రూ. 10 కోట్లతో నిర్మించే రహదారులకు శంకుస్థాపన

 *రూ. 10 కోట్లతో నిర్మించే రహదారులకు శంకుస్థాపన


*

*-ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేతుల మీదుగా కార్యక్రమం*

*-ఈ రెండు మార్గాల అభివృద్ధితో సులభం కానున్న ప్రయాణం*

*-ఎంపీ, ఎమ్మెల్యే కృషితో ఈ రెండు మార్గాల అభివృద్ధికి నిధులు కేటాయింపులు*

వినుకొండ (ప్రజా అమరావతి); మండలంలో సుమారు రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న తారు రోడ్లకు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, వినుకొండ శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు శంకుస్థాపన చేశారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ఫేస్ - 3 కింద నిధులు కేటాయింపులు జరిగాయి, ఇందుకు ఎంపీ, ఎమ్మెల్యే కృషి ఎంతో ఉంది. వినుకొండ మండలంలోని.. నాగులవరం, అందుగుల కొత్త పాలెం గ్రామాల వద్ద శిలాఫలకాలను ఎంపీ, ఎమ్మెల్యే ఆవిష్కరించారు. చింతల చెరువు నుండి లింగముక్కపల్లి మీదుగా అందుగుల కొత్త పాలెం వరకు మరియు పువ్వాడ నుండి కొత్త గోకనకొండ, పాత గోకనకొండ, నాగులవరం మీదుగా కుందూరు వరకు తారు రోడ్డు, బ్రిడ్జి నిర్మాణం జరగనుంది. ఈ రెండు మార్గాల పనులు త్వరగా పట్టాలెక్కించేందుకు కృషి చేస్తామని ఎంపీ, ఎమ్మెల్యే తెలిపారు. అలాగే వినుకొండ నుండి గుంటూరు వెళ్ళే రహదారి విస్తరణ జరిగేలా చూస్తామని తెలిపారు. ఒక ప్రాంతం అభివృద్ధిలో రోడ్ల పాత్ర ఎంతో ఉంటుందని అన్నారు. రోడ్లు బాగుంటే రైతులు వారి ఉత్పత్తులు రవాణా చేసుకునేందుకు, సకాలంలో వైద్యం పొందేందుకు వీలు కల్గుతుందని అన్నారు. ఈ రెండు మార్గాలతో పాటుగా అధ్వానంగా ఉన్న రోడ్లను వివిధ పథకాల ద్వారా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వినుకొండ మాజీ శాసన సభ్యులు మక్కేన మల్లిఖార్జున రావు, వినుకొండ మున్సిపాలిటీ చైర పర్సన్ దస్తగిరి, తదితర ముఖ్యనేతలు, అధికారులు పాల్గొన్నారు.