు 5 కోట్లు జనాభా ఉన్న మన రాష్ట్రంలో రైతులు, మహిళలు, పిల్లలు కానీ.. మరీ ముఖ్యంగా ఉన్న పేద వర్గాలు.. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ 23 నెలల పరిపాలన సాగిందని ప్రతి రైతుకు చెబుతున్నాను’.


*మాట నిలబెట్టుకున్నాను*:

‘ఎన్నికల సమయంలో మామూలుగా పార్టీలు 600 పేజీల మేనిఫెస్టో ప్రకటించడం, ఆ తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేయడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మనమంతా చూశాం. కానీ అలాంటి పరిస్థితి రాకూడదని, ఎన్నికలప్పుడు కేవలం రెండు పేజీల మేనిఫెస్టో ప్రకటించి, దాన్నే భగవద్గీత, ఖురాన్, బైబిల్‌లా భావిస్తామని చెప్పి, తూచ తప్పకుండా ఈ 23 నెలల కాలంలో మేనిఫెస్టోలో 90 శాతానికి పైగా అమలు చేశామని మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తున్నాను’.


*కోవిడ్‌తో యుద్ధం*:

‘ఇవాళ పరిస్థితి మీకు తెలుసు. ఒకవైపు కోవిడ్‌తో యుద్ధం చేస్తూ, మనందరం సామాన్య జీవితం గడపాల్సిన పరిస్థితి ఉంది. కోవిడ్‌ను  సమూలంగా తీసేయాలి అంటే, వాక్యినేషన్‌ ఒక్కటే అని అందరికీ తెలుసు. కానీ మన దేశంలో వ్యాక్సినేషన్‌ పరిస్థితి ఏమిటన్నది కూడా అందరికీ తెలుసు’.


*వ్యాక్సిన్లు–వాస్తవ పరిస్థితి*:

‘దేశంలో 45 ఏళ్ల పైబడిన వారు దాదాపు 26 కోట్లు ఉంటే, వారికి రెండు డోస్‌ల చొప్పున మొత్తం 52 కోట్ల డోస్‌లు ఇవ్వాలి. అదే విధంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వారు 60 కోట్లు ఉన్నారు. వారికి 120 కోట్ల డోస్‌లు కావాలి. ఆ విధంగా అందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలంటే మొత్తం 172 కోట్ల డోస్‌లు కావాలి. కానీ ఇప్పటి వరకు కేవలం దాదాపు 18 కోట్లు మాత్రమే వ్యాక్సిన్‌ ఇచ్చారు. అంటే దాదాపు 10 శాతం మాత్రమే ఇవ్వగలిగాం’.

‘ఇక రాష్ట్రంలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లతో సహా 45 ఏళ్లకు పైబడిన వారు దాదాపు 1.48 కోట్లు ఉన్నారు. వారందరికీ దాదాపు 3 కోట్ల డోస్‌లు కావాలి. అదే విధంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వారు మరో 2 కోట్లు. వారికి రెండు డోస్‌ల చొప్పున 4 కోట్లు డోస్‌లు కావాలి. ఆ విధంగా అందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలంటే దాదాపు 7 కోట్ల వ్యాక్సీన్లు కావాల్సి ఉండగా, అక్షరాలా మనకు కేంద్రం సరఫరా చేసింది కేవలం 73 లక్షలు మాత్రమే. అంటే 10 శాతం కూడా మించని పరిస్థితి’.


*అందుకు కారణం?:*

‘దేశంలో ఈ పరిస్థితి ఇలా ఎందుకు ఉంది అనంటే, దేశంలో కేవలం రెండు కంపెనీలు భారత్‌ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్‌ మాత్రమే వ్యాక్సీన్లు తయారు చేస్తున్నాయి. భారత్‌ బయోటెక్‌ నెలకు కోటి, సీరమ్‌ సంస్థ 6 కోట్లు.. రెండూ కలిపి నెలకు 7 కోట్ల వ్యాక్సీన్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి’.

‘కాబట్టి కోవిడ్‌తో సహజీవనం తప్పని పరిస్థితి. ఒకవైపు కోవిడ్‌తో యుద్ధం చేస్తూ, మరోవైపు దాంతో సహజీవనం తప్పదు. మనకున్న పరిస్థితిలో మనం వేస్తున్న అడుగులు అందరూ గమనించాలి’.


*అవి జీవితంలో భాగం కావాలి*:

‘కాబట్టి అందరికీ ఒకటే విజ్ఞప్తి. ఒకవైపు చేయాల్సిన పనులు చేస్తూ పోయి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్‌లు ధరించాలి. చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. భౌతిక దూరం పాటించాలి. ఇవన్నీ మన జీవితంలో భాగం కావాలి. ఆ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, రైతులు తమ పని చేసుకుపోవాలి’.


*చివరగా..*

‘ప్రభుత్వానికి ఎన్ని కష్టాలు ఉన్నా, రైతులు ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో నాలుగు అడుగులు ముందుకు వేసి, ఇవాళ రైతు భరోసా వరసగా మూడో ఏడాది అమలు చేస్తున్నాము. దీంతో రైతన్నలకు మంచి జరగాలని ఆశిస్తూ, దేవుడి దయతో మీ బిడ్డ ఇంకా మంచి కార్యక్రమాలు చేసే అవకాశం కల్పించాలని కోరుతూ, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం’.. అంటూ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ తన ప్రసంగం ముగించారు. ఆ తర్వాత కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి, రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు.


*అసాధ్యాన్ని సీఎం గారు సాధ్యం చేసి చూపారు: కె.కన్నబాబు. వ్యవసాయ శాఖ మంత్రి*.

– ‘ కొన్ని విన్నప్పుడు అవి సాధ్యమవుతాయా? అనిపిస్తుంది. కానీ సీఎం శ్రీ వైయస్‌ జగన్, అలా సా«ధ్యం చేసి చూపారు. గత ముఖ్యమంత్రి రైతు రుణాలు మాఫీ చేస్తానని మాట తప్పారు. కానీ మీరు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నారు. ఎవరైనా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాలని చూస్తారు. కానీ మీరు మాత్రం ఆ సంఖ్య క్రమంగా పెంచుతూ పోతున్నారు. సొంతంగా సాగు చేసుకుంటున్న రైతులతో పాటు, కౌలు రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు పొందిన, ఆలయాల భూములను కౌలుకు సాగు చేసుకుంటున్న రైతులు ఇంకా రాష్ట్రంలో భూములు సాగు చేస్తున్న  యానాం రైతులకు కూడా పెట్టుబడి సాయం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ రైతులకు ఆదుకుంటూ చరిత్ర సృష్టించారు. ఈ స్థాయిలో రైతులకు మీరు అండగా నిలుస్తున్నందుకు మీకు రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’.


వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ బాలశౌరి, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, వ్యవసాయ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్, మార్కెటింగ్‌ కమిషనర్‌ పీఎస్‌ ప్రద్యుమ్న, మత్స్యశాఖ కమిషనర్‌ కన్నబాబు, వ్యవసాయ సలహాదారు అంబటి కృష్ణారెడ్డితో పాటు, పలువురు అధికారులు కార్యక్రమానికి హాజరు కాగా, జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరయ్యారు.

Comments