పట్టణ ప్రాంతాల్లో ప్రస్ఫుటమైన మార్పే లక్ష్యంగా క్లాప్ కార్యక్రమం

 


 *పట్టణ ప్రాంతాల్లో ప్రస్ఫుటమైన మార్పే లక్ష్యంగా క్లాప్ కార్యక్రమం* 

 *మున్సిపాలిటీల్లో వ్యర్ధాల సేకరణ, తరలింపునకు కొత్తగా 3100 ఆటోలు* 

 *పారిశుద్ధ్య నిర్వహణపై త్వరలో ఆకస్మిక తనిఖీలు* 

 *పురపాలక కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్సులో మంత్రి బొత్స సత్యనారాయణ* 


విజయవాడ, 14 జూన్ (ప్రజా అమరావతి);


పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత, పారిశుధ్ద్య నిర్వహణను  ప్రణాళికా బద్దంగా నిర్వహిస్తూ రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) గా తీర్చిదిద్దాలని పురపాలక కమిషనర్లను మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలందరూ పరిశుభ్ర వాతావరణంలో జీవించేలా ప్రస్ఫుటమైన మార్పులు కనిపించాలన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా కమిషనర్లందరూ సమగ్రమైన కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి నిర్లిప్తత వద్దని , ఈ విషయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. వంద రోజుల ప్రణాళికతో జూలై నెలలో ప్రారంభం కానున్న క్లాప్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం నాడు పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లతో విజయవాడలోని ఎఎంఆర్ డిఎ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, కార్యదర్శి రామమనోహర్, సిడిఎంఎ ఎం.ఎం.నాయక్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండి సంపత్, ఎపియుఐఎఫ్ డిసి ఎండి బసంత్ కుమార్, టిడ్కో ఎండి శ్రీధర్, మెప్మా ఎండి విజయలక్ష్మి, ఇంజనీరింగ్ ఛీప్ చంద్రయ్య  తదితర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పురపాలక కమీషనర్లందరూ ఉదయమే క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని తద్వారా పౌరులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.  పట్టణ స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పట్టణాల్లోని నివాస , వాణిజ్య ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్ధాల సేకరణ, తరలింపు కోసం త్వరలో 3100 ఆటోలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి తెలిపారు. ఈ ఆటోల ద్వారా వ్యర్ధాల తరలింపునకు అవసరమైన రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకోవాలన్నారు. 

అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ పాలసీ తదితరాలకు అనుగుణంగా అమలు చేయాల్సిన కార్యక్రమాలను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ఇందుకోసం ఆయా మున్సిపాలిటీల్లో కొన్ని వార్డులను ఎంపిక చేసుకోవాలన్నారు. క్లాప్ కార్యక్రమం తాలూకు లక్ష్యాలు, ఉద్దేశ్యాలు కలిగే ప్రయోజనాలపై ప్రజలందరికీ అవగాహన కల్పించడంలో కమిషనర్లు కీలక భూమిక వహించాలన్నారు.