అమరావతి (ప్రజా అమరావతి);
*జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో క్యాంప్ కార్యాలయం నుంచి స్పందన కార్యక్రమంపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.*
*కోవిడ్, ఉపాధిహామీ పనులు, వైయస్సార్ అర్భన్ క్లినిక్స్, ఇళ్లపట్టాలు, జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమం, ఖరీఫ్ సన్నద్ధతలపై సమీక్ష*
*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే...:*
*కోవిడ్ –19*
కోవిడ్ నియంత్రణ విషయంలో కలెక్టర్లు అద్భుతంగా పనిచేశారు
.
మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ, అనుసరించిన వ్యూహం మంచి ఫలితాలను ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య తగ్గుతోంది, పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోంది. మే 15న 25.56 శాతానికి పైగా పాజిటివిటీ ఉంటే.. ప్రస్తుతం 5.97శాతం ఉంది.
ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయకుండా, సమాజంలో ఏ వర్గాన్నీ కష్టపెట్టకుండా చేయగలిగాం.
*కోవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరి*
కోవిడ్ ఎప్పటికీ కూడా జీరోస్థాయికి చేరుతుందని అనుకోవద్దు.
ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలి. మనం జాగ్రత్తలు తీసుకుంటూనే.. కోవిడ్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న విషయాన్ని మరిచిపోవద్దు. కోవిడ్ ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలి. మాస్కులు, శానిటైజర్లు తదితర చర్యలన్నీ కొనసాగాలి, ఇవి మన జీవితంలో భాగం కావాలి. వీటిని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి.
*ఫోకస్‌గా కోవిడ్ టెస్టులు*
కోవిడ్ టెస్టులు ఫోకస్‌గా చేయాలి.
గ్రామాల్లో ఫీవర్‌సర్వే కార్యక్రమాలు ప్రతి వారం కొనసాగాలి. ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేసి పరీక్షలు చేయాలి. ఎవరు కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నా.. పరీక్షలు చేసి వెంటనే వైద్యం అందించాలి. కోవిడ్ నిర్దారణ అయితే వెంటనే చర్యలు తీసుకోవాలి. ఫీవర్ సర్వే కార్యక్రమం తర్వాత, టెస్టులు ఇష్టానుసారం కాకుండా ఫోకస్‌గా, లక్షణాలు ఉన్నవారికే చేయాలి.
ఎవరైనా పరీక్షలు చేయమని అడిగితే వారికి కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలి.
*ఆర్టీపీసీఆర్ టెస్టులే చేయాలి*
వచ్చే వారంలో ఇంకా కేసులు తగ్గుముఖం పడతాయి, బహుశా టెస్టులు ఈస్థాయిలో అవసరం ఉండకపోవచ్చు.
కానీ, ఏం చేసినా కూడా ఆర్టీపీఆర్ టెస్టులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
*ఆరోగ్య శ్రీ అమల్లో భేష్*
కోవిడ్ ట్రీట్‌మెంట్‌లో 89శాతం మంది ఆరోగ్యశ్రీ కింద తీసుకున్నారు. పేదవాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థికంగా భారంపడకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ విషయంలో కలెక్టర్లందరికీ అభినందనలు తెలియచేస్తున్నా.
ఈరోజు 16,112 మందికి కోవిడ్ ట్రీట్‌మెంట్‌జరుగుతుంటే.. 14,359 మంది ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారు.
*ప్రైయివేటు ఆస్పత్రులపై దృష్టి*
కోవిడ్ ట్రీట్‌మెంట్‌కు సంబంధించి ప్రయివేటు ఆస్పత్రులపై కూడా కలెక్టర్లు దృష్టిపెట్టాలి. ప్రభుత్వం ప్రకటించిన రేట్లుకన్నా.. ఎక్కువ ఛార్జి చేయకూడదు. అలా ఎవరైనా వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా వసూలు చేసిన ఆస్పత్రులను మూసివేయడానికి కూడా కలెక్టర్లు సంకోచించవద్దు.
మహమ్మారి సమయంలో ప్రజలను పీడించుకుతినే ఆలోచనలు ఉన్నవారిపై కఠినంగా వ్యవహరించాలి. మొదటిసారి ఉల్లంఘిస్తే పెనాల్టీలు వేయాలి, రెండోసారి చేస్తే క్రిమినల్ కేసులు పెట్టాలి.
*104 – ఒన్‌స్టాప్ సొల్యూషన్*
104 నంబర్‌ను తప్పనిసరిగా ఓన్‌చేసుకోవాలి, గడచిన 2 నెలల్లో 104 నంబర్ ద్వారా 5 లక్షల ఇన్ కమింగ్ కాల్స్ వస్తే, 6.65 లక్షల అవుట్ గోయింగ్ కాల్స్ చేశారం. ఇది చాలా గర్వకారణం.
104కు ఒక రోజుకు గరిష్టంగా 19వేల కాల్స్ వచ్చాయి, ప్రస్తుతం సుమారు 3వేల కాల్స్ వస్తున్నాయి. కేసులు తగ్గాయనడానికి ఇదే నిదర్శనం.
104 కు కాల్ చేయగానే కచ్చితంగా స్పందన ఉండాలి.
మనకు కాల్ చేసిన తర్వాత వైద్యులు కాల్‌చేయడం, వారి యోగక్షేమాలు కనుక్కోవడం, బెడ్స్ ఇప్పించడం చేయాలి.
కోవిడ్‌సంబంధిత అంశాలకు సంబంధించి 104 అనేది ఒన్‌స్టాప్ సొల్యూషన్ కావాలి.
*కేసులు తగ్గినా అప్రమత్తంగా ఉండాలి*
కలెక్టర్లు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి, కేసులు తగ్గినప్పుడు కాస్త రిలాక్స్ మూడ్ వస్తుంది.
ఇలాంటి సమయంలో ఒకసారి మొత్తం సమీక్షించుకుని తిరిగి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం 439 ఆస్పత్రులు నిర్వహిస్తున్నాం. ఈ ఆస్పత్రుల్లో పర్యవేక్షణ అన్నది చాలా ముఖ్యం.
ఆరోగ్య మిత్రలు చురుగ్గా పనిచేసేలా చూడాలి, నోడల్ ఆఫీసర్లు కూడా పర్యవేక్షించాలి.
*సేవల్లో నాణ్యత..*
ఆస్పత్రుల సేవల్లో నాణ్యత చాలా ముఖ్యం. సీరియస్‌నెస్ ఎప్పుడూ తగ్గకూడదు. రోగులకు అందిస్తున్న ఆహారం,సేవలు బాగుండాలి.
ఆహారం, పారిశుద్ధ్యత, మందులు, సిబ్బంది, హెల్ప్ డెస్క్, ఆరోగ్యమిత్ర, సీసీటీవీలు తదితర అంశాల్లో చక్కటి పనితీరు, సేవల్లో నాణ్యత ఉండాలి. ఈ అంశాలను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నాం.
*ఫీవర్ క్లినిక్స్*
ప్రతివారం ఫీవర్ సర్వీ చేయాలి. వారానికి ఒకసారి ఫీవర్‌క్లినిక్స్ కూడా కచ్చితంగా నిర్వహించాలి.
మనం గుర్తిస్తున్న అంశాలను కూడా ఫాలోఅప్ చేయాలి.
104కాల్‌సెంటర్ ద్వారా వైద్యులతో టెలిమెడిసిన్ వైద్యం కొనసాగాలి. ఫాలోఅప్‌కూడా చేయాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం.
*కోవిడ్ థర్డ్ వేవ్– కార్యాచరణ*
థర్డ్‌వేవ్ వస్తుందో, లేదో మనకు తెలియదు.
సన్నద్ధంగా ఉండడం అన్నది మన చేతుల్లోని అంశం.
వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి.
థర్డ్‌వేవ్‌లో పిల్లలు ప్రభావితం అవుతారని చెప్తున్నారు.
ఈ అంశాలను కలెక్టర్లు దృష్టిలో ఉంచుకోవాలి.
దీనికోసం కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి.
పిల్లలకు చికిత్స అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
*2 నెలల కార్యాచరణ*
జిల్లాస్థాయిలో వచ్చే 2 నెలలకు తగినట్లుగా కార్యాచరణ సిద్ధంచేసి, అమలు చేయాలి.
టీచింగ్ ఆస్పత్రుల్లో ఐసీయూ బెడ్లు క్వాలిటీని పరిశీలించండి.
శిశువులకు వైద్యం అందించే విషయంలో సదుపాయాల్లో నాణ్యత ఉందా? లేదా? చూడండి.
సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉంచేలా చూసుకోండి. వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేవా? తనిఖీ చేయాలి.
అవసరమైన మందులను కూడా అందుబాటులో ఉంచుకోండి.
సిహెచ్‌సీ స్ధాయి వరకు మందులు అందుబాటులో ఉంచుకోండి.
జిల్లాలో చిన్నపిల్లల వైద్యులు ఎక్కడ ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? అన్నదానిపై మాపింగ్‌చేయండి.
అవసరమైన సమయంలో వారి సేవలను మనం వినియోగించుకునేలా ఉండాలి. అవసరమైన వారిని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రిక్రూట్‌చేస్తూనే, మిగిలిన వారిని కూడా మ్యాపింగ్ చేయాలి.
*నర్సులకు శిక్షణ*
శివులను, చిన్నపిల్లల విషయంలో చికిత్స, వైద్యం విషయంలో ఎలా వ్యవహరించాలన్నదానిపై నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వండి.
*అత్యాధునిక పిల్లల ఆస్పత్రుల నిర్మాణం...*
పిల్లల వైద్యంకోసం మూడు అత్యాధునిక ఆస్పత్రులను తీసుకొస్తున్నాం. వైజాగ్‌లో ఒకటి, కృష్ణా–గుంటూరు ప్రాంతంలోనూ, తిరుపతిలో మరొకటి తీసుకువస్తున్నాం.
దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా వీటిని నిర్మిస్తున్నాం. దీనికి సంబంధించి అవసరమైన భూములను కలెక్టర్లు గుర్తించాలి.
*16 కొత్త బోధనాసుపత్రులు*
వీటితోపాటు కొత్తగా 16 టీచింగ్ ఆస్పత్రులను మొదలుపెడుతున్నాం. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేవలం 11 టీచింగ్ ఆస్పత్రలు ఉంటే, రెండేళ్ల కాలంలో మనం 16 ఆస్పత్రుల నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నాం. 11 పాత బోధనాసుపత్రులను జాతీయ స్ధాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నాం.
మనకు మహానగరాలు లేనందున అత్యాధునిక వైద్య సదుపాయాల విషయంలో వెనకబడి ఉన్నాం. అందుకనే కొత్త టీచింగ్ ఆస్పత్రుల ద్వారా అత్యాధునిక వైద్యాన్ని ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో అందుబాటులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
*ప్రైయివేటు ఆసుపత్రుల ఏర్పాటు– ప్రోత్సాహకాలు*
దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా ప్రయివేటు సెక్టార్‌లో సూపర్‌స్పెషాలిటీ, మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులకూ ఆహ్వానం పలుకుతున్నాం. ప్రతి జిల్లాకేంద్రంలోనూ, ప్రతి కార్పొరేషన్‌లోనూ 16 చోట్ల ప్రైయివేటు మల్టీ, సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులను పెట్టించడానికి ప్రోత్సాహకంగా భూములు ఇవ్వాలని నిర్ణయించాం.
మూడేళ్లకాలంలో రూ.100 కోట్లు ఆస్పత్రి రూపేణా పెట్టుబడి పెట్టాలి. ఒకే చోట కాకుండా నగరాలు, పట్టణాలకు నలువైపులా ఈ ప్రయివేటు ఆస్పత్రులు వచ్చేలా చూడాలి. వీటిని ఆరోగ్య శ్రీతో ఎంపానెల్‌చేస్తాం. అప్పుడే పేదవాడికి ఉచితంగా మంచి వైద్యాన్ని అందించ గలుగుతాం. ప్రయివేటు ఆస్పత్రులకు సంబంధించి మార్గదర్శకాలు తయారుచేస్తున్నారు. దీనిపై కలెక్టర్లు దృష్టిసారించాలి.
*వాక్సినేషన్*
వాక్సినేషన్ అన్నది చాలా ముఖ్యమైనది, వాక్సినేషన్ కెపాసిటీ దేశంలో పెరగాల్సిందే. ఆలోగా మనకు వచ్చే వాక్సిన్లను ప్రజలకు సమర్థవంతంగా అందించాలి. నిర్దేశించుకున్న విధివి«ధానాల ప్రకారం వాక్సినేషన్ ఇవ్వాలి. నిర్ణయించుకున్న విధానాలనుంచి పక్కకు పోవద్దు, తన, మన భేదం చూపొద్దు. మనం కరెక్టుగా ఉంటే.. వ్యవస్థలు కూడా సక్రమంగా నడుస్తాయి.
మూడున్నర కోట్ల మందికి వాక్సిన్ ఇవ్వాల్సి ఉంటే... ఇందులో 26,33,351 మందికి మాత్రమే రెండు డోసులు వాక్సినేషన్ ఇవ్వగలిగాం. మరో 69,04,710 మందికి ఒకడోసు మాత్రమే ఇవ్వగలిగాం. వాక్సినేషన్ విషయంలో మనం చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది, అందుకనే నిర్దేశించుకున్న విధివిధానాలను పారదర్శకంగా అమలు చేయాలి.
*ఇ– క్రాపింగ్*
పంట వేసే దగ్గరనుంచి.. బీమా వరకూ కూడా ఇ– క్రాపింగ్ చాలా ముఖ్యం. ఇ– క్రాపింగ్ చేయకపోతే... కలెక్టర్ విఫలం అయ్యారని భావించవచ్చు. కనీసం 10శాతం ఇ– క్రాపింగ్‌ను కలెక్టర్, జేసీలు పరిశీలించాలి. దిగువనున్న సిబ్బందికూడా ఇ– క్రాపింగ్‌ను పర్యవేక్షించాలి, లేకపోతే సేవల్లో నాణ్యత ఉండదు.
ఇ– క్రాపింగ్‌పై శిక్షణ కార్యక్రమం ఆర్బీకే లెవల్లో ఏర్పాటు చేస్తున్నాం.
3 జూన్ నుంచి 8 జూన్ వరకు ఈ శిక్షణ జరుగుతుంది.
ఎవరైనా మిస్ అయినట్టుగా చెప్తే వారికి కూడా శిక్షణ ఇస్పిస్తాం.
*రైతులకు భౌతిక రశీదు*
ప్రతి రైతుకు భౌతికంగా రశీదు ఇవ్వాలి.
డిజిటల్ అక్నాలెడ్జ్‌మెంట్‌తోపాటు భౌతికంగా కూడా రశీదు ఇవ్వాలి.
ఇ– క్రాప్ వివరాలన్నీ కూడా ఇందులో ఉండాలి.
ఈ వివరాలు ఆ«ధారంగానే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా వస్తుంది. వివరాల నమోదులో జాగ్రత్తగా వ్యవహరించాలి, మన అలసత్వం వల్ల రైతులకు నష్టం రాకూడదు. మనల్ని ప్రశ్నించే అవకాశం రైతులకు ఉండాలి.
అందుకనే డిజిటల్ రశీదుతోపాటు, ఫిజికల్ రశీదుకూడా ఇవ్వాలి.
దీనిపై కలెక్టర్లు దృష్టి పెట్టి, ఇ– క్రాపింగ్ చేసేటప్పుడు ప్రతి ఎకరం, ప్రతి పంట వివరాలు కూడా నమోదు చేయాలి.
వివాదాస్పదమైన భూమి అయినా, సరే కచ్చితంగా ఇ– క్రాపింగ్‌నమెదు కావాలి. దాని ఆధారంగా మనం పంట కొనుగోలు చేస్తాం. కచ్చితంగా ఏ రైతుకు కూడా నష్టం జరగకుండా చూడాలి.
హార్టికల్చర్ విషయంలో సీజన్‌తో సంబంధం లేకుండా ఇ–క్రాపింగ్‌చేయాలి.
*వ్యవసాయ సలహామండలి*
ఆర్బీకేలు మొదలుకుని మండల, జిల్లా స్థాయిలో వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు కావాలి. వాటి సమావేశాలు కచ్చితంగా జరగాలి.
ఎలాంటి పంటలు వేయాలన్నదానిపైనే కాదు, ధర వచ్చే పంటలు, డిమాండ్ ఉన్న పంటలు వేయడంలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషించాలి. ఏ పంట వేయవచ్చు, ఏ వెరైటీ వేయకూడదన్న దానిపై కమిటీల సహాయంతో పంటల ప్రణాళిక వేసుకోవాలి.
బోరుబోరుబావుల కింద మెట్టప్రాంతాల్లో వరి వేయడం అన్నది చాలా రిస్క్, అలాంటి సందర్భాల్లో మంచి ఆదాయాలు వచ్చే పంటలను వారికి చూపించాలి.
కొర్రలు, రాగులు వంటి ప్రత్యామ్నాయ పంటలను, మెరుగైన ఆదాయాన్నిచ్చే పంటలను చూపించాలి. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న వంగడాలపై రైతులకు చైతన్యం కలిగించాలి. అది రైతుకు, ప్రభుత్వానికి కూడా ఉపయోగపడుతుంది.
*రైతులకు – నాణ్యమైన విత్తనాలు*
రైతులకు నాణ్యమైన విత్తనాలే అందాలి, నకిలీలకు ఆస్కారం ఉండకూడదు. ఈవిషయంలో కలెక్టర్లు దృష్టిపెట్టాలి.
నాణ్యమైన విత్తనాలు రైతులకు ఆర్బీకేలద్వారా అందాలి.
ప్రీమియం విత్తనాలు కూడా ఆర్బీకేలద్వారా రైతులకు అందించేలా చేయగలిగితే.. రైతులకు భరోసా ఉంటుంది.
బ్లాక్‌మార్కెటింగ్ కూడా ఉండదు. మిర్చి, పత్తి, తదితర పంటలకు సంబంధించి ప్రీమియం విత్తనాలను ఆర్బీకేల ద్వారా అందించాలి.
విత్తనాలు, ఎరువులు అమ్మే దుకాణాలపై క్రమం తప్పకుండా తనిఖీలు జరగాలి.
డీలర్లు అమ్మే వాటిలో నాణ్యత ఉన్నాయా? లేదా? కచ్చితంగా పరిశీలించాలి. పోలీసుల సహకారంతో ఈ రెయిడ్స్ జరగాలి.
అప్పుడే బ్లాక్‌మార్కెటింగ్, కల్తీలకు మనం అడ్డుకట్ట వేయగలుగుతాం. అనైతిక కార్యకలాపాలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు.
*కర్ఫ్యూలోనూ వ్యవసాయ పనులు*
కర్ఫ్యూ సమయంలో కూడా వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలకు అవకాశం ఉంటుందన్న విషయాన్ని మరిచిపోకూడదు. ఆ మేరకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి.
*అందుబాటులో ఎరువులు*
రైతులకు అందుబాటులో ఎరువులు ఉండాలి.
నాణ్యత పరీక్షించిన ఎరువులను ఆర్బీకేల ద్వారా రైతులకు అందించాలి. ఎక్కడా కూడా రైతులకు ఎరువుల కొరత రానీయొద్దు.
కాంప్లెక్స్ ఎరువులను కూడా రైతులకు అందుబాటులో ఉంచాలి.
అలాగే పురుగుమందుల విషయంలోకూడా కచ్చితంగా నాణ్యత పరీక్షలు జరగాలి.
*కస్టమ్ హైరింగ్ సెంటర్లు – హబ్స్*
కస్టమ్ హైరింగ్ సెంటర్లు, హబ్స్ అనేవి వ్యవసాయరంగంలో పెనుమార్పులకు దారితీస్తాయి. స్థానిక రైతులకు అందుబాటు ధరల్లో యంత్రాల సేవలు అందిస్తాయి.
జిల్లాస్థాయిలో కమిటీలను, రైతులే ఏర్పాటుచేసి వారి సహకారంతో రేట్లను నిర్ణయించాలి.
ఏ యంత్రాన్ని ఎంత ధరకు అద్దెకు ఇవ్వొచ్చన్నదానిపై నిర్ణయించాలి.
ప్రకటించిన ధరలకే ఈ పరికరాలన్నీకూడా అందుబాటులో ఉంటాయి. జూలై 8న మొదట విడతగా 3వేల ఆర్బీకేల పరిధిలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ప్రారంభిస్తున్నాం. అక్టోబరులో 2వ విడత, జనవరిలో మూడో విడత కస్టర్ హైరింగ్‌సెంటర్లు ప్రారంభిస్తున్నాం.
బ్యాంకింగ్‌సేవలను ఆర్బీకేల స్థాయికి తీసుకు రావాలి. ఈమేరకు బ్యాంకులతో కలెక్టర్లు మాట్లాడాలి. సీసీఆర్‌సికి సంబంధించి రైతుకు నష్టం జరగకుండా కొత్త చట్టం తీసుకొచ్చాం. ఇందులో కౌలు రైతులకు మేలు చేసే ప్రక్రియపై అవగాహన కలిగించాలి. వారికి రుణాలు వచ్చేలా చేయడం మీ బాధ్యత.
*ఉపాధిహామీ పనులపై సీఎం సమీక్ష:*
ఉపాధిహామీల్లో పనుల ప్రగతి మెరుగుపడాల్సి ఉంది. కలెక్టర్లు దీనిపై దృష్టిపెట్టాలి.
ప్రతి జిల్లాలో మొక్కల పెంపకంపై దృష్టిపెట్టండి. స్కూళ్లు, ఆసుపత్రుల్లో మొక్కల నాటే కార్యక్రమంపై దృష్టి పెట్టండి.
గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్‌క్లినిక్స్ పనులు చురుగ్గా సాగాలి. ఒక గ్రామంలో ఒకరితోనే కాకుండా పనులను పంపిణీ చేయండి. ఒకే సప్లైయిర్‌కి అప్పగించవద్దు. దీనివల్ల పనుల్లో ప్రగతి ఉంటుంది. ఉపాధిహామీ పనుల పేమెంట్లను చాలా ప్రాంప్ట్‌గా ఇస్తున్నాం. ఈ పనులపై దృష్టిపెట్టమని కోరుతున్నాను.
గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్కులు, ఆర్బీకేల నిర్మాణంపై కలెక్టర్లు దృష్టి పెట్టండి.
*బీఎంసీలు–ఏఎంసీలు*
9899 బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్ల ఏర్పాటు దశలవారీగా చేపడుతున్నాం. వీటి ద్వారా పాలు పోసే ప్రతి అక్కచెల్లెమ్మకు కూడా ఒక భరోసా లభిస్తుంది. వారు పోసే పాలు ఏ క్వాలిటీ, ఎన్ని లీటర్లు, ఎంత డబ్బు వస్తుందన్నది అక్కడికక్కడే స్లిప్ ద్వారా తెలుసుకోవచ్చు. వాళ్ల కళ్లముందే, వాళ్ల ఊరులోనే ఈ రకమైన సౌకర్యం పొందవచ్చు. దీనివల్ల ఎలాంటి మోసానికి అస్కారం ఉండదు. ఇది చాలా ముఖ్యమైనది. ఈ కార్యక్రమం పైన కూడా కలెక్టర్లు దృష్టి పెట్టండి.
*డిజిటల్ లైబ్రరీలు*
ప్రతి గ్రామ పంచాయతీల్లో డిజిటిల్ లైబ్రరీలు తీసుకువస్తున్నాం.
డిసెంబర్ నాటికల్లా సుమారు 2824 గ్రామ పంచాయితీలకు ఫైబర్ గ్రిడ్ చేరుతుంది. అక్కడ భూములను గుర్తించి, లైబ్రరీల నిర్మించడంపై దృష్టిపెట్టాలి. ఎన్‌ఆర్‌జీఎస్ పనులను జేసీ డెవలప్‌మెంట్‌కు ఇవ్వాలి.
సెకండరీ ఫుడ్‌ప్రాససింగ్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి ప్రతి పార్లమెంటు నియోజకవర్గాల్లో భూమలు గుర్తింపు పూర్తికావాలి.
వచ్చే స్పందన నాటికి అన్ని జిల్లాల్లో పూర్తవ్వాలి.
*భవన నిర్మాణ పక్షోత్సవాలు*
జూన్ 17 నుంచి జూలై 2వరకూ వివిధ కార్యక్రమాల కింద కడుతున్న భవనాలపై భవన నిర్మాణ పక్షోత్సవాలు నిర్వహించబోతున్నుట్టు సీఎంకు వివరించిన అధికారులు.
భవనాల వారీగా విశ్లేషణ, రోజువారీ సమీక్షలు, పనులు శీఘ్రగతిన జరిగేలా టీంలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపిన అధికారులు.
*జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష*
జగనన్న శాశ్వత భూహక్కు కార్యక్రమం కోవిడ్‌కారణంగా ఆశించినంత వేగంగా కదల్లేదు.
ఇది పూర్తైతే వివాదాలకు పూర్తిగా చెక్ పడుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమంపై దృష్టిపెట్టాలి. క్రమం తప్పకుండా స్పందనలో దీనిపై రివ్యూ చేస్తాను. ఈ కార్యక్రమం ప్రగతిని పర్యవేక్షిస్తాను.
*ఇళ్లపట్టాలు :*
-కోర్టు కేసుల కారణంగా 3,70,201 మందికి ఇళ్లస్థలాలు రాలేదు.
పేదవాడికి ఇంటి పట్టాలు రాకూడదని టీడీపీ లాంటి ప్రతిపక్షాలు అన్యాయంగా కేసులువేసి అడ్డుకున్నాయి.
– ఇప్పుడు హైకోర్టు సెలవులు కూడా ముగిశాయి.
– ఇప్పుడు ఇలాంటి కేసులమీద దృష్టిపెట్టండి.
– ప్రతిరోజూ రివ్యూ చేసి చర్యలు తీసుకోండి:
– కలెక్టర్లు, జేసీలు ఈ కేసులు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోండి.
– దీనిమీద ప్రత్యేకమైన ధ్యాసపెట్టాలి.
– దీనివల్ల 3.7లక్షలకుపైగా కుటుంబాలకు ఎనలేని మేలు జరుగుతుంది.
– అలాగే 90 రోజుల్లోగా ఇంటి పట్టాలు ఇవ్వడంపై దృష్టిపెట్టాలి.
– 1.72 లక్షలమందికిపైగా అర్హులని అధికారులు తేల్చారు.
– ఇందులో 38వేల మందికి ఇప్పుడున్న ఉన్న లేఅవుట్లలోనే పట్టాలు ఇస్తున్నారు.
– మరో 9,794 మందికి కొత్త లే అవుట్లలో ఇస్తున్నారు.
– వీరికి వచ్చే స్పందనలోగా పట్టాలు ఇవ్వాలి:
– పెండింగులో 11,741 దరఖాస్తులను వచ్చే స్పందనలోగా పరిష్కరించాలి:
– 1.24లక్షల మందికి వీలైనంత త్వరగా భూసేకరణ చేసి పట్టాలు ఇవ్వాలి:
*ఇళ్లనిర్మాణం*
తొలివిడతలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం.
జగనన్నకాలనీలకు సంబంధించి 4,120 చోట్ల తాగునీరు, కరెంటు ఏర్పాటు చేశారు, మిగిలిన కాలనీల్లో జూన్ నెలాఖరు కల్లా తాగునీరు, కరెంటు సౌకర్యాలను ఏర్పాటు పూర్తికావాలి.
సొంత స్థలాలు ఉన్నవారికి 3.84 లక్షల ఇళ్లు ఇచ్చాం. వాటిని శరవేగంగా పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలి.
*ఇళ్ల నిర్మాణం– ప్రజా ప్రతినిధులతో సమీక్ష*
ఇళ్లనిర్మాణం విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో క్రమం తప్పకుండా సమీక్షలు చేయాలి. దీనివల్ల క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుస్తాయి, తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో సమీక్షా సమావేశాలు ఏర్పాటు కావాలి.
*ఇసుక సరఫరా*
ఇసుక రీచ్‌లు 40 కిలోమీటర్ల లోపల ఉంటే, లే అవుట్ల వద్దే ఇసుకను ఇవ్వండి. 40 కిలోమీటర్ల కన్నా దూరంగా ఉంటే... జేపీ వెంచర్స్ లిమిటెడ్ ద్వారా లే అవుట్లకు ఇసుకను చేరవేయాలి.
జూన్ 30లోగా కాలనీల్లో మౌలిక సదుపాయల ఏర్పాటుపై డీపీఆర్‌లు తయారుచేయాలి.
*కర్ఫ్యూ– సడలింపు*
జూన్ 20వరకూ కర్ఫ్యూ ఉంటుంది, ఆ తర్వాత కొన్ని సడలింపులు ఇవ్వాల్సి ఉంటుంది.
సడలింపులు ఇస్తూనే కర్ఫ్యూ కొనసాగించాల్సి ఉంది.
*పథకాల క్యాలెండర్*
జూన్ 22న చేయూత పథకాన్ని ప్రారంభిస్తున్నాం. దీనికి కలెక్టర్లు అంతా సిద్ధంకావాలి.
జూలైలో విద్యాదీవెన, కాపు నేస్తం పథకాలు అమలు.
దీనికి సంబంధించి కూడా కలెక్టర్లు సన్నద్ధంగా ఉండాలి.
జూలై 1న వైయస్సార్ బీమా ప్రారంభం అవుతుంది.
ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డీజీపీ గౌతం సవాంగ్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నీరబ్ కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్దిశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్‌జైన్, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్టర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె ఎస్ జవహర్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయితీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్, ఆర్ధికశాఖ కార్యదర్శి సత్యనారాయణ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
addComments
Post a Comment