కోవిడ్ కేంద్రంలో కరోనా నుండి కోలుకుని 123 మంది డిశ్చార్జ్
- డివిజన్లో సెకండ్ వేవ్ లో 1,896 కరోనా కేసులు
- ఇప్పటి వరకు 52 వేల మందికి వ్యాక్సినేషన్ చేశాం
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, జూన్ 4 (ప్రజా అమరావతి): గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో గత నెల మే 1 వ తేదీన 25 ఆక్సిజన్ బెడ్లు, మరో 25 నాన్ ఆక్సిజన్ బెడ్ లతో ఏర్పాటు చేసిన కోవిడ్ కేంద్రంలో ఇప్పటి వరకు కరోనా నుండి 123 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, మరో 10 మంది ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జ్ కానున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కోవిడ్ కేంద్రంలో కరోనా సోకిన వారికి అందుతున్న సేవలపై ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ఇందిరాదేవితో మాట్లాడారు. రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ కోవిడ్ కేంద్రంలో దాతల సహకారంతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల ద్వారా వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఆక్సిజన్ కొరత, సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా తనవంతుగా 50 ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచానని చెప్పారు. గుడివాడ కోవిడ్ కేంద్రంలో దాదాపు 90 శాతం రికవరీ ఉందని, ఇక్కడ మెరుగైన వైద్యం అందించడం వల్లే సాధ్యమైందన్నారు. ప్రస్తుతం కోవిడ్ సోకిన అత్యవసర కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. మరణాల రేటును కూడా గణనీయంగా తగ్గిస్తున్నట్టు తెలిపారు. కాగా గుడివాడ డివిజన్ లో 12 కేంద్రాల్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు. సాధారణ లక్షణాలు ఉన్నవారిని హెం ఐసోలేషన్లో ఉంచుతూ వారికి అవసరమైన మెడికల్ కిట్లను, వైద్య సలహాలను అందజేస్తున్నామన్నారు. అలాగే డివిజన్లో 24 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు 52 వేల మందికి వ్యాక్సినేషన్ చేశామని వివరించారు. కరోనా సెకండ్ వేవ్ గత ఏప్రిల్ నెల్లో ప్రారంభమైందని, డివిజన్ లో ఇప్పటి వరకు 1,896 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపారు. శుక్రవారం ఒక్క రోజే గుడివాడ డివిజన్‌లోని పామర్రు మండలంలో 5, ముదినేపల్లి మండలంలో 9, నందివాడ మండలంలో 5, గుడివాడ మండలంలో 14, కలిదిండి మండలంలో 14, కైకలూరు మండలంలో 8, గుడ్లవల్లేరు మండలంలో 6, పెదపారుపూడి మండంలో 8 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఈ నెల 10 వ తేదీ వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ సీఎం జగన్మోహనరెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గుడివాడ డివిజన్ లో కర్ఫ్యూను పటిష్ఠంగా అమలయ్యేలా చూస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని తెలిపారు. గత నెల 16 న 25.56 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతం13 శాతానికి తగ్గిందని చెప్పారు. యాక్టివ్ కేసులు కూడా 2.11 లక్షల నుండి ప్రస్తుతం 1.43 లక్షలకు చేరాయన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి కోవిడ్ -19 నివారణ, వ్యాక్సినేషన్ పై ఎప్పటికపుడు సమీక్షా సమావేశాలను నిర్వహించడంతో పాటు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవడం వల్ల రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయని మంత్రి కొడాలి నాని అభిప్రాయపడ్డారు.
addComments
Post a Comment