గ్రామ పంచాయతీల్లో అక్రమ లేఅవుట్లను గుర్తించాలి

 నోట్: ఫోటోలు, విజువల్స్ ఉన్నాయి.



తాడేపల్లి (ప్రజా అమరావతి)!


- తాడేపల్లి సిఆర్‌పి కార్యాలయంలో ఉపాధి హామీ, జగనన్న స్వచ్ఛసంకల్పం, గ్రామపంచాయతీల పరిధిలో లేఅవుట్లపై రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష


- గ్రామ పంచాయతీల్లో అక్రమ లేఅవుట్లను గుర్తించాలి

- ప్రభుత్వపరంగా వాటి క్రమబద్దీకరణకు చర్యలు 

- అనుమతి లేని లేఅవుట్ల రెగ్యులరైజ్ తో ప్రభుత్వానికి ఆదాయం

- జగనన్న స్వచ్ఛసంకల్ప్ ద్వారా ఆరోగ్యవంతమైన గ్రామాలు

- పారిశుధ్యం, గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణకు ప్రణాళిక

- దీనిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలి

- కోవిడ్ సమయంలో పల్లెల్లో ప్రత్యేక పారిశుధ్య చర్యల వల్ల సత్ఫలితాలు 

- జగనన్న కాలనీల్లో ఉపాధి హామీ కింద పెద్ద ఎత్తున ప్లాంటేషన్ చేపట్టాలి

- వచ్చే ఏడాది అన్ని కాలనీల్లో అవెన్యూ ప్లాంటేషన్

- నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలి


: మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో ఎటువంటి అనుమతులు లేకుండా వెలుస్తున్న లేఅవుట్లు, నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. తాడేపల్లి సిఆర్‌పి కార్యాలయంలో ఉపాధి హామీ కింద ప్లాంటేషన్, జగనన్న స్వచ్ఛసంకల్పం, గ్రామపంచాయతీల పరిధిలో అనుమతి లేని లేఅవుట్లపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో పెద్ద ఎత్తున ఇళ్ళస్థలాల లేఅవుట్లు వెలుస్తున్నాయని, వాటికి సంబంధించి ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని అన్నారు. వెంటనే అన్ని పంచాయతీల్లోనూ లేఅవుట్లపై పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. లేఅవుట్ల పై పరిశీలనకు ప్రతి మండలానికి ఒక ఈఓఆర్డీని కేటాయిస్తున్నామని, ప్రత్యేకంగా లేఅవుట్ల పరిశీలన బాధ్యతలను అప్పగిస్తామని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. అలాగే డివిజనల్ పంచాయతీ అధికారి పర్యవేక్షణలో మండలాల్లో ర్యాండమ్ తనిఖీలు నిర్వహిస్తామని అధికారులు వివరించారు. సీఎంగారి అనుమతితో అనధికారిక లేఅవుట్ల క్రమబద్దీకరణకు ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని తీసుకువస్తామని, దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో చాలా చోట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల పరిధిలో పంచాయతీలు ఉన్నాయని, ఈ పంచాయతీ స్థలాలకు అనుమతుల సందర్బంగా చెల్లిస్తున్న ఫీజుల్లో సగం పంచాయతీలకు రావాల్సి ఉందని అన్నారు. ఈ మేరకు యుడిఎలతో మాట్లాడి రావాల్సిన డెవలప్‌మెంట్ ఫీజులను వసూలు చేయాలని సూచించారు. 


గ్రామాల్లో పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణకు జగనన్న స్వచ్ఛసంకల్పం పథకం ద్వారా ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. వచ్చే నెల ఎనిమిదో తేదీన సీఎం శ్రీ వైయస్ జగన్ చేతుల మీదిగా ఈ పథకం ప్రారంభమవుతోందని, అప్పటిలోగా పంచాయతీల్లో అన్ని వనరులను సమీకరించుకోవాలని సూచించారు. ప్రతి 250 నివాసాలకు ఒకరు చొప్పున చెత్తను సేకరించే గ్రీన్‌ అంబాసిడర్స్‌ను సిద్దంగా ఉంచుకోవాలని, తడి, పొడి చెత్తలను వ్యర్థాల నిర్వహణా ప్లాంట్‌లకు తరలించి, వాటిని సద్వినియోగం అయ్యేలా చూసుకోవాలని కోరారు. జగనన్న స్వచ్ఛసంకల్ప్‌ సన్నాహక కార్యక్రమాల ద్వారా కోవిడ్ సమయంలో గ్రామాల్లో పారిశుధ్యం, శుభ్రత విషయంలో తీసుకున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇచ్చాయని అన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారని, వారిని కూడా జగనన్న స్వచ్ఛసంకల్ప్‌ కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలని సూచించారు. 


ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టాలని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. గత ఏడాది నాటిన మొక్కల్లో 66 శాతం మొక్కలు బతికాయని ఈ సందర్బంగా అధికారులు వివరించారు. జగనన్న కాలనీల్లో గృహనిర్మాణ పనులు ఈ ఏడాది పెద్ద ఎత్తున ప్రారంభమవుతున్నాయని,  సీఎం శ్రీ వైయస్ జగన్ ఆదేశాల మేరకు వచ్చే ఏడాది ఈ కాలనీల్లో అవెన్యూ ప్లాంటేషన్ భారీగా చేపట్టాలని అన్నారు. ఇందుకు గానూ ఇప్పటి నుంచే అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. నీడనిచ్చే చెట్లతో పాటు హార్టీకల్చర్ మొక్కలను నాటాలని, అవసరమైతే ప్రైవేటు నర్సరీల నుంచి కూడా మొక్కలను కొనుగోలు చేయాలని సూచించారు. ఈ ఏడాది వర్షాలు సకాలంలో ప్రారంభమవుతాయని వాతావరణశాఖ సూచిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉపాధి హమీ కింద మొక్కల పెంపకానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. 


ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్‌ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, సెర్ఫ్ సిఇఓ రాజాబాబు, స్వచ్ఛంద్ర కార్పోరేషన్ ఎండి సంపత్‌కుమార్, నరేగ డైరెక్టర్ చిన్నతాతయ్య, పంచాయతీరాజ్‌ ఇఎన్‌సి సుబ్బారెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఇఎన్‌సి కృష్ణారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments