2021–22 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌

 

*215వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం.*


*ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో 215వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం.*


*2021–22 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌* 


అమరావతి (ప్రజా అమరావతి);




*ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే ..:*


కోవిడ్‌ –19 ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా అనూహ్య పరిస్థితులు తలెత్తాయి, వైరస్‌ ఉద్ధృతిని అడ్డుకోవడానికి కర్ఫ్యూ లాంటి నియంత్రణలు విధించాం. కోవిడ్‌ కారణంగా కర్ఫ్యూ పొడిగించడం వల్ల ఆర్ధికంగాను పెనుభారం పడింది. అయినా రుణాల పంపిణీలో నిర్దేశించుకున్న లక్ష్యాలకన్నా అధికంగానే చేపట్టాం. ప్రాధాన్యత రంగాల్లో 105 శాతం, వ్యవసాయ రంగంలో 114.16 శాతం లక్ష్యాలను చేరుకున్నాం.ఈ వృద్ధిని సాధించడంలో బ్యాంకుల పాత్ర మరువలేనిది. కాని కొన్ని అంశాల్లో బ్యాంకుల సమర్థత పెరగాల్సి ఉంది. అగ్రి ఇన్‌ఫ్రా, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాలు, గృహాలు, విద్య అంశాల్లో పెరగాల్సి ఉంది.


*స్కూళ్లు, ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నాం:*

స్కూళ్లు, ఆస్పత్రులలో నాడు – నేడు కింద పనులు చేపట్టాం. అలాగే వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టిపెట్టాం.

ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం తీసుకు వచ్చాం, సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌కూడా చేశాం. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లు సమాజానికి భారం కాదు. ప్రైవేటు స్కూళ్లతో పోల్చితే పిల్లలు ప్రభుత్వ స్కూళ్లకు తిరిగి వస్తున్నారు. స్కూళ్లలో ఇది ఉద్యమంలా సాగుతోంది. తొలిదశలో 15,650 స్కూళ్లను నాడు నేడు కింద అభివృద్ధి చేశాం.  ఇప్పుడు రెండో దశ కింద నాడు నేడు పనులు చేపట్టి సుమారు 16 వేల స్కూళ్లను బాగు చేస్తున్నాం. స్కూళ్లలో మౌలిక సదుపాయలను గణనీయంగా మెరుగుపర్చుతున్నాం. 


*ఏపీలో మహా నగరాలు లేవు :*

బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ లాంటి టయర్‌ ఒన్‌ నగరాలు మన రాష్ట్రంలో లేవు. అత్యుత్తమ  వైద్యం కోసం ఆ నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి. అందుకనే ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాలను జాతీయ స్ధాయిలో మెరుగుపర్చేందుకు... గ్రామ స్ధాయిలో విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు మొదలుకుని  టీచింగ్‌ ఆస్పత్రుల వరకూ ఆస్పత్రులను అభివృద్ధి చేపట్టాం.

16 కొత్త మెడికల్‌ కాలేజీలను తీసుకు వస్తున్నాం. 

ప్రతి పార్లమెంటులో ఒక టీచింగ్‌ఆస్పత్రి దిశగా వెళ్తున్నాం. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని, వైద్యులను పార్లమెంటు నియోజకవర్గం స్ధాయిలో అందుబాటులో ఉంచబోతున్నాం. 


*వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు*

గ్రామ స్ధాయిలో రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకే)ను తీసుకు వచ్చాం. దాదాపు 10 వేలకు పైగా ఆర్బీకేలను తీసుకువచ్చాం. ప్రతి 2వేల జనాభాకు ఒక ఆర్బీకే పెట్టాం. నాణ్యమైన ధృవీకరించిన విత్తనాల దగ్గరనుంచి, పండించిన పంటను అమ్మేంతవరకూ రైతుకు చేదోడు, వాదోడుగా ఈ ఆర్బీకేలు నిలుస్తాయి. ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయరంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాం. ఆర్బీకేల ద్వారా గ్రామస్ధాయిలో అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగుపర్చేందుకు, గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజీలు సహా అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం. పార్లమెంటు నియోజకవర్గం స్థాయిలో సెకండరీ ఫుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం.


*మహిళా సాధికారిత*

మహిళా సాధికారితకోసం అనేక చర్యలు తీసుకున్నాం. మహిళా సాధికారితపై ప్రధానంగా దృష్టి సారించాం. దీనికోసం  వరుసగా నాలుగు సంవత్సరాలు పాటు చేయూత, ఆసరాల కింద వారిని అదుకుంటున్నాం. లబ్ధిదారులైన మహిళలకు స్థిరంగా నాలుగేళ్లపాటు వారి చేతిలో డబ్బు పెడుతున్నాం. అలాగే మహిళలు వారి పిల్లలను తమతో పాటు పనికి తీసుకెళ్లకుండా, స్కూళ్లకు పంపించేలా స్ఫూర్తి నింపేందుకు తొలిసారిగా అమ్మ ఒడి కింద కూడా వారికి ఏడాదికి డబ్బు ఇస్తున్నాం. ఈ మూడు పథకాలు మహిళా సాధికారితలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.


*17వేలకుపైగా కొత్త కాలనీలను నిర్మిస్తున్నాం :*

కొత్తగా 17 వేల గ్రీన్‌ఫీల్డ్‌ కాలనీలను నిర్మిస్తున్నాం. తద్వారా 28.30 లక్షల ఇళ్లను పేదల కోసం నిర్మించబోతున్నాం. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం సోషల్‌ ఆడిట్‌ నిర్వహించి,గ్రామ సచివాలయాల ద్వారా పారదర్శక పద్ధతిలో ఎంపిక చేశాం. ఈ ఏడాది 15.60 లక్షలకుపైగా ఇళ్లను ఈ 17 వేల కాలనీల్లో తొలివిడతలో నిర్మిస్తున్నాం. వచ్చే ఏడాది కూడా మరో 12.08 ఇళ్లను నిర్మించబోతున్నాం. 


*కాలనీల్లో మౌలిక సదుపాయాలు*

ఈ కాలనీలు మురికివాడలుగా మారకూడదు, అందుకనే మౌలికసదుపాయాలను కల్పిస్తున్నాం. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, ఇతర సోషల్‌ ఇన్‌ఫ్రానుకూడా కల్పిస్తున్నాం. రానున్న మూడేళ్లలో దీనికోసం దాదాపుగా రూ. 34వేల కోట్లు ఖర్చు చేస్తాం. 

ఈ అంశాల్లో బ్యాంకుల సహకారం కావాలి. 28.30 లక్షల ఇళ్ల నిర్మాణం ద్వారా ఈ 17 వేల కాలనీలు అందంగా నిర్మించబోతున్నాం. 


*ఎంఎస్‌ఎంఈ , రీ -స్టార్ట్‌*

ఎంఎస్‌ఎంఈల కోసం రీస్టార్ట్, నవోదయ కార్యక్రమాలతో రుణాల పునర్‌ వ్యవస్థీకరణ కార్యక్రమం చేపట్టాం. కోవిడ్‌సమయంలో కూడా వాటికి చేయూత నిచ్చి నడిపించాల్సిన అవసరం ఉంది.


*కౌలు రైతులకు -రుణసాయం*

అలాగే కౌలు రైతులకు రుణాల సదుపాయంకూడా దృష్టిపెట్టాలని బ్యాంకులను కోరుతున్నాను. కౌలు రైతులను ఆదుకోవాలని కోరుతున్నాను. గ్రామాల స్థాయిలో ఆర్బీకేలు ఉన్నాయి. ఇ– క్రాపింగ్‌ కూడా గ్రామ సచివాలయాల స్థాయిలో చేస్తున్నాం. ప్రతి కార్యక్రమం పారదర్శకంగా చేస్తున్నామని, కౌలు రైతులకు రుణాలపై బ్యాంకులు మరింత దృష్టి పెట్టాలని  సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు. 


*2021–22 వార్షిక రుణ ప్రణాళిక ఇలా:*

– 2021–22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళిక మొత్తం రూ.2,83,380 కోట్లు

–దీంట్లో భాగంగా 54శాతం రుణాలు వ్యవసాయ రంగానికి

వ్యవసాయరంగంలో రూ.1,48,500 కోట్లు ఇవ్వాలని లక్ష్యం

– మొత్తంగా ప్రాథమిక రంగానికి రూ. 2,13,560 కోట్ల రుణాలు ఇవ్వాలని: లక్ష్యం, వార్షిక రుణ ప్రణాళికలో ఇది 75.36శాతం


*–ఎస్‌ఎస్‌బీసీ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న యూనియన్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ రాజ్‌కిరణ్‌రాయ్‌*

– ఏపీకి ఎస్‌ఎల్‌బీసీగా వ్యవహరిస్తున్న యూనియన్‌ బ్యాంక్‌

*రాజ్‌ కిరణ్‌ రాయ్‌ ఏమన్నాంటే...:*

– కోవిడ్‌ విపత్తు సమయంలో ప్రజలకు చేయూత నివ్వడానికి ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అనేక చర్యలు తీసుకున్నారు: రాజ్‌కిరణ్‌ రాయ్‌

–ముఖ్యమంత్రి దార్శినిక పాలనద్వారా  సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలపై 2020 సంవత్సరానికిగాను నీతి ఆయోగ్‌విడుదలచేసిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌ అత్యుత్తమ 5 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది:

– దీనికి ముఖ్యంత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా:

– కోవిడ్‌వల్ల అనేక అడ్డంకులు వచ్చినప్పటికీ ప్రజలను ఆదుకునే సంక్షేమ పథకాలనుంచి ఏపీ పక్కకు వెళ్లకపోవడం గుర్తించదగ్గ విషయం:

– పేదలకోసం జగనన్న కాలనీలపేరిట ఏపీ ప్రభుత్వం లక్షలాది ఇళ్లను నిర్మిస్తోంది. ఇది బ్యాంకులకు మంచి అవకాశం:

– కౌలు రైతులను ఆదుకోవడంపై బ్యాంకులు దృష్టిపెట్టాలి:

– రైతు భరోసా కేంద్రాల్లో సేవలను అందించడంపై బ్యాంకుల బ్రాంచీలు దృష్టిపెట్టాలి:

– ఆత్మనిర్భర్‌ ద్వారా, కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను∙ప్రకటించింది. ఆర్థిక  రంగాన్ని పురోగతిలో నడిపించడానికి, ఆమేరకు లక్ష్యాలను అందుకోవాలని కోరుతున్నా:

– 2020–21లో ప్రాథమిక రంగం లక్ష్యం రూ. 1,87,550 కోట్లు అయితే 105.3 శాతం లక్ష్యం చేరుకున్నాం. రూ. 1,96,982 కోట్లు రుణాలు ఇచ్చాం.

– వ్యసాయరంగం కింద నిర్దేశించుకున్న దాంట్లో  114.16 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాం. రూ. 1,28,660 కోట్ల లక్ష్యానికి గానూ రూ.1,46,879 కోట్లు ఇచ్చాం.


– ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.39,600 కోట్లకుగానూ రూ.40,312 కోట్లు ఇచ్చాం. అనుకున్న లక్ష్యాన్ని దాటి 101.8శాతం ఇచ్చాం. 

– నాన్‌ ప్రయార్టీ రంగం కింద రూ.64.050 కోట్లకుగానూ రూ. 90,652 కోట్లు ఇచ్చాం. 141.53శాతం రుణాలు ఇచ్చాం: 

వ్యాక్సినేషన్‌లో బ్యాంకు సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నా:


ఈ సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, పరిశ్రమలశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవెన్, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్, సాంఘిక సంక్షేమశామ ముఖ్య కార్యదర్శి కె సునీత, ఆర్ధిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్, సెర్ప్‌ సీఈఓ రాజాబాబు, ఎస్‌ఎల్‌బీసీ, ఏపీ, కన్వీనర్‌ వి బ్రహ్మానందరెడ్డి, నాబార్డు సీజీఎం, సుధీర్‌ కుమార్‌ జన్నావర్‌తో పాటు వివిధ బ్యాంకులకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. 


వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఎండీ, సీఈఓ రాజ్‌ కిరణ్‌ రాయ్, ఆర్‌బీఐ, జీఎం, యశోధా భాయి పాల్గొన్నారు.

Comments