కాకినాడ, జూన్ 02 (ప్రజా అమరావతి);
కోవిడ్-19 రూపంలో మనం ఓ పెద్ద విపత్తును ఎదుర్కొంటున్నామని,
ఈ సవాలు ఎదురైన తొలిరోజుల నుంచి జిల్లాలో అనేక ఎన్‌జీవోలు, ఇతర సంస్థలు ప్రజలకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమైనవని, ఈ సేవలను మరింత విస్తరిస్తూ పాజిటివిటీ ఎక్కువగా ఉన్న గ్రామాలు, గ్రామీణ ఐసోలేషన్ కేంద్రాలు, పీహెచ్‌సీలను దత్తత తీసుకోవాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జి.రాజకుమారి, ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్.. కోవిడ్ సేవల్లో కీలకంగా వ్యవహరిస్తున్న వివిధ ఎన్‌జీవో, సేవా సంస్థల ప్రతినిధులతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యధిక జనాభా ఉన్న జిల్లాలో ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు వ్యక్తిగతంగానూ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, సిలిండర్లు వంటి వాటిని అందించారని తెలిపారు. కొందరు నగదు రూపంలో కోవిడ్ సహాయ నిధికి విరాళాలు అందించి దాతృత్వాన్ని చాటుకున్నారని, విదేశాల నుంచి సైతం వివిధ రూపాల్లో సాయమందుతోందని తెలిపారు. కోవిడ్‌పై విస్తృత అవగాహన, జాగ్రత్తలు పాటించేలా చూడటం, వీలైనంత త్వరగా కోవిడ్ బాధితులను గుర్తించడం, టెలీ వైద్య సేవలు, సైకలాజికల్ సోషియో కౌన్సెలింగ్, బాధితులను సీసీసీలు, ఆసుపత్రులకు చేర్చడం, చికిత్సా విధానంలో సహకారం, రక్తదానం, డెడ్ బాడీ మేనేజ్‌మెంట్ తదితరాల్లో అవసరమైన మండలాలకు సేవలు అందించేందుకు ఎన్‌జీవోలు కృషిచేయాలని కోరారు. జిల్లాస్థాయిలో అపరిష్కృత సమస్యలు, సవాళ్ల పరిష్కారానికి కూడా సహకరించాలన్నారు. ఇప్పటికే గిరిజన ప్రాంతాలతో సహా అనేక ప్రాంతాలకు స్వచ్ఛంద సంస్థల సేవలు అందుతున్నాయని, మిగిలిన, సేవలు అవసరమైన ఇతర ప్రాంతాలకు కూడా కార్యకలాపాలను విస్తరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్న ఎస్‌జీవోలు, సేవా సంస్థల సిబ్బంది, వాలంటీర్లను ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా గుర్తించి, టీకా పంపిణీ చేస్తామని కలెక్టర్ ప్రకటించారు. అందరూ సమన్వయంతో పనిచేస్తూ కోవిడ్ కట్టడికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎన్‌జీవోల ప్రతినిధులు అందించిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని, స్వచ్ఛంద సేవా సంస్థలకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తి సహాయసహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ వెల్లడించారు. కోరుకొండ పీహెచ్‌సీని దత్తత తీసుకున్న వరల్డ్ విజన్ సంస్థ.. ఐసీడీఎస్‌తో కలిసి రూపొందించిన ప్రచార పోస్టర్లను కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి సమావేశంలో ఆవిష్కరించారు.
*యువతకు శిక్షణ: జేసీ(డబ్ల్యూ) జి.రాజకుమారి:*
ప్రజలకు కోవిడ్ జాగ్రత్తలపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటు వ్యాక్సినేషన్ కేంద్రాలు, మార్కెట్ ప్రాంతాలు, మెడికల్ దుకాణాలు తదితర ప్రాంతాల్లో భౌతికదూరం అమలయ్యేలా చూడటం, జనజాగృతి ప్రచార సామగ్రి పంపిణీ చేయడం వంటి కార్యకలాపాల కోసం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యూత్ క్లబ్‌ల సేవలను ఉపయోగించనున్నట్లు జేసీ (డబ్ల్యూ) జి.రాజకుమారి తెలిపారు. అదే విధంగా జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా కోవిడ్ మేనేజ్‌మెంట్‌పై పది, ఇంటర్ ఉత్తీర్ణులైన యువతకు శిక్షణ ఇవ్వనున్నామని, ఈ అంశానికి సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. శారీరక, మానసిక సమస్యలు ఉండి, కోవిడ్ బారినపడిన వారికి ప్రత్యేకంగా కొన్ని ఎన్‌జీవోలు సేవలందిస్తున్నాయని, వారికి అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, డీర్‌డీఏ పీడీ వై.హరిహరనాథ్, నెహ్రూ యువకేంద్ కోఆర్డినేటర్ కీర్తన, జిల్లానైపుణ్యాభివృద్ధి అధికారి హరిశేషు, వివిధ ఎన్‌జీవోలు, సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
addComments
Post a Comment