’’* అనే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ మేధావులు, పౌరుల సమాఖ్య(ఎపిక్‌) ఆధ్వర్యంలో

 ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రెండేళ్ళ పరిపాలన పూర్తయిన సందర్భంగా *‘‘ఆంధ్రప్రదేశ్‌లో మీడియా పాత్ర – న్యాయపరమైన సమస్యలు’’* అనే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ మేధావులు, పౌరుల సమాఖ్య(ఎపిక్‌) ఆధ్వర్యంలో


మంగళవారం సాయంత్రం వర్చువల్‌ మీటింగ్‌ జరిగింది.

విజయవాడ (ప్రజా అమరావతి);

ఏపీలో జగన్‌ అద్భుతమైన మెజారిటీతో ముఖ్యమంత్రిగా పీఠమెక్కిన తర్వాత నవరత్నాలు, మేనిఫెస్టోతో తన పాలనకు శ్రీకారం చుట్టారు. ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర నిర్వహించాల్సిన 23 స్థానాలకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ కానీ... అసెంబ్లీలో అసలు ప్రాతినిద్యమే లేని బీజేపీ, ఉభయ కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ వంటి పార్టీలు ప్రభుత్వానికి సంక్షేమ, ప్రజాహిత కార్యక్రమాల్లో సముచిత సహకారం అందించాల్సింది పోయి – ప్రతి దాన్నీ విమర్శించడం, తెగనాడడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు. దీనికి అనుకూల మీడియా గోబెల్స్‌ను మించిన స్థాయిలో తప్పుడు ప్రచారాలు చేయడం పరిపాటిగా మారింది.


అంతేకాక ప్రజా మద్ధతు కోల్పోయిన తెలుగుదేశం పార్టీ తమ వైఫల్యాలను సమీక్షించుకోవాల్సింది పోయి – ప్రతి అంశాన్ని లిటిగేషన్ల ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ – ప్రజాకోర్టులో నెగ్గలేక జ్యూడీషియరీని ఆశ్రయిస్తూ ఇటు కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని అటు విలువైన సమయాన్ని వృధా చేస్తున్న తీరు మొదలైన విషయాలపై ‘ఎపిక్‌’ ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్చువల్‌ మీటింగ్‌ తీవ్రంగా గర్హించింది.


*‘ఎపిక్‌’ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆర్‌టిఐ పూర్వ కమిషనర్ శ్రీ‌ పి. విజయ బాబు మాట్లాడుతూ...*

పరిపాలనలో తలెత్తే అంశాలను లిటిగేషన్ల ద్వారా అడ్డుకోవాలని చూడడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమని విమర్శించారు. కొన్ని కొన్ని సందర్భాలలో కోర్టు తీర్పుకు వక్రభాష్యం చెప్పడం, కోర్టు వ్యాఖ్యానాలను తమ అనుకూల మీడియా ద్వారా మసిపూసి మారేడుకాయ చేసి చూపడం ఇటీవలి కాలంలో తెలుగుదేశం లాంటి పార్టీలకు పరిపాటి అయిందని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవులను అడ్డుపెట్టుకున్న పూర్వ ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ వ్యవహారశైలికి ఎప్పటికప్పుడు ఎపిక్‌ ధీటైన సమాధానాలిస్తూ... ఆయన దూకుడుకు కళ్ళెం వేసిన విషయాన్ని ఈ సందర్భంగా విజయబాబు గుర్తు చేశారు.

అలాగే మీడియా విలువలను, సాంప్రదాయాలను తుంగలో తొక్కి – డిబేట్లు, మోడరేటర్, న్యూస్‌ అనే పదాలకు అర్ధాలు పూర్తిగా మార్చేసి అధికారపార్టీపై ఏకపక్షంగా దాడి చేయడం, జగన్‌ తల నరుకుతా వంటి చర్చలు పెట్టి హెడ్డింగ్స్‌ హైలెట్‌ చేస్తూ... ఇదే జర్నలిజమని తొడలు చరుచుకుంటూ... ఇది రాజద్రోహం కాదనీ... చట్టాల్లో ఉన్న లూప్‌హోల్స్‌ను అవకాశంగా తీసుకుని తప్పించుకోజూస్తున్న సోకాల్డ్‌ మీడియా సంస్థలు, వాటిని మోస్తున్న బోయీలు ఇప్పటికైనా తీరుమార్చుకోకుంటే త్వరలో భారీ మూల్యం చెల్లించక తప్పదని విజయబాబు హెచ్చరించారు.


*ఫార్మా కాలేజ్‌ ఆచార్యులు డాక్టర్‌ అవనాపు శ్రీనివాసరావు మాట్లాడుతూ...*

వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వాలకన్నా పూర్తిగా భిన్నమైనదని వ్యాఖ్యానించారు. అభివృద్ధి–సంక్షేమం రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం తన ప్రధాన ప్రాముఖ్యతలను నిర్ధేశించుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటూ ముఖ్యమంత్రి జగన్‌ విజయవంతంగా ముందుకు సాగుతున్నారని కితాబిచ్చారు. ఈ తరుణంలో ఒకట్రెండు మీడియా సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిగట్టుకుని విషప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ రెండేళ్ళ ప్రజా పాలన చూసిన తర్వాతైనా ఆ ఒకట్రెండు మీడియా సంస్థలు కూడా మిగిలిన మూడేళ్ళలో రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరిగే విధంగా ప్రభుత్వానికి సహకరించాలని శ్రీనివాసరావు కోరారు.


*రాజకీయ విశ్లేషకులు శ్రీ‌ డి. బాలాజీరెడ్డి మాట్లాడుతూ...*

నేను విన్నాను – నేను ఉన్నాను అని పాదయాత్రలో చెప్పినట్లే... అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తూచా తప్పకుండా చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందని అన్నారు. అభివృద్ధి అంటే సంక్షేమం, సంక్షేమం అంటే అభివృద్ధి అనే కోణంలో వినూత్నమైన పరిపాలన అందిస్తున్నారని ప్రశంసించారు. దీన్ని సహజంగానే సహించలేని ఎల్లో మీడియా చంద్రబాబునాయుడును అమాంతం ముఖ్యమంత్రిని చేసేయాలన్నంత ఆతృతగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈ క్రమంలో మీడియా పరంగా తాము పోషించాల్సిన పాత్రను సైతం విస్మరించి ప్రజల పక్షాన కాక కేవలం ఒక పార్టీ పక్షాన నిలుస్తున్నాయని నిందించారు. ప్రజాస్వామ్యంలో ఇది ఏమాత్రం హర్షణీయం కాదన్నారు. ఇక మరోవైపు వ్యవస్థలో పేరుకుపోయి ఉన్న వ్యక్తులు, తెలుగుదేశం ఆఫీసులో పనిచేసిన వారి ప్రభావం – పరోక్షంగా, ప్రత్యక్షంగా ఏపీ ప్రభుత్వంపై పడి న్యాయపర ఇబ్బందులకు చేయూతనిస్తుందని తెలిపారు. 151మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న జగన్‌కు అడుగడుగునా న్యాయస్థానాల్లో అడ్డు తగలడం చూస్తుంటే చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారనడానికి నిదర్శనమని బాలాజీరెడ్డి చెప్పారు.


*ఆర్‌టిఐ యాక్టివిస్ట్ శ్రీ జి. శాంతమూర్తి మాట్లాడుతూ...*

జగన్‌ రెండేళ్ళ పాలన స్పూర్తిదాయకమే కాక ఛారిత్రాత్మకమని పేర్కొన్నారు. గుప్తుల కాలం నాటి స్వర్ణయుగాన్ని తలపించిందన్నారు. సత్ఫలితాలు సాధించాలనుకున్న వారికి అనుభవంతో పని లేదన్న సత్యాన్ని జగన్‌ చక్కగా నిరూపించారని అభినందించారు. నాడు–నేడు వంటి కార్యక్రమాలతో చరిత్రను తిరగరాస్తున్నారన్నారు. రాయల కాలం నాడు రోడ్లపై రత్నాలు పోసిన మాదిరి నేడు జగన్‌ గడపగడపకూ నవరత్నాలను పంచుతూ ముందుకు సాగుతున్నారన్నారు. చెప్పిన చెప్పని ఎన్నో ప్రజోపయోగ పనులు చేస్తూ దేశంలోనే ఆదర్శ సీఎంగా గుర్తింపు పొందారని చెప్పారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నా... ఒక్క పధకం అమలు విషయంలో కూడా వెనుకంజ వేయని మానవీయ ముఖ్యమంత్రిగా జగన్‌ను ప్రజలు గుర్తించి ఆరాధిస్తున్నట్లు వెల్లడించారు. దీన్ని సహించలేని ఎల్లో మీడియా అయినదానికి కానిదానికి ప్రభుత్వంపై బురదజల్లుతుందని ధ్వజమెత్తారు.


*సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీ మల్లిఖార్జునమూర్తి మాట్లాడుతూ...*

రాజ్యాంగం నిర్దేశించిన లెజిస్లేచర్‌, ఎగ్జిక్యూటివ్‌, జ్యుడిషరీ వ్యవస్ధల సమన్వయంతో దేశంలో ఏ రాష్ట్రంలోనైనా పరిపాలన ముందుకు సాగుతుంది. అయితే ఇటీవల కాలంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలోను కొందరు కోర్టులకు వెళ్లి అడ్డంకులు సృష్టించడం మనం చూస్తూ ఉన్నాం. నిజానికి తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న మైనారిటీస్‌ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఒక విషయాన్ని స్పష్టం చేసింది. పరిపాలనా పరంగా తీసుకునే ప్రతి నిర్ణయంలో కోర్టులు జోక్యం చేసుకోవడం సరైనది కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆంధ్రప్రదేశ్‌ లో శ్రీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అడ్డుకునేవిధంగా అస్ధిరపరచాలనే విధంగా ప్రతిపక్షంతోపాటు కొందరు కోర్టులకు వెళ్తున్నట్లుగా, న్యాయపరంగా అడ్డంకులు సృష్టిస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ విధంగా పరిపాలనా పరంగా అడ్డంకులు సృష్టిస్తూ తద్వారా వచ్చే ఎన్నికలకు వెళ్లాలనే ఓ కుట్రతో ఇదంతా సాగుతున్నట్లుగా అనుమానాలు వస్తున్నాయి. మూడురాజధానుల ఏర్పాటు, హైకోర్టు అంశాల విషయంలో కూడా అడ్డంకులు సృష్టించారు. కొందరు నేతలు పదవీకాంక్ష, దుర్భుధ్దితో వ్యవహరిస్తున్నారు. న్యాయవాదులకు సంబంధించి సంక్షేమనిధికి చంద్రబాబు హయాంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. శ్రీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చాక దాదాపు 100 కోట్ల రూపాయలు సంక్షేమనిధికి ప్రకటించారు. న్యాయవాదుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నారు.


*రచయిత, సీనియర్‌ జర్నలిస్ట్‌ శ్రీ టి. నాగభూషణరావు మాట్లాడుతూ...*

ముఖ్యమంత్రిగా శ్రీ వైయస్‌ జగన్‌ పరిపాలనా కాలం దాదాపుగా సగం పూర్తి అయింది. ఈ రెండు సంవత్సరాల కాలంలోనే శ్రీ వైయస్‌ జగన్‌ సంక్షేమ ముఖ్యమంత్రిగా సామాన్యులచే 100 మార్కులు సాధించారు. సంక్షేమ పథ‌కాల దృష్ట్యా వందకు వందశాతం విజయపధంలో పయనిస్తున్నారు. ఇంకా మూడు సంవత్సరాల పదవీకాలంలో చూడాల్సిన కోణాలు, చేయాల్సిన పనులు మిగిలిఉన్నాయి. ఈ మూడు సంవత్సరాల కాలంలో సంక్షేమ ముఖ్యమంత్రి నుంచి సమగ్ర ముఖ్యమంత్రి స్ధాయికి ఎదగాలనేది నా ఆకాంక్ష. ఎక్కడాకూడా ఏ వర్గం వారికీ ఇబ్బంది కలిగించకుండా రాష్ట్ర సమగ్రాభివృధ్దికి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు నడవాలని భావిస్తున్నాను. ఇప్పటికి అమలు చేస్తున్న సంక్షేమ పథ‌కాలే కాకుండా రాష్ట్రాన్ని పారిశ్రామికంగాను, అన్ని రంగాలలోను అభివృధ్ది సాధించేలా ఆ నిర్ణయాలు ఉండాలని చెబుతున్నాను. ఉమ్మడి రాష్ట్రంతోపాటు ఇప్పటివరకు రాష్ట్రాన్ని పరిపాలించిన అందరి ముఖ్యమంత్రులకంటే రాష్ట్రాన్ని మరింత సమగ్రంగా అభివృధ్ది చేసేలా శ్రీ వైయస్‌ జగన్‌ చేరుకోవాలని కోరుకుంటున్నాను.

      మీడియా అనేది ఏదో ఒక రాజ‌కీయ‌ప‌క్షానికి కొమ్ముకాయ‌టం అల‌వాటుగా మారిపోయింది. హైకోర్టు, సుప్రీం కోర్టులు ఇటీవ‌ల కాలంలో ఇస్తున్న తీర్పుల‌ను సైతం ఎవ‌రికి అనుకూలంగా వారు అన్వ‌యించుకుంటూ ప్ర‌చురిస్తున్నారు. దీనివ‌ల్ల ప్ర‌ధాన మీడియా ప‌ట్ల ప్ర‌జ‌ల్లో విశ్వాసం స‌న్న‌గిల్లుతుంది. దాంతో, ప్ర‌జ‌లు సోష‌ల్ మీడియావైపు మొగ్గు చూపుతున్నారు. ప్ర‌ధాన మీడియా త‌న వికృత చేష్ట‌ల‌ను ఆపి రాజ‌కీయాల‌కు ప్ర‌భావితం కాకుండా ప‌నిచేయ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంది.


*బిబిఏ మాజి అధ్యక్షుడు, సీనియర్‌ అడ్వకేట్ శ్రీ‌  పిళ్లా రవి మాట్లాడుతూ...*

శ్రీ వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం వివిధ అంశాలపై కోర్టులలో నమోదైన పిటీషన్లు వాటికి సంబంధించిన ఆర్డర్లు చూస్తే అత్యధిక శాతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రభుత్వం తరపున ఉన్న న్యాయ కోవిదులు, సలహాలు ఇస్తున్న వారు...కోర్టులలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న ఆర్డర్లకు సంబంధించి ముఖ్యమంత్రి ప్రతి 15 రోజులకు నెలరోజులకు ఒకసారి తప్పనిసరిగా రివ్యూ చేయాల్సిన అవసరం ఉందని నా వ్యక్తిగత అభిప్రాయంగా చెబుతున్నాను. ఎఫెక్టివ్ జ్యుడీషరీ టీమ్‌ ను ఏర్పాటు చేసుకోవాలి. వాటిపై పలువురు న్యాయవాదులతో అభిప్రాయాలు తీసుకుని పకడ్భందిగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. రఘురామ కృష్ణంరాజు కేసు విషయంలో కోర్టులలో వచ్చిన ఆర్డర్లు చూస్తే తక్కువ సమయంలో కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టుల వరకు త్వరితగతిన స్పందించినట్లు అవగతమవుతుంది. ఇదే సామాన్యుడి విషయంలో కూడా జరుగుతుందా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.


*ప్రొఫెసర్, లా కాలేజీ మాజి ప్రిన్సిపల్ డాక్ట‌ర్‌ ముధ్దా బెంజ‌మిన్‌ మాట్లాడుతూ...*

ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలలో శ్రీ వైయస్‌ జగన్‌ తన రెండేళ్ల కాలంలోనే పూర్తి చేసి ప్రజలలో మరింతగా విశ్వాసం చూరగొన్నారు. తత్వవేత్త, కవి అయిన జేమ్స్ ఫ్రీమెన్‌ క్లార్క్‌ 1881 కాలంలో అమెరికా అధ్యక్షుడుకి అడ్వయిజర్‌ గా వ్యవహరించారు. ఆయన మాటల్లో చెప్పాలంటే... రాజకీయనేత రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు... పాలకుడు అనే వ్యక్తి రాబోయే తరాల గురించి ఆలోచిస్తాడు. రాజకీయనేత తన పార్టీ విజయం గురించి చూస్తాడు.... పాలకుడు తన దేశ సంక్షేమాన్ని చూస్తాడు. రాజకీయనేత వాలును బట్టి వాలిపోతూ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. పాలకుడు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ విజన్‌ ను మార్చుకుంటుంటాడు. ఇదే మన రాష్ట్రానికి అన్వయించుకుంటే శ్రీ వైయస్‌ జగన్‌ పరిపాలకుడుగా కనిపిస్తాడు. చంద్రబాబు రాజకీయనేతగా కనిపిస్తాడు. చంద్రబాబును గర్వం నాశనం చేసింది. ఆ గర్వం అనేది వైయస్‌ జగన్‌ లో కనిపించదు. న్యాయం చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉండాలి. అప్పుడే ప్రజల ఆదరణ ఉంటుంది. ఇటీవల కాలంలో జడ్జిమెంట్స్‌ అనేవి జడ్జి మేడ్‌ లా లాగా ఉంటున్నాయి. రాజ్యాంగం ప్రకారంగా ఉండటం లేదు.

       చంద్రబాబు అధికారం చేపట్టినప్పుడు శ్రీ కృష్ణ కమిటీ, ఐవైఆర్‌ కృష్ణారావుల అభిప్రాయాల ప్రకారం దొనకొండలాంటి ప్రదేశంలో రాజధాని ఏర్పాటు చేయకుండా మూడు పంటలు పండే ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయడం వల్ల నేటి పరిస్ధితి ఉత్పన్నమైంది. అలా కాకుండా రాజధాని ఏర్పాటుచేసిన ప్రాంతంలో చంద్రబాబు మౌళిక సదుపాయాలు ఏర్పాటుచేసి సరైన విధంగా భూకేటాయింపులు చేసి ఉంటే వైయస్‌ జగన్‌ ప్రస్తుత నిర్ణయం తీసుకుని ఉండాల్సిన పరిస్దితి ఉండేది కాదు.

చంద్రబాబు పోలవరంను ఏటిఎంగా వాడుకున్నారంటూ సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోడి చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు అవినీతికి నిదర్శనంగా నిలిచాయి. శ్రీ వైయస్‌ జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలకు దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆదరణ ఉంది. కాబట్టి రానున్న కాలంలో మరింత మేలైన నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర్రాన్ని అభివృద్ది పధంలోకి తీసుకువెళ్తారనడంలో సందేహం లేదు.