స్వచ్ఛ సంకల్పంపై సర్పంచ్‌లతో వర్చ్యువల్ గా ప్రతిజ్ఞ చేయించిన మంత్రి


 

అమరావతి (ప్రజా అమరావతి);


*- జగనన్న స్వచ్ఛసంకల్పం సన్నాహక శంఖారావం కార్యక్రమం*

*- ప్రారంభించిన మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి*

*- తాడేపల్లి పిఆర్ కమిషనర్ కార్యాలయం నుంచి  గ్రామ సర్పంచ్‌లతో వీడియో కాన్ఫెరెన్స్* 

- స్వచ్ఛ సంకల్పంపై సర్పంచ్‌లతో వర్చ్యువల్ గా ప్రతిజ్ఞ చేయించిన మంత్రి.


గ్రామీణ పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సీఎం శ్రీ వైయస్ జగన్ ఆలోచనల నుంచి వచ్చిన 'స్వచ్ఛసంకల్పం'లో ప్రతి గ్రామసర్పంచ్ భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనులు, గ్రామ సచివాలయాల శాఖామంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం సన్నాహక శంఖారావం సందర్బంగా తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనర్ కార్యాలయం నుంచి 13 జిల్లాల గ్రామ సర్పంచ్‌లతో నిర్వహించిన వీడియో కార్ఫెరెన్స్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో గ్రామసీమలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలని నిత్యం సీఎం శ్రీ వైయస్ జగన్ తపిస్తూ ఉంటారని, అందుకోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వపరంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో ఆరోగ్యకరమైన గ్రామాలు ఉండాలనే లక్ష్యంతో పనిచేయాలన్న సీఎం సంకల్పం నుంచి జగనన్న స్వచ్ఛసంకల్పం కార్యక్రమం ఒక ఉద్యమ రూపంలో ప్రజల్లోకి తీసుకువస్తున్నామని అన్నారు. తమ ఇంటిని ఎలా అయితే పరిశుభ్రంగా ఉంచుకుంటారో, అలాగే తమ గ్రామాన్ని కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని గ్రామాలను వ్యర్థాలు రహితంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రారంభిస్తున్న జగనన్న స్వచ్ఛసంకల్పంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు.


*మహానేత వైయస్‌ఆర్ జయంతి నాడు కార్యక్రమం ప్రారంభం*

 జూలై 8వ తేదీన మహానేత స్వర్గీయ వైయస్‌ఆర్ జయంతి రోజున జగనన్న స్వచ్ఛసంకల్పంను సీఎం శ్రీ వైయస్ జగన్ గారు ప్రారంభిస్తున్నారని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా మంచి ఫలితాలను తీసుకురావడానికి గ్రామ సర్పంచ్‌లు బాధ్యత తీసుకోవాలని సూచించారు. గ్రామ సర్పంచ్‌ల భాగస్వామ్యంతోనే పల్లెల రూపురేఖలు మారుతాయని, ప్రజాప్రతినిధులుగా మీ ఎదుగుదలకు సర్పంచ్‌ పదవి తొలిమెట్టు కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని అన్నారు. పట్టణాలకు ధీటుగా మీ గ్రామాలను తీర్చిదిద్దుకోవాలని, ప్రతిగ్రామం పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడాలని కోరారు. ఇందుకోసం పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచాలని, జగనన్న స్వచ్ఛసంకల్ప కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని అన్నారు. గతంలో 


*పరిశ్రుభతా ఉద్యమానికి పల్లెలు కలిసి వస్తాయి*

పరిశుభ్రతా పక్షోత్సవాలు, వ్యర్థాలపై పోరులో పల్లెలు కలిసి వచ్చాయని గుర్తు చేశారు. వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం పేరుతో నిర్వహించిన కార్యక్రమం వల్ల 61,514 గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సమస్యలను పరిష్కరించామని, ప్రజల నుంచి 6.21 కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా విరాళాలుగా వచ్చాయని తెలిపారు. మనం నిర్వహించిన పరిశుభ్రతా కార్యక్రమాల వల్ల గత ఏడాదితో పోలిస్తే అంటువ్యాధులు 95శాతం తగ్గాయని, ఇది ఒక జాతీయ నిర్వహించిన సర్వేలో వెల్లడైన వాస్తవం అని అన్నారు. అంతేకాదు దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో 567 ఓడిఎఫ్‌ ప్లస్ గ్రామాలుగా గుర్తింపు పొందడం విశేషమని అన్నారు. ఇదే స్పూర్తితో రాష్ట్రంలో 13,371 పంచాయతీల్లో జూలై 8న ప్రారంభమయ్యే జగనన్న స్వచ్ఛసంకల్పంను విజయవంతం చేయాలని కోరారు. 


*ఆర్థికంగా పంచాయతీలను పరిపుష్టం చేస్తాం*

పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, 15వ ఆర్థికసంఘం ద్వారా 1320 కోట్ల రూపాయలను గ్రామ పంచాయతీలకు అందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయాలనే లక్ష్యంతో 13,095 సర్పంచ్‌లకు గానూ 11,152మందికి చెక్ డ్రాయింగ్ పవర్ ఇచ్చామని అన్నారు. మిగిలిన 1943 మంది సర్పంచ్‌లకు కూడా రెండుమూడు రోజుల్లో చెక్ పవర్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆరోగ్యతోనే అభివృద్ధి అనే సీఎం శ్రీ వైయస్ ఆకాంక్షల మేరకు అందరూ పనిచేయాలని, పారిశుధ్యంతోనే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఈ ప్రభుత్వం గట్టిగా నమ్ముతోందని మరోసారి స్పష్టం చేశారు. ఉత్సాహంగా పనిచేసి, మంచి ఫలితాలను సాధించిన సర్పంచ్‌లకు, అధికారులను ప్రభుత్వం సన్మానిస్తుందని తెలిపారు.  


*100 రోజుల జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాలు ఇవే*

జూలై 8వ తేదీ నుంచి వంద రోజుల పాటు జగనన్న స్వచ్ఛసంకల్పం కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది.

- 1వ రోజు నుంచి 10వ రోజు వరకు: కార్యక్రమం ప్రారంభోత్సవంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడం

- 11వ రోజు నుంచి 20వ రోజు వరకు : గడప గడపకు ప్రచారం

- 21వ రోజు నుంచి 30వ రోజు వరకు : ఘన వ్యర్థపదార్ధాల నిర్వహణపై దృష్టి పెట్టడం

- 31వ రోజు నుంచి 40వ రోజు వరకు : వనరుల సమీకరణ

- 41వ రోజు నుంచి 50వ రోజు వరకు : తడి, పొడి చెత్త ఇంటివద్దే వేరు చేసి ఇచ్చే విధంగా అవగాహన కల్పించడం

- 51వ రోజు నుంచి 60వ రోజు వరకు : ద్రవ వ్యర్థ పదార్ధాల నిర్వహణలో భాగంగా కమ్యూనిటీ సోక్ పిట్స్ (ఇంకుడు గుంతలు) గుర్తించి నిర్మాణం చేపట్టడం

- 61వ రోజు నుంచి 70వ రోజు వరకు : టాస్క్ ఫోర్స్‌ కమిటీల ఏర్పాటు ద్వారా తాగునీటి, పారిశుధ్య సమస్యలను గుర్తించి పరిష్కరించడం

- 71వ రోజు నుంచి 80వ రోజు వరకు : గ్రామంలోని అన్ని తాగునీటి వనరులను శుభ్రపరచడం

- 81వ రోజు నుంచి 90వ రోజు వరకు : ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించడం

- 91వ రోజు నుంచి 100వ రోజు వరకు : గ్రామ పారిశుధ్య ప్రణాళిక తయారు చేసి గ్రామసభలో ఆమోదించడం.


ఈ వీడియో కాన్ఫెరెన్స్‌లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ ఎం.గిరిజాశంకర్, స్వచ్ఛాంధ్ర ఎండి సంపత్‌కుమార్, జగనన్న స్వచ్ఛ సంకల్పం ఓఎస్‌డి దుర్గాప్రసాద్, పలు జిల్లాల అధికారులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. 


*వీడియో కాన్ఫెరెన్స్‌లో మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పలువురు గ్రామసర్పంచ్‌ లు మాట్లాడారు.* 


*ఇందిరెడ్డి స్వాతి, మహిళా సర్పంచ్, ఆదినిమ్మాయపల్లి, కడపజిల్లా:*

 కోవిడ్ సంక్షోభ సమయంలోనూ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించగలిగాం. పల్లెసీమలు దేశానికి పట్టుకొమ్మలు అన్న మాటలను నిజం చేస్తున్న సీఎం శ్రీ వైయస్‌ జగన్ గారి ప్రోత్సాహంతో మా గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకుంటున్నాం. పల్లెల్లో సిమెంట్‌ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపడుతున్నాం. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రజలను భాగస్వాములను చేస్తున్నాం. మీరు ప్రారంభిస్తున్న జగనన్న స్వచ్ఛ సంకల్పంలో ప్రజా భాగస్వామ్యంను మరింత పెంచుతాం. 


*తోట అనూష, మహిళా సర్పంచ్, ఓర్వకల్, కర్నూలుజిల్లా:*

కరోనా విపత్తు సమయంలో ఆరోగ్యకరమైన గ్రామాల కోసం జగనన్న స్వచ్ఛసంకల్పం సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. ప్రతి ఇంటి నుంచి వ్యర్థాలను సేకరిస్తున్నాం. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం. ద్రవ, ఘన వ్యర్థాలను ఏ రకంగా వర్గీకరించాలి, వాటిని ఎలా వేస్ట్ మేనేజ్‌మెంట్ చేయాలనే దానిపై ప్రజలకు వివరిస్తున్నాం. ప్రజలకు శానిటేషన్ ప్రాముఖ్యతను తెలియచేస్తున్నాం. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో గ్రామంలో బ్లీచింగ్ పౌడర్, కరోనా పాజిటీవ్ వచ్చిన ప్రాంతల్లో హైపో ద్రావణం స్ర్పై చేయించడం, కోవిడ్ పేషంట్లను ఐసోలేషన్‌ పంపించడం, వారి కుటుంబాలకు ధైర్యం చెబుతున్నాం. గ్రామ సర్పంచ్‌గా బాధ్యతగా పనిచేస్తున్నాం. 


*బి.శ్రీదేవి, జమ్మలపాలెం, మహిళా సర్పంచ్, నెల్లూరు జిల్లా:*

రాష్ట్రం అభివృద్ది చెందడం అంటే గ్రామాలు అభివృధ్ధి చెందడమేనని సీఎం శ్రీ వైయస్ జగన్ గారు భావిస్తున్నారు. అందుకే గ్రామాల్లోని ప్రజల పట్ల ఎంతో బాధ్యతతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్యభద్రత, పారిశుధ్యం ఎంత ముఖ్యమో ప్రజలు ఈ సమయంలో తెలుసుకుంటున్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం వల్ల గ్రామాల్లో పారిశుధ్యం, వ్యర్థాల నిర్మూలన, అంటువ్యాధుల పట్ల అప్రమత్తత పెరుగుతోంది. నూతనంగా సర్పంచ్‌లుగా ఎన్నికైన మాకు మా పంచాయతీల ఆరోగ్యంకు కాపాడే బాధ్యతల్లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమంలో అవకాశం కల్పించినందుకు పంచాయతీరాజ్‌ శాఖకు కృతజ్ఞతలు*ఎస్. సుధాకర్ రెడ్డి, సర్పంచ్, జువ్వలేరు, ప్రకాశం జిల్లా:* 

జగనన్న స్వచ్ఛ సంకల్ప శంఖారావం కార్యక్రమంలో పాల్గొనడం ఉత్సాహంగా ఉంది. ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఊరు బాగుంటేనే, ప్రజలు బాగుంటారు అనే ఇలాంటి కార్యక్రమాన్ని ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. ఇంటింటికి దీనిపై ప్రచారం చేస్తున్నాము. కరోనా సమయంలో కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాము. కరోనా బాధితులను గుర్తించి, వారితో మాట్లాడి, వారి ఆరోగ్యానికి సహకరిస్తున్నాము. మండల నుంచి జిల్లా స్థాయి వరకు ఈ కార్యక్రమం మా గ్రామంలో బాగా జరగాలని కోరుకుంటున్నాము. మా గ్రామ పంచాయతీ ఇంకా క్లీన్ అండ్ గ్రీన్‌ గా ఉండబోతుంది.