నేడు(13.5.2021)
వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పంపిణీ...
• రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు
• ఆన్ లైన్ ద్వారా బటన్ నొక్కి ఆర్థిక సాయం అందజేయనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి
• రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ
• 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత ఆర్థిక సాయం
• 52.38 లక్షల మంది రైతులకు రూ.3,900 కోట్లు : మంత్రి కన్నబాబు
అమరావతి, మే 12 (ప్రజా అమరావతి): 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం కింద మొదట విడతగా రూ.3,900 కోట్ల ఆర్థిక సాయాన్ని రైతులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం(13.5.2021) అందజేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. 52.38 లక్షల మంది రైతులకు లబ్ధి కలుగనుందన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని)తో కలిసి మాట్లాడారు. రైతుల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. 2019-20 సంవత్సరం లో 46. 69 లక్షల రైతు కుటుంబాలకు రూ. 6,173 కోట్లు, 2020-21 సంవత్సరం లో 51.59 లక్షల మందికి రూ. 6,928 కోట్లు అందజేశామన్నారు. ప్రస్తుత ఏడాది 52.38 లక్షల మంది రైతులకు మొదటి విడతగా రూ.3,900 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నామన్నారు. గురువారం ఉదయం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆన్ లైన్ లో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో రైతు భరోసా ఆర్థిక సాయాన్ని జమ చేస్తారన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా... ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ఎన్నికల ముందు రూ.12 వేలు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, రైతుల కష్టాలను గుర్తించి రూ.13,500లు అందజేస్తున్నారని మంత్రి తెలిపారు. ఏపీలో సాగుచేసే యానాం రైతులకు, కౌలు రైతులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని మంత్రి తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక పాదర్శకతతో జరిగిందన్నారు. లబ్ధిదారుల జాబితా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శనకు పెట్టామన్నారు. అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవొచ్చునని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.
addComments
Post a Comment