అభివృద్ది, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లు
రెండేళ్లలో రూ. 4,880.38 కోట్లతో సంక్షేమం
వివిధ పథకాల ద్వారా 29,90,161 మందికి లబ్ది
అన్ని రంగాల్లో జిల్లా అభివృద్దికి కృషి
విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత
నవరత్నాలు ద్వారా 23,57,638 మందికి మేలు
జిల్లా అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్
విజయనగరం, జూన్ 01 (ప్రజా అమరావతి) ః గత రెండేళ్లలో జిల్లాలో సుమారు రూ.4వేల, 880 కోట్లతో వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ది చేకూర్చడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ తెలిపారు. వీటి ద్వారా జిల్లాలో సుమారు 29లక్షల, 90వేల, 161 మంది లబ్ది పొందారని, కొందరికి రెండుమూడు పథకాలు కూడా వర్తించాయని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి ఆదేశాలకు అనుగుణంగా, ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తూనే, అభివృద్ది కార్యక్రమాలను కూడా జోరుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. విజయనగరం జిల్లా అవతరణ దినోత్సవం సందర్భంగా, జిల్లా ప్రజలకు ఒక ప్రకటన ద్వారా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
అభివృద్ది పథాన విద్య, వైద్యం, వ్యవసాయం
ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో జిల్లాలో ఈ రెండేళ్లలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రజా ప్రతినిధుల సహకారంతో, జిల్లా అన్నివిధాలా అభివృద్ది దిశగా నడుస్తోందని అన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల ద్వారా పాలన ప్రజలకు మరింత చేరువయ్యిందని, ప్రభుత్వ సేవలు ప్రజల ముంగిటనే అందుతున్నాయని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు రైతు సేవలకు చిరునామాగా మారాయని చెప్పారు. జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి బీజం పడటం, విద్య, ఆరోగ్య రంగాలకు మేలు మలుపుగా పేర్కొన్నారు. పార్వతీపురం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా గిరిజనులకు ఆధునిక వైద్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. జిల్లాలో కొత్తగా రెండు జాతీయ రహదారుల నిర్మాణ ప్రక్రియ ప్రారంభమయ్యిందని, వీటిద్వారా రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని చెప్పారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణానికి ప్రతిపాదనలు తుదిదశకు చేరుకున్నాయన్నారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తయితే, జిల్లా అభివృద్ది మరింత వేగం పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, విలేజ్ క్లీనిక్కులు, బల్క్ మిల్క్ యూనిట్లు, సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తయితే, గ్రామ స్వరూపాలే మారిపోతాయన్నారు. నాడూ-నేడు ద్వారా ఇప్పటికే పాఠశాలలు కార్పొరేట్ హంగులను సంతరించుకున్నాయని, ఆసుపత్రుల అభివృద్ది పనులు జోరందుకున్నాయని తెలిపారు. జిల్లాను హరిత విజయనగరంగా మార్చేందుకు కృషి జరుగుతోందన్నారు.
నవరత్నాలు ద్వారా 23,57,638 మందికి లబ్ది
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా, జిల్లాలో అర్హులందరికీ లబ్ది చేకూరిందని, ఈ రెండేళ్లలో సుమారు రూ.4,880.38 కోట్ల రూపాయలను సంక్షేమానికి వెచ్చించడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాల అమల్లో ప్రభుత్వం మహిళలకే అగ్రతాంబూలం ఇస్తోందని చెప్పారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు ద్వారానే జిల్లాలో సుమారుగా 23లక్షల, 57వేల, 638 మంది లబ్ది పొందారని తెలిపారు. వీటిలో వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ పింఛన్ కానుక, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ, జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్నావడ్డీ, పేదలందరికీ ఇళ్లు తదితర కార్యక్రమాలు ఉన్నాయని తెలిపారు. పేదలందరికీ ఇళ్ల కార్యక్రమం క్రింద జిల్లాలో సుమారు లక్షలమందికి ఇళ్లు మంజూరు కానున్నాయని తెలిపారు. జిల్లాలో 1147 లేఅవుట్లు రూపొందించడం జరిగిందని, ఈ నెల 3వ తేదీన ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందని చెప్పారు.
సంక్షేమంలో నవశకం
సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల జోరుతో జిల్లాలో నవశకం ఆరంభమయ్యిందని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనికోసం పలు ప్రత్యేక పథకాలను అమలు చేసి, పేదలకు వారి ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తోందని చెప్పారు. ఎటువంటి సిఫార్సులకు తావివ్వకుండా, పూర్తి పాదర్శకంగా లబ్దిదారుల ఎంపిక జరుగుతోందన్నారు. నవరత్నాలే కాకుండా, వివిధ ప్రభుత్వ సంక్షేమ, ప్రాధాన్యతా కార్యక్రమాల ద్వారా ఈ రెండేళ్లలో జిల్లాలో సుమారు 6లక్షలా, 32వేల, 526 మందికి, సుమారు రూ.202.53 కోట్ల మేర ప్రయోజనం చేకూరిందన్నారు. దీనిలో వైఎస్ఆర్ కాపునేస్తం, జగనన్న చేదోడు, మత ప్రబోధకులకు గౌరవ భృతి, కొత్త రేషన్ కార్డులు మంజూరు, ఎండియు వాహనాల ద్వారా నిత్యావసరాల పంపిణీ, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ లా నేస్తం, మత్స్యకార భరోసా, ఆయిల్ సబ్సిడీ, నేతన్న నేస్తం, అగ్రిగోల్డు బాధితులకు ఆర్థిక సాయం, ఆరోగ్య ఆసరా, వైఎస్ఆర్ కంటివెలుగు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, జగనన్న తోడు, వైఎస్ఆర్ బీమా, సున్నావడ్డీ పంట రుణాలు, వైఎస్ఆర్ పంటల బీమా క్లెయిమ్స్ తదితర పథకాలు ఉన్నాయని కలెక్టర్ వివరించారు.
addComments
Post a Comment