జగనన్న కాలనీల్లో పేదలకు జిల్లాలో మొదటి దశలో అనుమతి ఇచ్చిన 58 వేల ఇళ్ల నిర్మాణం


నెల్లూరు (ప్రజా అమరావతి);


జగనన్న కాలనీల్లో పేదలకు జిల్లాలో మొదటి దశలో అనుమతి ఇచ్చిన 58 వేల ఇళ్ల నిర్మాణం


ఈనెల (జూన్) చివరి నాటికి ప్రారంభమవ్వాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్.చక్రధర్ బాబు.., జిల్లా అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్లు, జిల్లా అధికారులతో సమీక్షా, సమావేశం నిర్వహించిన కలెక్టర్.., జగనన్న కాలనీల్లోని ఇప్పటికే నిర్మాణం పూర్తైన అన్ని మోడల్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమాలను.., ప్రోటోకాల్ ప్రకారం నిర్వహించాలన్నారు. పూర్తైన మోడల్ హౌస్ ప్రారంభోత్సవాలను చూసిన ఇతర లబ్దిదారులు కూడా, త్వరితగతిన తమకు కేటాయించిన స్థలంలో ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇసుక, సిమెంట్, ఐరన్ సరఫరా చేయాలన్నారు. కోవిడ్ కారణంగా ఉపాధి అవకాశాలు లేని కార్మికులకు జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా జీవనోపాథి కల్పించవచ్చని.., అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. లే అవుట్స్ లో బోర్లు ఏర్పాటు, విద్యుత్తు సదుపాయాల పనులు ఎంత వరకూ వచ్చాయో..? అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్.., లే అవుట్స్ లో మొక్కలు నాటి, కాలనీలన్నీ పచ్చదనంతో ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇల్లు కట్టుకోవడానికి నాణ్యమైన సామగ్రి.., లబ్ది దారులకు సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేయాలని, ఇళ్ల నిర్మాణం నాణ్యతగా ఉండేలా లబ్ది దారులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులను చేయాలన్నారు. ప్రభుత్వం నిర్మించే పక్కా ఇళ్లకు జియో ట్యాగింగ్‌ 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ హౌసింగ్ క్షేత్రస్థాయికి వెళ్లి లే అవుట్స్ లోని వాస్తవ పరిస్థితిని పరీశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. 

అనంతరం కోవిడ్ నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్.., కోవిడ్ విధులు నిర్వహిస్తూ మరణించిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లకు త్వరితగతిన ప్రభుత్వ ఎక్స్ గ్రేషియా అందేలా చర్యలు తీసుకోవాలని డి.ఎం.హెచ్.ఓ ని ఆదేశించారు. కోవిడ్ రెండో వేవ్ లో కోవిడ్ తో మరణించిన వారికి ప్రభుత్వం అందించే రూ. 15,000.., ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ తో తల్లిదండ్రులు మరణించి, అనాథలైన చిన్నారులకు రాష్ట్రం ప్రభుత్వం పరిహారం అందిస్తోందని, వారి వివరాలు సేకరించి.., బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని ఆదేశించారు. వారం రోజుల నుంచి జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిందని, అయినా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు కూడా కేసుల సంఖ్య తగ్గిందని నిర్లక్ష్యంగా ఉండరాదని, వారికి అవగాహన కల్పిస్తూ.., కోవిడ్ ప్రోటోకాల్, కర్ఫ్యూ నిబంధనలను అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మూడో వేవ్ లో చిన్నారులు కోవిడ్ కి గురయ్యే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయని, దీనికి ముందుస్తుగా జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉన్నప్పుడే ఎదుర్కోగలమన్నారు. జి.జి.హెచ్. ఆస్పత్రిలో అవసరమైన పీడియాట్రిక్ వైద్యులను, వైద్య సిబ్బంది నియామకానికి తక్షణం నోటిఫికేషన్ ఇవ్వాలని జి.జి.హెచ్. సూపరింటెండెంట్ ని కలెక్టర్ ఆదేశించారు. జి.జి.హెచ్. లో ఆక్సిజన్ పైప్ లైన్ నిపుణులైన ఏజెన్సీ సిబ్బంది ద్వారా పరిశీలించాలని, ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మరమ్మతులు చేయాలన్నారు. ఆక్సిజన్ వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఫ్లోర్ కి ప్రత్యేకంగా పైప్ లైన్ నిర్మాణానికి టెండర్లు పిలిచి, పనులు వెంటనే చేపట్టాలన్నారు. కోవిడ్ పాజిటివ్ వ్యక్తులను గుర్తించి, కుటుంబ సభ్యులకు టెస్టులు నిర్వహించాలని, కాంటాక్టు ట్రేసింగ్ విషయంలోఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వరాదన్నారు. 

వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. జి.జి.హెచ్. తో పాటు.., జిల్లాలోని కోవిడ్ నోటిఫైడ్ ఆస్పత్రుల్లో నాన్ ఆక్సిజన్ బెడ్స్ ని, ఆక్సిజన్ బెడ్స్ గా మార్చడానికి ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై అధికారులను అడిగి కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. ఫీవర్ సర్వేపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్, సమాంతరంగా వ్యాక్సినేషన్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. టాక్సీ, ఆటో, అంబులెన్స్ డ్రైవర్లు అందరికీ వ్యాక్సిన్ అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. బండ్లపై కూరగాయలు అమ్మోవారు, స్ట్రీట్ వెండర్స్ కి వ్యాక్సినేషన్ తప్పని సరిగా నిర్వహించాలన్నారు. 45 ఏళ్లు దాటిన ప్రతి ఆర్టీసీ బస్సు డ్రైవర్లు వ్యాక్సిన్ తీసుకోవాలని, ఆర్టీసీ అధికారుల నుంచి వివరాలు సేకరించి, ఇంకా ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోకుండా ఉంటే వారిని గుర్తించి వ్యాక్సిన్ అందించాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ఎం.పి.డి.ఓ లు, సచివాలయ సిబ్బంది, గ్రామ సచివాలయ సిబ్బందిని భాగస్వామ్యులను చేయాలని, లక్ష్యం మేరకు ప్లాంటేషన్ కార్యక్రమం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.


ఈ సమీక్షా, సమావేశంలో జాయింట్ కలెక్టర్ ( హౌసింగ్ ) విధేహ్ ఖరే, జాయింట్ కలెక్టర్ ( అభివృద్ధి) గణేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ( ఆసరా) టి.బాపిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డి.ఆర్.ఓ ఓబులేశు, డి.ఎం.హెచ్.ఓ రాజ్యలక్ష్మి, డి.పి.ఓ దనలక్ష్మి, జెడ్పి సి.ఈ.ఓ పి.సుశీల, డ్వామా పి.డి. తిరుపతయ్య, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 



Comments