విజయవాడ (ప్రజా అమరావతి);
ట్రైఏజ్ కేంద్రాన్నీ మరింత విస్తరిస్తున్నాం....
*సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో త్వరలో అందుబాటులోకి
* కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్
విజయవాడ నగరంలోని ట్రైఏజ్ కేంద్రాన్ని విస్తరించి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో మరో రెండు రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ తెలిపారు.
స్థానిక కొత్త గవర్నమెంట్ ఆసుపత్రి ప్రాంగణంలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఆదివారం ట్రైఏజ్ కేంద్రం ఏర్పాటు పనులను, వెన్యూ కన్వెన్షన్ కేంద్రాన్ని కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్టీఆర్ డెంటల్ కాలేజ్ ప్రాంగణంలో ట్రైఏజ్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నామని , ప్రజల సౌకర్యార్థం ఆ ట్రైఏజ్ కేంద్రాన్ని విస్తరించి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కేంద్రం ద్వారా కరోనా బాధితులకు సంరక్షణ కల్పించేందుకు ప్రాధాన్యతనిస్తూ డాక్టర్లు తగిన సూచనలు ఇస్తారన్నారు. కరోనా లక్షణాలతో బాధపడేవారు ఈ కేంద్రం ద్వారా తగిన మార్గదర్శకాలను పొందాలన్నారు. ట్రైఏజ్ కేంద్రంలోని వైద్యులు రోగి ఆరోగ్య స్థితిని అంచనా వేసి తగిన సూచనలు చేస్తారని తెలిపారు. వారికి వైద్య సేవలు ఆసుపత్రిలోనా లేదా హోం ఐసోలేషన్లోనా లేదా కోవిడ్ కేర్ సెంటర్లోనా అనేది నిర్ణయిస్తారని చెప్పారు. ఈ కేంద్రంలో 30 బెడ్లను ఏర్పాటు చేసి తక్షణ వైద్య సహయం అందించడంతో పాటు మెరుగైన చికిత్సకు సిఫార్సు చేస్తున్నామని పేర్కొన్నారు. కరోనాను జయించడం మన చేతుల్లోనే ఉందని ముఖ్యంగా మానసిక స్థైర్యంతో కరోనా నుంచి బయట పడగలమన్నారు. ప్రతి ఒక్కరూ ఆసుపత్రిలోని వైద్యం కోసమే చూస్తున్నారని, అయితే కోవిడ్ కేర్ సెంటర్ల ద్వారా డాక్టర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో వైద్య సహాయం అందిస్తున్నామన్నారు. కృష్ణా జిల్లాలోని గూడవల్లి, జేఎన్ఎన్యుఆర్ఎం, ఏడిఎంటిల్ కేంద్రాలలో 3036 కోవిడ్ బెడ్లను అందుబాటులో ఉంచామని కలెక్టర్ తెలిపారు. కోవిడ్ లక్షణాలు కలిగి ఉండి హోం ఐసోలేషన్లో అవకాశం లేనివారికి ఈ కేంద్రాలలో బెడ్లు కేటాయిస్తామన్నారు. ఈ కేంద్రాల ద్వారా పౌష్టికాహారంతో పాటు మందులు కూడా ఉచితంగా అందిస్తున్నామని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు.
గవర్నమెంట్ ఆసుపత్రులలో ఎక్కువ మంది మెరుగైన వైద్య చికిత్స కోసం వస్తున్నారని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఈ దృష్ట్యా గవర్నమెంట్ ఆసుపత్రి కి అనుసంధానం గా సమీపంలోని వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో 100 ఆక్సిజన్ బెడ్ల ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామన్నారు. వ్యాక్సిన్ ను సాధారణ ప్రజల కేటగిరిలో 45 సంవత్సరాలు నిండిన వారిలో ఇప్పటి వరకు 3.66 లక్షల మందికి తొలి డోసు వ్యాక్సిన్ వేశామని , వీరిలో లక్షా 11 వేల మందికి పైగా రెండో డోసు పూర్తి చేసుకున్నారని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా నియంత్రణకు ప్రతిఒక్కరూ మాస్క్లు ధరించి భౌతిక దూరం పాటించాలని లేకపోతే వీరే వైరస్ వాహకులుగా తయారయ్యే ప్రమాదం ఉందన్నారు. హోం ఐసోలేషన్లో ఉండే వారికోసం 25 వేల హోం ఐసోలేషన్ మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచామని, వీటిలో నిన్నటి వరకు 18,500 పంపిణీ చేశామన్నారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్.శివశంకర్, సబ్ కలెక్టర్ హెచ్.ఎం. ధ్యానచంద్, జిజిహెచ్ పర్యవేక్షకులు డాక్టర్ కె.శివశంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment