రాష్ట్రంలో 181 మందికి సీఐలుగా ఒకేసారి పదోన్నతి కల్పించిన ప్రభుత్వం

 


- రాష్ట్రంలో 181 మందికి సీఐలుగా ఒకేసారి పదోన్నతి కల్పించిన ప్రభుత్వం 

- డిజిటలైజేషన్ దిశగా పోలీస్ శాఖ అడుగులు 

- సకాలంలో పదోన్నతులతో రూపుదిద్దుకోనున్న వ్యవస్థ 

- సీఐగా పదోన్నతి పొందిన రామకృష్ణకు అభినందనలు 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, జూన్ 1 (ప్రజా అమరావతి)


: రాష్ట్రంలో పనిచేస్తున్న 181 మందికి ఎస్ఐలకు సీఐలుగా ఒకేసారి ప్రభుత్వం పదోన్నతి కల్పించిందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని సీఐగా పదోన్నతి పొందిన గుడివాడ పట్టణ ట్రాఫిక్ ఎస్ఎ ఏవీఎస్ రామకృష్ణ కలిశారు. ఈ సందర్భంగా సీఐగా పదోన్నతి పొందిన రామకృష్ణను మంత్రి కొడాలి నాని అభినందించారు. దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. గుడివాడ పట్టణంలో ట్రాఫిక్ ఎస్ఏగా రామకృష్ణ సమర్ధవంతంగా విధులను నిర్వహిస్తున్నారని కొనియాడారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ పోలీస్ శాఖ 24 గంటలూ పనిచేస్తోందని, రూల్ ఆఫ్ లాను పకడ్బందీగా అమలు చేస్తూ ప్రజల ధన, మాన ప్రాణాలకు భరోసా కల్పిస్తోందన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి పోలీసుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ వస్తున్నారని చెప్పారు. ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు పోలీస్ శాఖలో సంస్కరణలను తీసుకువచ్చారన్నారు. పోలీస్ శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం, సత్వర స్పందన, బాధ్యతాయుతమైన సేవలే ఈ సంస్కరణల లక్ష్యమని చెప్పారు. సకాలంలో పదోన్నతులు లభించక కానిస్టేబుల్ నుండి ఎస్పీ స్థాయి అధికారి వరకు అసంతృప్తిలో ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. డీజీపీ, ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో ప్రభుత్వం కమిటీని కూడా ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ కమిటీ పలుమార్లు సమావేశమై రాష్ట్రంలోని నాలుగు రేంజ్ లో 181 సీఐ పోస్టులను ప్రమోషన్ల ద్వారా ఏక కాలంలో భర్తీ చేయాలన్న ఆదేశాలను జారీ చేసిందన్నారు. దీంతో సీనియార్టీ పరమైన సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి 18 దిశా పోలీస్ స్టేషన్లలో డీఎస్పీ, ఇతర పోస్టర్లను మంజూరు చేశారని, అలాగే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో కూడా అదనపు పోస్టులను మంజూరు చేయడం వల్ల అనేక మంది త్వరితగతిన ప్రమోషన్లు పొందగలిగారన్నారు. టెక్నాలజీ పరంగా పోలీస్ శాఖ దేశంలోనే ముందు వరుసలో ఉందని చెప్పారు. రెండేళ్ళ కిందట పోలీస్ శాఖలో ప్రారంభమైన సంస్కరణలు ఇప్పుడిప్పుడే మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. డిజిటలైజేషన్ దిశగా పోలీస్ శాఖ అడుగులు వేస్తోందని అన్నారు. ఇకపై అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సకాలంలో పదోన్నతులు పొందేలా పోలీస్ శాఖలో పరిపాలనా వ్యవస్థ రూపుదిద్దుకోనుందని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి తదితరులు పాల్గొన్నారు.