విదేశీ వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు.

 విదేశీ వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు.


..

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్

అమరావతి, మే 13 (ప్రజా అమరావతి) : విదేశీ వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు పిలిచినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కరోనా నివారణలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను పలు రాష్ట్రాలు అవలంభిస్తున్నాయని ఆయన తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడచిన 24 గంటల్లో 96,446 కరోనా టెస్టులు చేయగా, 22,399 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 89 మృతి చెందారని తెలిపారు. రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో 7,618 ఐసీయూ బెడ్లు ఉండగా, 7,089 రోగులతో నిండిపోయాయన్నారు. 22.069 ఆక్సిజన్ బెడ్లకు 20,962 కరోనా బాధితులతో నిండిపోయాయన్నరు. కొవిడ్ కేర్ సెంటర్లలో 16,119 మంది చికిత్స పొందుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం...ఏపీకి 599 టన్నుల ఆక్సిజన్ కేటాయించిందన్నారు. అందులో తొమ్మిది టన్నులు అదనంగా ఉన్నాయన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు పొందిన ప్రైవేటు ఆసుపత్రులకు 16,724 రెమిడెసివిర్ ఇంజక్షన్లను రాష్ట్ర ప్రభుత్వం సప్లయ్ చేసిందన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో 21,157 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 104 కాల్ సెంటర్ కు 15,105 ఫోన్ కాల్స్ రాగా, వాటిలో వివిధ సమాచారాల కోసం 6 వేల ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. ఆసుపత్రుల్లో అడ్మిషన్లకు 3,259, కరోనా టెస్టుల కోసం 3,069, టెస్టు రిజల్ట్ కోసం 2,152 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. 

విదేశీ వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లకు పిలుపు...

వివిధ దేశాల నుంచి వ్యాక్సిన్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లకు పిలిచిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.  మూడు వారాలు గడువు ఇచ్చారని, వచ్చే నెల(జూన్) 3వ తేదీలోగా బిడ్లు ఫైల్ చేయాలని అన్నారు. ఈ నెల 20, 22 తేదీల్లో ప్రీ బిడ్ సమావేశం ఉండే అవకాశముందన్నారు. మిగిలిన రాష్ట్రాల కంటే ముందుగా ఏపీ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు వెళ్లడం వల్ల మంచి స్పందన రావొచ్చని భావిస్తున్నామన్నారు. 

ఏపీలో బాటలో పలు రాష్ట్రాలు...

కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు దేశం మిగిలిన రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయన్నారు. వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు పిలవడం, ఏపీలో వ్యాక్సిన్ ఉత్పత్తికి కావాల్సిన అనుమతులు ఇస్తామనడం, 45 ఏళ్లు పైబడిన వారికి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వేసిన తరవాత 18 నుంచి 45 లోపు వారికి టీకాలు వేస్తామని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరడం...ఇలా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను పలు రాష్ట్రాలు కూడా అమలు చేయడానికి ముందుకొస్తున్నాయన్నారు. 

మరింత మందికి ఆరోగ్య శ్రీ సేవలు..

రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు పొంది ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులందరికీ ఆరోగ్య శ్రీ పథకం వర్తింపజేసే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఆరోగ్య శ్రీ కింద నగదు రహిత చికిత్సలు అందజేస్తున్నామన్నారు. ఆరోగ్య  శ్రీ కింద సేవలందిచే ప్రైవేటు ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వమే పీజులు చెల్లిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో 39,749 బెడ్లు ఉండగా, 26,030 మంది ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు పొందుతున్నారన్నారు. 65 శాతం మంది ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలు పొందుతున్నారన్నారు. రాబోయే వారం రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు. మరింత మందికి ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

అధిక సంఖ్యలో వైద్య సిబ్బంది నియామకం...

గతేడాది కంటే ఈ ఏడాది కొవిడ్ నివారణ కోసం అధికంగా వైద్య సిబ్బందిని నియమించుకున్నామన్నారు. గతేడాది జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లను 2,524 మంది నియమించగా, ఈ ఏడాది 3,025 మందిని తీసుకున్నామన్నారు. స్టాఫ్ నర్సులను గతేడాది 5,225 మందిని నియమించగా, ఈ ఏడాది 5,493 మందిని రిక్రూట్ చేసుకున్నామని తెలిపారు. స్వీపర్లను 2,179 మంది గతేడాది తీసుకోగా, ఈ ఏడాది 2,472 మందిని నియమించామన్నారు. గతేడాది కంటే అదనంగా 600 మందిని నియమించామన్నారు. అవసరమైతే మరో 25 శాతం అదనంగా తీసుకోవాలని చెప్పాని, ఇంకా చాలకపోతే మరింత మంది వైద్య సిబ్బందిని నియమించుకోవాలని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశామన్నారు.

కొవిడ్ సేవలకు వైద్య విద్యార్థులు...

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వైద్య విద్యార్థలును కూడా కొవిడ్ సేవలకు వినియోగించుకుంటున్నామని ఆయన తెలిపారు. 1,143 మంది పీజీ విద్యార్థులను, 1,294 మంద హౌస్ సర్జన్లను, 954 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను, 638 మంది డెంటల్ విద్యార్థులను గుర్తించామన్నారు. ఇప్పటికే వారందరికీ సమాచారమందించామన్నారు. మరో రెండు మూడు రోజుల్లో వారంతా విధుల్లోకి చేరే అవకాశముందన్నారు. 

జర్మన్ హ్యాంగర్లతో అదనపు బెడ్ల ఏర్పాటు...

రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్ల సామర్థ్యం నిండినచోట జర్మన్ హ్యాంగర్లతో బెడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇప్పటికే 38 లోకేషన్లకు గానూ 6 లోకేషన్లలో బెడ్లు ఏర్పాటు చేశారన్నారు. మిగిలిన చోట్ల మరికొద్ది రోజుల్లో బెడ్లు ఏర్పాటు చేయనున్నారన్నారు.  వ్యాక్సినేషన్ జరుగుతున్న టీకా కేంద్రాల్లో షామియానాలు, కుర్చీలు, తాగునీరు సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల నుంచి టీకా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై ఫొటోలు సైతం వచ్చాయన్నారు. ఏ చిన్న సమస్య తమ దృష్టికి వచ్చినా తక్షణమే పరిష్కారం చూపుతున్నామన్నారు.