కోవిడ్ కట్టడికి పకడ్బందీగా చర్యలు చేపడుతున్నాం'
*డీఆర్సీ సమావేశంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు*
అనంతపురము, మే 13 (ప్రజా అమరావతి)!
డీఆర్సీ కన్వీనర్ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హాస్పిటల్, అంబులెన్స్, టెలీ మెడిసిన్, మెటీరియల్ మేనేజ్ మెంట్ వంటి విభాగాలకు నోడల్ ఆఫీసర్లను నియమించడం జరిగిందన్నారు. ఏక సభ్య ఆక్సిజన్ మానిటరింగ్ సెల్ ను పునర్వ్యవస్థీకరించి జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఉన్నతాధికారులను నియమించి ఆక్సిజన్ సరఫరా, వినియోగాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామన్నారు. ఈ చర్యలతో రాష్ట్రంలోనే అత్యల్ప ఆక్సిజన్ వృథా అవుతున్న జిల్లాగా అనంత నిలిచిందన్నారు.
ఇప్పటి వరకూ జిల్లాలో 14 లక్షల 30 వేల కోవిడ్ టెస్టులు నిర్వహించమన్నారు. ఈ సంఖ్య దాదాపు జిల్లాలో మూడో వంతు జనాభాకు సమానమన్నారు. మార్చి 29 నుంచి నేటి వరకూ 1,02,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. వీరిలో 88వేల మంది కోలుకున్నారని, 14,500 యాక్టివ్ కేసులున్నాయని, 10 వేల మంది హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని, 700 మంది కోవిడ్ కేర్ సెంటర్లలో మిగిలిన 1730 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు.
కేసులు అధికంగా ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాలు ఎక్కువగా ఉన్న జిల్లాలతో సమానంగా కోవిడ్ ను కట్టడి చేయగలగుతున్నామన్నారు. కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే ప్రభుత్వ సహకారంతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుని అందుకు అనుగుణంగా సిబ్బందిని గణనీయంగా పెంచామన్నారు.
ప్రభుత్వం మరియు ఇంచార్జ్ మంత్రి సహకారంతో జిల్లాలో 40 వేల లీటర్ల సామర్థ్యం గల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మించుకోగలిగామన్నారు. ఆక్సిజన్ సప్లైలో ఇబ్బందులు రాకుండా గ్రీన్ ఛానెల్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆక్సిజన్ వృథాను అరికట్టేందుకువైద్య సిబ్బందికి అదనంగా సిబ్బందిని నియమించామన్నారు.
అనంతపురం, హిందూపూర్, గుంతకల్లు, కదిరి ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసిందని, హిందూపురంలో మాత్రమే పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన ప్రాంతాల్లో పనులు ప్రారంభించేందుకు కేంద్రం నుంచి అనుమతులు తెప్పించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో పలువురు ఉన్నతాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆయా పోస్టులు త్వరితగతిన భర్తీ చేయాలని కోరారు. బయో మెడికల్ ఇంజినీర్ల కొరత కూడా ఉందని వారి నియామకాలను రాష్ట్ర స్థాయిలో చేపట్టి జిల్లాకు కేటాయించాలన్నారు. ఆక్సిజన్ కాంసెంట్రేటర్లను అదనంగా సరఫరా చేయాలని కోరారు.
సమావేశంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ కలెక్టర్, జీఎం ఇండస్ట్రీస్ ,జిల్లా కలెక్టర్ చొరవతో మూతపడిన వేదిక్ ఇస్పాత్ ప్లాంటులో ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. అక్కడ ఉత్పత్తి అవుతున్న ఆక్సిజన్ ను పూర్తిగా జిల్లాలోనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 4660 బెడ్లలో 30 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉందని, కోవిడ్ నిర్ధారణ కాబడిన ప్రతి ఒక్కరూ ఆక్సిజన్ పడకలు కావాలంటున్నారన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందుబాటులో ఉంచాలన్నారు. అతి తక్కువ ఖర్చుతో మాడ్యులర్ ఆక్సిజన్ సిస్టం ఏర్పాటు చేసే అంశం పరిశీలించాలన్నారు. రామగిరి మండల కేంద్రంలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారన్నారు.
ఎమ్మెల్సీ శమంతక మణి జూమ్ కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడుతూ కరోనా సమయంలో ఆక్సిజన్ పడకల అవసరం చాలా ఉందన్నారు. అధికారులు ఆక్సిజన్ నిల్వలపై నిరంతరం సమీక్షించి ఆక్సిజన్ కొరత రాకుండా చూడాలన్నారు. ఫంక్షన్ హాళ్లను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాలన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజు నియంత్రణ చేయాలన్నారు.
మడకశిర ఎమ్మెల్యే డా.తిప్పేస్వామి మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ మేనేజ్ మెంట్ పై ప్రశంశలు కురిపించారు. ఆస్పత్రుల నిర్వహణ అద్భుతంగా ఉందన్నారు. అయితే పాజిటివ్ వచ్చిన బాధితుల్లో విపరీత భయం కారణంగా ఆక్సిజన్ బెడ్ల కోసం ఒత్తిడి పెరిగిందన్నారు. మడకశిర నియోజక వర్గంలో కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలన్నారు.
జిల్లాకు రేమిడిసివిర్ ఇంజెక్షన్లను అధికంగా కేటాయించాలని గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామి రెడ్డి కోరారు.
ఆక్సిజన్ నిర్వహణపై ఆక్సిజన్ మానిటరింగ్ సెల్ చైర్మన్ జేసీ నిశాంత్ కుమార్ మంత్రికి వివరించారు.
కోవిడ్ కేర్ సెంటర్లు, టెస్టింగ్, హోమ్ ఐసోలేషన్, హాస్పిటల్ మేనేజ్ మెంట్, 104 కాల్ సెంటర్, ఫీవర్ సర్వే-వ్యాక్సినేషన్, ఆరోగ్యశ్రీ, ఆక్సిజన్ ఉత్పత్తి, తదితరు అంశాలపై తీసుకుంటున్న చర్యలను నోడల్ అధికారులు మంత్రికి వివరించారు.
addComments
Post a Comment