- గుడివాడ పట్టణంలో 16 వేల మంది పేదల సొంతింటి కలను నెరవేర్చుతున్నాం
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
- మంత్రి పేర్ని నానితో కలిసి లేఅవుట్ పరిశీలన
గుడివాడ, జూన్ 3 (ప్రజా అమరావతి)
: గుడివాడ పట్టణంలో దాదాపు 16 వేల మంది పేదప్రజల సొంతింటి కలను నెరవేర్చుతున్నామని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. గురువారం గుడివాడ రూరల్ మండలం మల్లాయిపాలెం పరిధిలోని వైఎస్సార్ జగనన్న కాలనీ లేఅవుట్ ను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలతతో కలిసి మంత్రి కొడాలి నాని పరిశీలించారు. లెవలింగ్ పనులు పూర్తిస్థాయిలో నిర్వహించడం పట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవీలత సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ 2008 లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి గుడివాడ పట్టణంలోని పేదల కోసం 77 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇచ్చారని తెలిపారు. ఈ భూమిలో 8,912 టిడ్కో ఇళ్ళను నిర్మిస్తున్నామని చెప్పారు. అలాగే జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు విడతలుగా గుడివాడ పట్టణంలోని పేదల కోసం 181 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. దాదాపు 16 వేల మంది పేదలకు ఈ భూములను కేటాయించడం జరుగుతోందన్నారు. గుడివాడ నియోజకవర్గంలో దివంగత వైఎస్సార్, సీఎం జగన్మోహనరెడ్డిల హయాంలో 450 ఎకరాల భూములను పేదలకు కేటాయించారని మంత్రి కొడాలి నాని తెలిపారు.
addComments
Post a Comment