కాకినాడ, జూన్ 08 (ప్రజా అమరావతి);
జగనన్న తోడు పథకం ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో రెండోవిడతలో మొత్తం 33,445 మంది లబ్ధిదారులకు రూ.33.45 కోట్ల మేర లబ్ధి
చేకూరినట్లు జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తెలిపారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి *జగనన్న తోడు* పథకం కింద రెండో విడతలో 3,70,458 మందికి లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.370 కోట్ల వడ్డీలేని రుణాలను బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్‌లోని వివేకానంద సమావేశ మందిరం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ; ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, వంగా గీత; ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి; జాయింట్ కలెక్టర్లు డా. జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, జి.రాజకుమారి తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో జగనన్న తోడు కింద ఇప్పటికే లబ్ధిపొంది విజయవంతంగా చిరువ్యాపారాలు నిర్వహిస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు పండూరు పచ్చళ్లు, ఉప్పాడ చీరలు, వెదురు ఉత్పత్తులు వంటి వాటిని ప్రదర్శించారు.
ఈ సందర్భంగా జిల్లాలో పథకం అమలుతీరు వివరాలను కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. గ్రామీణప్రాంతాల్లో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో స్త్రీనిధి ద్వారా మొత్తం 23,241 మంది లబ్ధిదారులకు రూ.23 కోట్ల 24 లక్షల పదివేల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఆధ్వర్యంలో పీఎం స్వనిధితో డీసీసీబీ ద్వారా 10,204 మంది లబ్ధిదారులకు రూ.10 కోట్ల 20 లక్షల 40 వేల రూపాయలు లబ్ధి చేకూరినట్లు వెల్లడించారు. ఎస్‌సీ కేటగిరీలో 7,375 మంది, ఎస్‌టీ కేటగిరీలో 1,388 మంది, బీసీ కేటగిరీలో 14,044 మంది, ఓసీ కేటగిరీలో 9,978 మంది, మైనారిటీ కేటగిరీలో 660 మంది లబ్ధిపొందినట్లు తెలిపారు. జగనన్న తోడు పథకం ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.10 వేల చొప్పున బ్యాంకు ద్వారా అందుతున్న వడ్డీ లేని రుణాలు చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులకు పెద్ద ప్రయోజనం కలిగిస్తున్నాయని కలెక్టర్ వెల్లడించారు.
..........................
*జగనన్న తోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమచేసే కార్యక్రమం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన లబ్ధిదారు మొల్లేటి సరస్వతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సారాంశం ఆమె మాటల్లోనే..*
రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబం ప్రస్తుతం స్వయంసమృద్ధి సాధిస్తోందంటే కారణం మీరు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే. నేను చిన్న షాపులో కిరాణా వ్యాపారం చేస్తున్నాను. గతంలో పెట్టుబడి కోసం అధిక వడ్డీలకు అప్పులు తేవాల్సి వచ్చేది. వచ్చిన లాభం వడ్డీలు కట్టడానికే సరిపోయేది. వ్యాపారం మానేద్దామనుకున్న సమయంలో మీరు ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకం కొండంత అండనిచ్చింది. అధిక వడ్డీల భారం నుంచి మాకు విముక్తి కల్పించింది. కోవిడ్ సమయంలోనూ మీరు అందిస్తున్న ఈ రుణాలు చిరు వ్యాపారాల అభివృద్ధికి మెట్టుగా నిలుస్తున్నాయి. నాకు వైఎస్సార్ ఆసరా ద్వారా వచ్చిన రూ.13 వేలతో కుట్టు మిషన్ కొనుక్కున్నాను. దీనిద్వారా కూడా ఆదాయం లభిస్తోంది. మా అత్తగారికి వైఎస్సార్ చేయూత, మామగారికి పెన్షన్ వస్తున్నాయి. మాకు ఇద్దరు ఆడపిల్లలు. ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. అమ్మ ఒడి పథకం కూడా వచ్చింది. ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవాలనే నా కోరిక నెరవేర లేదు. ఇప్పుడు మీ ద్వారా మా పిల్లలకు ఆ కోరిక నెరవేరుతోంది. మీరు అమలుచేస్తున్న కార్యక్రమాల ద్వారా ఒకరిపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. జిల్లాలోని చిరువ్యాపారుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
*వడ్డీ వ్యాపారుల చేతిలో చిక్కకుండా ఉండేందుకే: మంత్రి కురసాల కన్నబాబు*
వడ్డీ వ్యాపారుల చేతిలో చిక్కకుండా చిరువ్యాపారులకు అండగా ఉండాలనే ఓ గొప్ప ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగనన్న తోడు పథకాన్ని అమలుచేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. పూర్తి వడ్డీని ప్రభుత్వమే భరిస్తూ చిరు వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తున్న ఈ పథకం దిగ్విజయంగా కొనసాగుతోందన్నారు. ఈ రెండేళ్ల కాలంలో దాదాపు 29 పథకాలు అవినీతికి తావులేకుండా పూర్తి పారదర్శకత, జవాబుదారీతనంతో అమలవుతున్నాయని పేర్కొన్నారు. చెప్పిన ప్రతి మాటను తు.చ.తప్పకుండా అమలుచేస్తూ కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హత ఒక్కటే ప్రాతిపదికగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అందిస్తున్నారన్నారు. మౌలిక వసతుల కల్పన, శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమల్లో రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు.
.............
*కేలండర్ ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు: మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ*
సుదీర్ఘ పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాన్నిప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి జగనన్న తోడు పథకాన్ని ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. పేదలను పేదరికం నుంచి బయటపడేలా చేసేందుకు ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ద్వారా ఓ గొప్ప యజ్ఞం చేస్తున్నారన్నారు. అధిక వడ్డీలబారినుంచి చిరు వ్యాపారులను కాపాడాలనే లక్ష్యంతో జగనన్న తోడు కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలుచేస్తోందని స్పష్టం చేశారు. ఓ కేలండర్ ప్రకారం సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారని, దాదాపు 33 లక్షల మందికి సొంతింటి కలను సాకారం చేస్తున్నారని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ వెల్లడించారు.
కార్యక్రమంలో డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాథ్, మెప్మా పీడీ కె.శ్రీరమణి, కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు, డీసీసీబీ సీఈవో పి.ప్రవీణ్‌కుమార్, స్త్రీనిధి ఏజీఎం ఎం.ధర్మేంద్ర, వివిధ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు, అధికారులు హాజరయ్యారు.
addComments
Post a Comment