దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో డోర్ డెలివరీ విధానం




              దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో డోర్ డెలివరీ విధానం



 

- ఇంటి వద్దకే నాణ్యమైన సార్టెక్స్ బియ్యం సరఫరా 

- రూ. 639 కోట్లతో 9,260 మొబైల్ వాహనాలు 

- కార్పోరేషన్ల ద్వారా నిరుద్యోగులకు జీవనోపాధి 

- శాఖను సమర్ధంగా నిర్వహిస్తున్న మంత్రి కొడాలి నాని 



గుడివాడ, జూన్ 8 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చే వరకు ఒక లెక్క ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పాలన ఇంకో లెక్క అన్నట్టుగా దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో డోర్ డెలివరీ విధానానికి రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టడం జరిగింది. గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా జగన్మోహనరెడ్డి 3,648 కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా రేషన్ సరుకుల కోసం రోజువారీ కూలీలు, వృద్ధులు, రోగులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ సరుకులను కార్డుదారుల ఇంటి వద్దే అందజేస్తానని హామీ ఇచ్చారు. అప్పట్లో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ షాపుల ద్వారా తినడానికి పనికిరాని బియ్యాన్ని సరఫరా చేసేవారు. డీలర్లు కొంత మంది ఇష్టమొచ్చిన సమయంలో సరుకులను పంపిణీ చేస్తుండడంతో రోజువారీ కూలీలు, పేదలు రేషన్ కోసం రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చేది. నిత్యావసరాలు పెద్దఎత్తున బ్లాక్ మార్కెట్ కు తరలిపోయేవి . ఎక్కువ నూకల శాతం, రంగుమారిన బియ్యాన్ని సరఫరా చేస్తుండడాన్ని గమనించిన జగన్మోహనరెడ్డి ప్రజలు తినగలిగే నాణ్యమైన స్వర్ణ రకం సార్టెక్స్ చేసిన బియ్యాన్ని ఇంటి వద్దే అందించేందుకు నిర్ణయించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పౌరసరఫరాల శాఖకు మంత్రిగా కొడాలి నానిని నియమించడం జరిగింది. రాష్ట్రంలో ఎన్టీఆర్ హయాంలో నాలుగున్నర దశాబ్దాల కిందట రూపుదిద్దుకున్న ప్రజాపంపిణీ వ్యవస్థను మంత్రి కొడాలి నాని తొలి ఏడాది కాలంలోనే ప్రక్షాళన చేశారు. ఒకప్పుడు కిలో బియ్యం పథకం ఎంతటి ప్రాచుర్యాన్ని పొందిందో అంతకు మించి ఒక రూపాయికి నాణ్యమైన సార్టెక్స్ చేసిన కిలో బియ్యం ప్రజాదరణకు నోచుకుంది. గత 40 ఏళ్ళుగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజాపంపిణీ వ్యవస్థలో బోగస్ కార్డులను మాత్రం ఏరివేయలేకపోయాయి. రేషన్ బియ్యం అంటే తినడానికి పనికిరావనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉండేది. ప్రతి నెలా రేషన్ షాపుల ద్వారా సరఫరా అయ్యే బియ్యం తిరిగి దళారులు, మిల్లర్లకు చేరుతూ వారికి కాసులు పండించేవి. ఇవే బియ్యం రీసైక్లింగ్ ద్వారా మళ్ళీ ప్రజాపంపిణీ వ్యవస్థలోకి చొరబడేవి. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహనరెడ్డి మంత్రి కొడాలి నానిపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా ప్రతి పనినీ సమర్ధవంతంగా, ఎటువంటి హంగు, ఆర్భాటాలు, ప్రచారాలకు పోకుండా రాష్ట్ర పౌరసరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తూ వచ్చారు. ముందుగా రేషన్ కార్డుల స్థానంలో బియ్యం కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. బియ్యం కార్డుతో సంబంధం లేకుండా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్ తదితర కార్డులను వేర్వేరు చేశారు. గోదాముల్లో ఏళ్ళ తరబడి పేరుకుపోయిన, ముక్కిపోయిన బియ్యం నిల్వలకు స్వస్తి చెప్పారు. ఇంటి వద్దకే రేషన్ సరుకులను అందజేయాలన్న సీఎం జగన్మోహనరెడ్డి ఆలోచనకు మంత్రి కొడాలి నాని కార్యరూపం ఇచ్యారు. ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా రేషన్ డోర్ డెలివరీ కార్యక్రమాన్ని నిర్వహించి అందులోని లోపాలను ఎప్పటికపుడు సరిచేసుకుంటూ అనేక మెరుగులు దిద్దుతూ వచ్చారు. మోటారు ఫీల్డ్ లో తనకున్న అనుభవంతో గుడివాడలో సరికొత్త మొబైల్ వాహనాన్ని తయారు చేయించి డెమోతో సీఎం జగన్మోహనరెడ్డి మెప్పించారు. రూ. 539 కోట్ల వ్యయంతో 9,260 మొబైల్ వాహనాలను రివర్స్ టెండరింగ్ ద్వారా సమకూర్చారు. వీటిని నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించేందుకు ఎస్సీ కార్పోరేషన్ ద్వారా 2,300, ఎస్టీ కార్పోరేషన్ ద్వారా 700, బీసీ కార్పోరేషన్ ద్వారా 3,800, మైనార్టీస్ కార్పోరేషన్ ద్వారా 660, ఈబీ కార్పోరేషన్ ద్వారా 1800 వాహనాలను 60 శాతం సబ్సిడీపై అందజేశారు. ఒక్కో వాహనం విలువ రూ.5.81 లక్షలు కాగా దీనిలో రూ.3 లక్షల 48 వేల 600 ల సబ్సిడీ ఉంటుంది. వాహనాలకు ప్రతి నెలా వాయిదాలను పౌరసరఫరాల సంస్థ ఆరేళ్ళ పాటు చెల్లిస్తుంది. ప్రతి మొబైల్ వాహనంలో తూకం వేసే యంత్రం, కొలతల పరికరాలు, చిన్న మైక్, నగదు పెట్టే తదితరాలు ఉండేలా ఏర్పాటు చేశారు. మొబైల్ వాహనం ద్వారా నెలకు దాదాపు 20 రోజుల పాటు రోజుకు 90 కార్డులు తగ్గకుండా రేషన్ సరఫరా చేస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో సరఫరా చేసే బియ్యంలో 25 శాతం నూకలు ఉండేవి. దీన్ని 15 శాతానికి తగ్గించారు. అలాగే మట్టి, రాళ్ళను 0.5 శాతం నుండి సున్నా శాతానికి, రంగుమారిన బియ్యం గింజల శాతాన్ని 3 నుండి 0.75 శాతానికి, పరిపక్వంగాని గింజల శాతాన్ని 5 నుండి 1 శాతానికి, పట్టు తక్కువ బియ్యం 13 శాతం నుండి 10 శాతానికి తగ్గించి సార్టెక్స్ చేసిన బియ్యాన్ని కార్డుదారులకు ప్రతి నెలా ఇంటి వద్దే మొబైల్ వాహనాల ద్వారా అందజేస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. కాగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలోనూ రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ కీలకపాత్ర పోషిస్తోంది. గత ఏడాది మార్చి నెల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ఆంక్షలను విధించాయి. రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడూ ఆకలిలో ఉండకూడదంటూ సీఎం జగన్మోహనరెడ్డి మొత్తం 16 విడతలుగా ఉచితంగా నిత్యావసరాలను రేషన్ కార్డులదారులకు పంపిణీ చేశారు. కార్డుదారుడు ఏ ప్రాంతంలో ఉన్నా పోర్టబులిటీ సౌకర్యాన్ని కల్పించారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఈ ఏడాది మే, జూన్ నెలల్లో కార్డులోని ఒక్కో సభ్యుడికి 10 కేజీలు చొప్పున బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మొత్తం మీద మంత్రి కొడాలి నాని తనకిచ్చిన పౌరసరఫరాల శాఖను నూరుశాతం సమర్ధవంతంగా నిర్వహిస్తూ ముందు వరుసలో నిలబెట్టారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Comments