గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ -19 పీడియాట్రిక్ వార్డును ఏర్పాటు చేస్తున్నాం

 

- గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ -19 పీడియాట్రిక్ వార్డును ఏర్పాటు చేస్తున్నాం 

- వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేశాం 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 



గుడివాడ, జూన్ 14 (ప్రజా అమరావతి)


: గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ -19 పీడియాట్రిక్ వార్డును ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. సోమవారం కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నప్పటికీ అప్రమత్తంగానే ఉండాలని సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశించారని చెప్పారు. పాజిటివిటీ రేటు మరింత తగ్గే వరకు, కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి అదుపులోకి వచ్చే వరకు అలసత్వం వహించేది లేదన్నారు. ముఖ్యంగా కరోనా థర్డ్ వేవ్ పై ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో కోవిడ్ -19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్ పై సీఎం జగన్మోహనరెడ్డి అధికారులతో సమీక్షా సమావేశాలను నిర్వహిస్తూ వస్తున్నారని తెలిపారు. అలాగే కరోనా మూడవ వేవ్ పై కూడా సమీక్ష జరిపారని చెప్పారు. మూడవ వేవ్ వస్తే పిల్లలకు అందించాల్సిన వైద్యం, తలెత్తే పరిణామాలు, ప్రభావితమయ్యే వారి వివరాలను అంచనా వేయాలని సీఎం జగన్మోహనరెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారన్నారు. పిల్లలకు అత్యుత్తమ వైద్యం అందించడానికి పీడియాట్రిక్ వార్డులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. విశాఖపట్నం, కృష్ణా - గుంటూరు ప్రాంతంలో, తిరుపతిలో మూడు అత్యుత్తమ పీడియాట్రిక్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశించారని తెలిపారు. మూడవ వేవ్ లో పిల్లలపై ప్రభావం, తీవ్రతలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. పీడియాట్రిక్ సింప్టమ్స్ ను గుర్తించడానికి ఆశ, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ కూడా ఇస్తారని చెప్పారు. ఇదిలా ఉండగా గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో 20 బెడ్ లతో పీడియాట్రిక్ వార్డు సిద్ధం అవుతోందని, దీనిలో 10 బెడ్లు ఐసీయూకు, మరో 10 బెడ్లను కోవిడ్, సాధారణ వైద్యం అందించేందుకు కేటాయించాలని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ఇందిరాదేవిని ఆదేశించారు. ఈ పీడియాట్రిక్ వార్డులో వార్మర్స్, ఫొటో థెరపి యూనిట్స్, ఆక్సిజన్ సెంట్రల్ పైప్ లైన్ తదితరాలు అందుబాటులో ఉంటాయన్నారు. కరోనా మొదటి వేవ్ లో గుడివాడ డివిజన్లో వైరస్ ప్రభావం అంతగా కన్పించలేదని చెప్పారు. రెండవ వేవ్ లో వైరస్ ఉధృతి కన్పించడంతో గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో 25 ఆక్సిజన్ బెతో కోవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన మెరుగైన వైద్యం అందించడం ద్వారా కోవిడ్ మరణాలను గణనీయంగా తగ్గించగలిగామన్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేశామని చెప్పారు. సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కొడాలి నాని తెలిపారు.

Comments